వైకాపాకి ఆ ఒక్క రాజ్య‌స‌భ స్థానమైనా ద‌క్కుతుందా..?

తెలుగుదేశం పార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను కొన‌సాగిస్తూనే ఉంది. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఉండ‌గా మ‌రిన్ని చేరిక‌లు ఉంటే, ప్ర‌తిప‌క్షాన్ని మాన‌సికంగా మ‌రింత బ‌ల‌హీన ప‌ర‌చొచ్చు అనే వ్యూహంతో టీడీపీ ఉంద‌నే కథ‌నాలు ఈ మ‌ధ్య వ‌చ్చాయి. జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లుపెట్టిన త‌రువాత క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక అధికారికంగా టీడీపీలో చేరారు. ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈశ్వ‌రి చేరిక వెన‌క వైకాపా అనుస‌రించిన వైఖ‌రే ప్ర‌ధాన కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయి. కానీ, ఇది కూడా టీడీపీ కుట్ర అనీ, ఫిరాయింపు రాజ‌కీయమే అంటూ ప్ర‌తిప‌క్ష నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. అయితే, ఈ వ‌ల‌స‌ల ప‌ర్వం ఇంకా కొన‌సాగుతుంద‌నే తెలుస్తోంది.

వైకాపా నుంచి మ‌రో మూడు లేదా నాలుగు చేరిక‌లు త్వ‌ర‌లోనే ఉంటాయ‌నే ప్ర‌చారం టీడీపీ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌కాశం జిల్లాతోపాటు ఉత్త‌రాంధ్ర నుంచి వైకాపాలో చేరేందుకు నేత‌లు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. వీరితోపాటు క‌ర్నూలు జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే, గుంటూరు నుంచి ఒక వైకాపా శాస‌న స‌భ్యుడు చేరే అవ‌కాశం ఉన్న‌ట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే వీరు టీడీపీతో ట‌చ్ లో ఉన్న‌ట్టూ చెబుతున్నారు. మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, కేయీ కృష్ణ‌మూర్తితో కొంద‌రు వైకాపా నేతలు ర‌హ‌స్య మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్టు కూడా వినిపిస్తోంది. ఈ ఊహాగానాలూ క‌థ‌నాల నేప‌థ్యంలో వైకాపాలో ఒకింత గంద‌ర‌గోళం స‌హ‌జంగానే నెల‌కొంటుంది.

అయితే, వీలైనంత త్వ‌ర‌గా మ‌రో మూడు లేదా నాలుగు వ‌ల‌సలు ఉండేలా టీడీపీ ఆత్రుత ప‌డ‌టం వెన‌క వేరే వ్యూహం ఉంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌లు రాబోతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు మూడు స్థానాలు ద‌క్క‌నున్నాయి. పార్టీ సంఖ్యాబ‌లం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని చూస్తే… అధికార పార్టీ టీడీపీకి రెండు రాజ్య‌స‌భ స్థానాలు ద‌క్కుతాయి. ప్ర‌తిప‌క్షానికి ఒక‌టి వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో క‌నీసం మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు వైకాపా నుంచి జంప్ చేసేస్తే… ఆ ఒక్క స్థానం కూడా వైకాపాకి ద‌క్క‌కుండా పోయే అవ‌కాశం ఉంది. టీడీపీ ఎత్తుగ‌డ అదే అని కొంత‌మంది అంటున్నారు. ఆ ఒక్క‌స్థానం కూడా వైకాపాకి ద‌క్క‌నీయ‌కుండా చేయాల‌న్న వ్యూహంతోనే ఇప్పుడు వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. అయితే, త్వ‌ర‌లో వైకాపాను వీడ‌నున్న ఆ నేత‌లు ఎవ‌ర‌నేది మాత్రం పేర్లు ఇంకా బ‌య‌ట‌కి రావ‌డం లేదు. పార్టీ మారిన వారిలో ఇప్ప‌టికే ఎంపీలున్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పుడు మ‌రో ముగ్గురు లేదా న‌లుగురు ఎమ్మెల్యేలు అద‌నంగా పార్టీ వీడితే వైకాపా రాజ్య‌స‌భ స్థానానికి గండిప‌డే అవ‌కాశం క‌చ్చితంగా ఉంద‌నే అనిపిస్తోంది. మ‌రి, అధికార పార్టీ చేస్తున్న ఈ ప్ర‌య‌త్నాన్ని వైకాపా ఏవిధంగా అడ్డుకుంటుందో చూడాలి. ఏదేమైనా, ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా రాజ‌కీయ ల‌బ్ధి పొందొచ్చు అనే ఒక దుస్సంప్ర‌దాయానికి టీడీపీ బాగానే పునాదులు వేసి, ప్రోత్సహిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.