మాజీ మంత్రి టిడిపి ఎమ్మెల్సీ, ముద్దుకృష్ణమ కన్నుమూత

టిడిపి సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు హఠాన్మరణం చెందారు. 71 సంవత్సరాలు వయసున్న ఆయన మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఇటీవలే గుండె ఆపరేషన్ చేయించుకున్న ఆయన రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన ఆయన ఎన్టీఆర్‌ పిలుపుతో 1983లో రాజకీయ రంగప్రవేశం చేశారు. పుత్తూరు నుంచి ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. విద్య , అటవీశాఖ , ఉన్నత విద్య మంత్రిగా పనిచేశారు. 1994 తెలుగు దేశం సంక్షోభం సమయం లో ఎన్‌టీయార్-లక్ష్మీపార్వతి ల వైపు ఉన్నారు. ఆ తర్వాత చాలా కాలానికి చంద్రబాబు తో కలిసిపోయారు. తెలుగుదేశంతో విభేధించి కాంగ్రెస్‌లో చేరి 2004 ఎన్నికల్లో ఆ పార్టీ శాసనసభ్యునిగా గెలుపొందారు. తిరిగి 2008లో తెదేపాలో చేరి 2009 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి రోజా పై పోటీ చేసి వెయ్యి లోపు ఓట్లతో ఓడిపోయారు. ఆయన మరణంతో తెలుగుదేశం వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.

ఆయనకు భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రేపు స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాపురం లో అంత్య క్రియలు జరగనున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.