కాంగ్రెస్‌తో పొత్తు టీడీపీలో చిచ్చు పెడుతుందా..?

కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ పొత్తు అంటూ.. కొన్నాళ్లుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. దానికి జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు … బలం చేకూరుస్తున్నాయి. కింది స్థాయిలో తెలంగాణలో మాత్రం.. సానుకూలత వ్యక్తమవుతోంది. అటు తెలంగాణ టీడీపీ నేతలు.. ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు… పొత్తులపై ఆసక్తితో ఉన్నారు. అనుకూలమైన ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఏపీ తెలుగుదేశం పార్టీలో మాత్రం.. కాంగ్రెస్‌తో పొత్తు అంటే… కీలక నేతలు కస్సుమంటున్నారు. గురవారం ఒక్క రోజే.. ఇద్దరు మంత్రులు…” ఛీ.. కాంగ్రెస్‌తో పొత్తేంటి” అన్న రీతిలో స్పందించారు. ఆ ఇద్దరు మంత్రులు అత్యంత సీనియర్లే.. ఒకరు.. కేఈ కృష్ణమూర్తి.. ఇంకొకరు.. అయ్యన్నపాత్రుడు.

మంత్రి అయ్యన్న పాత్రుడు.. ఈ విషయంలో తనదైన శైలిలో విమర్శలు చేసేశారు. కాంగ్రెస్ వ్యతిరేక పునాది మీదే.. తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంటే.. ప్రజలు బట్టలూడదీసి తంతారని వ్యాఖ్యానించేశారు. రాజకీయ స్వార్థం కోసం ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే అంతకంటే దుర్మార్గం ఉండదని చంద్రబాబు అటువంటి తప్పు చేస్తారని నేను భావించడం లేదని తన అభిప్రాయాన్ని నేరుగానే చెప్పేశారు. డిప్యూటీ సీఎం.. కేఈ కృష్ణమూర్తి అభిప్రాయం కూడా ఇంతే ఉంది. మోడీ, వైసీపీతో పాటు కాంగ్రెస్ కూడా టీడీపీకి బద్ద శత్రువేనని… కేఈ చెబుతున్నారు. పొలిట్‌బ్యూరోలో చర్చించకుండా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోరని.. స్పష్టం చేశారు. మరో డిప్యూటీ సీఎం చినరాజప్ప.. పొత్తులపై నేరుగా వ్యాఖ్యలు చేయకపోయినా… ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించారు.

అయితే టీడీపీలో ఇంకో అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టారనడం కరెక్ట్ కాదని.. ఢిల్లీ అహంకారంపై పోరాటానికి మాత్రమే పెట్టారంటున్నారు. ఆనాడు ఢిల్లీలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి.. ఆ పార్టీపై పోరాడారని.. ఇప్పుడు అదే ఢిల్లీ అహంకారాన్ని బీజేపీ చూపిస్తోంది కాబట్టి… ఆ పార్టీపై పోరాటానికి.. కాంగ్రెస్‌ను కలుపుకెళ్లినా తప్పు లేదని వాదిస్తున్నారు. ముందు ముందు తెలుగుదేశం పార్టీలో ఈ రెండు రకాల వాదనలు.. ఎక్కువగానే వినిపించే అవకాశం ఉంది. వీటిని టీడీపీ అధినేత ఎలా కవర్ చేస్తారో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com