మిత్ర‌మా! ఎందుకంత ఉలికిపాటు!!

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడూ, ఆంధ్ర ప్ర‌దేశ్ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత అయిన వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇటీవ‌ల అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం పెద్ద దుమారాన్నే రేపుతోంది. ప్ర‌ధానంగా ఈ స‌మావేశం తెలుగుదేశం పార్టీలో క‌ల్లోలానికి కార‌ణ‌మ‌వుతోంది. ఆ పార్టీ ఎంత ఉలికిపాటుకు గుర‌వుతోందో టీడీపీ నాయ‌కుల స్పందన చెబుతోంది. రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ఎన్డీఏ ఎంపిక చేసిన అభ్య‌ర్థికి మ‌ద్ద‌తునిస్తాన‌ని చెప్ప‌డానికి జ‌గ‌న్ ప్ర‌ధానిని క‌లిశారు. బ‌య‌ట‌కొచ్చి, అదే చెప్పారు. అందుకు కొన‌సాగింపునూ ఇచ్చారు. మంత్రి లోకేశ్ గురించీ, ఇత‌ర‌త్రా అంశాల గురించీ కూడా జ‌గ‌న్ మీడియాతో ప్ర‌స్తావించారు. ఈ కొన‌సాగింపే క‌ల‌క‌లానికి కార‌ణ‌మైంది. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓ ఆర్థిక నేర‌స్థుడ‌నీ, ఆయ‌న‌కు ప్ర‌ధాని అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డ‌మే త‌ప్ప‌న్న‌ట్లు టీడీపీ మాట్లాడుతోంది. ప్ర‌తిప‌క్ష నేత హోదాలో అయిన భేటీనీ వారు రాజ‌కీయం చేశారు.. దానికి కార‌ణం జ‌గ‌న్ టీడీపీపై రాళ్ళు విస‌ర‌డం. ప్ర‌ధాని, జ‌గ‌న్ న‌డుమ అంత‌కు మించి ఏదో జ‌రిగిపోయింద‌ని టీడీపీ అనుమానిస్తోంది. వచ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌తో పొత్తు పెట్టుకోక‌పోవ‌చ్చనే సందేహ‌మూ పార్టీలో ఏర్ప‌డింది. అందుకు త‌గ్గట్టుగానా అన్న‌ట్లు బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడొక‌రు ఈ ఎన్నిక‌ల్లోనూ టీడీపీతో పొత్తు పెట్టుకోవాల‌ని ఏముందంటూ వ్యాఖ్యానించి వాటికి బ‌లాన్ని చేకూర్చారు.

మోడీ దుర్మార్గుడ‌నీ, న‌ర‌హంత‌కుడ‌నీ గుజ‌రాత్ అల్ల‌ర్ల‌ను దృష్టిలో ఉంచుకుని చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆ పార్టీ మ‌రిచిపోయినా బీజేపీ మ‌రిచిపోదు. మ‌రో అడుగు ముందుకేసి, మోడీ ఆంధ్ర ప్ర‌దేశ్‌కు వ‌స్తే అరెస్టు చేయిస్తాన‌నీ అప్ప‌ట్లో హెచ్చ‌రించారు కూడా. త‌దుప‌రి మారిన ప‌రిస్థితుల్లో బెబ్బులి ముందు పిల్లిలా మారిపోయారు చంద్ర‌బాబు. 2014లో అధికార‌మే ల‌క్ష్యంగా సాగారు. బీజేపీతో క‌లిస్తే త‌ప్ప గెలుపు అసాధ్య‌మ‌ని తెలుసుకున్నారు. అప్ప‌టికే వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇమేజ్‌, ఛ‌రిష్మా ఆయ‌న‌కు బెంబేలెత్తించాయి. త‌న సుదీర్ఘ రాజ‌కీయాన్ని రంగ‌రించి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆశ్ర‌యించారు. చివ‌రి నిముషంలో ప‌వ‌న్ ప్ర‌వేశం ఓట‌ర్ల‌ను మెస్మ‌రైజ్ చేసింది. దాని ఫ‌లితంగానే చంద్ర‌బాబు అధికారంలోకి రాగ‌లిగారు. ఇది చెప్ప‌డం చ‌ర్విత‌చ‌ర‌ణంగానే అనిపించ‌వ‌చ్చు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అంటే చంద్ర‌బాబుకు గ‌తంలో ఎంత విద్వేష‌ముండేదో చెప్ప‌డానికే దీన్ని గుర్తుచేయాల్సి వ‌చ్చింది.

ఆనాడు అనేక సంద‌ర్భాలలో అప్ప‌టి హోం మంత్రి చిదంబ‌రంతో ర‌హ‌స్యంగా స‌మావేశ‌మైన సంగ‌తిని కూడా మ‌రిచిపోయినట్టున్నారు చంద్ర‌బాబు. ఆ రోజున ఎవ‌రూ టీడీపీ-కాంగ్రెస్ చేతులు క‌లిపాయ‌ని చెవులు కొరుక్కోలేదే. కాంగ్రెస్ ప‌రిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో అంద‌రికీ తెలుసు కాబట్టి ఆ మాట‌నుకోలేక‌పోయారు. ఇప్ప‌టి ప‌రిస్థితి అలా లేదు. ఎవ‌రెంత కాద‌నుకున్నా వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ‌లీయ‌మైన‌, త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ప్ర‌జాక‌ర్ష‌ణ ఉన్న నాయ‌కుడు. ఏమో మోడీ ఈసారి ఆయ‌న‌తో చేతులు క‌ల‌పాల‌ని అనుకోవ‌చ్చు. ఆర్థిక నేర‌స్థుడు క‌దా ఎలా క‌లుపుతార‌ని ప్ర‌శ్నించుకుంటే.. ఏ కేసు రుజువు కాలేదుగా అని స‌మాధాన‌మై ఇవ్వ‌వ‌చ్చు.

బీజేపీతో మైత్రి నెర‌పుతూనే పుల్ల విరుపు మాట‌లు విసిరుతున్న‌దీ, ఎంత తొంద‌ర‌గా వ‌దిలించేసుకుంటే అంత మంచిద‌నీ అనుకుంటున్న‌దీ టీడీపీనే. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కార‌ణంగా గ‌ణ‌నీయంగానే ఆ వ‌ర్గంలో చంద్ర‌బాబంటే విముఖ‌త ఏర్ప‌డింది. దాన్ని స‌రిచేసుకోడానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి ప్ర‌జాక‌ర్ష‌క నాయ‌కుడి అవ‌స‌రం చంద్ర‌బాబుకు ఎంతైనా ఉంది. దానికి తోడు ప‌వ‌న్ కూడా కొద్ది కాలంగా బీజేపీపైనా కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడుపైనా నిప్పులు చెరుగుతున్నారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అంటూ ప్రాంతీయ వాదాన్ని రెచ్చ‌గొట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ స్థాపించిన‌ప్పుడు ఎన్టీరామారావు సైతం ఆత్మ‌గౌర‌వ నినాదంతో పాటు ఉత్త‌రాది ఆధిప‌త్యాన్ని కూడా ప్ర‌శ్నించారు. ఇంత‌లేసి విమ‌ర్శ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు ప‌వ‌న్ ప‌ట్ల మెత‌క‌వైఖ‌రినే అనుస‌రిస్తున్నారు. బీజేపీతో మైత్రి పోతే కేంద్రంలో ప‌ద‌వులు రావు.. కానీ రాష్ట్రంలో అధికారం చేజిక్కుతుంది. త‌న స్టైల్లో వ‌త్తిడిని తెచ్చి, కేంద్రం ద‌గ్గ‌ర త‌న ప‌బ్బం గ‌డుపుకోవ‌చ్చ‌నేది చంద్ర‌బాబు వ్యూహం అయి ఉండ‌వ‌చ్చు. త‌న వ్యూహం ప‌క్కాగా నెర‌వేరాలంటే ప్ర‌తిప‌క్ష‌నేత‌పై గ‌గ్గోలు చేయాలి. దీన్ని ఎన్నిక‌ల్లో సాధనంగా వాడుకోవాలి.. ల‌బ్ధి పొందాలి.. ఇదీ టీడీపీ అనుస‌రిస్తున్న ప్ర‌స్తుత వైఖ‌రి. అమెరికా విమానం దిగీదిగ‌గానే ఢిల్లీలో చంద్ర‌బాబు కొంద‌రితో ర‌హ‌స్యంగా స‌మావేశ‌మ‌య్యార‌నే వార్త‌లూ వినిపిస్తున్నాయి. జ‌గ‌న్‌తో ప్ర‌ధాని ఏం మాట్లాడార‌నేది తెలుసుకోడానికే ఈ స‌మావేశాల‌య్యుండ‌చ్చు. లేదా.. ఈ అంశంపై విమ‌ర్శ‌లు చేసిన వారిని అదుపులో పెడ‌తాన‌ని చెప్ప‌డానికైనా కావచ్చు.

రాజ‌కీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. డీ మానిటైజేష‌న్ వంటి క్లిష్ట‌మైన ప్ర‌క్రియ‌ను సుళువుగా పూర్తిచేసి, వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌ను దాటుకుని ఎన్నిక‌ల్లో అత్య‌ద్భుత విజ‌యాల‌ను సాధింస్తున్న న‌రేంద్ర మోడీకి దూరంగా జ‌ర‌గ‌డ‌మంత అవివేక‌మైన చ‌ర్య ఉండ‌దు.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com