నంద్యాల‌లో టీడీపీ సొంతింటి బ‌లం ఎంత‌..?

నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసింది. 2014 త‌రువాత రాష్ట్రంలో జ‌రుగుతున్న ఉప ఎన్నిక ఇది. దీంతో ఎంత కాద‌నుకున్నా మూడున్న‌రేళ్ల తెలుగుదేశం పాల‌న‌పై ప్ర‌జ‌లు స్పంద‌న‌కు ఈ ఫ‌లిత‌మే ఉదాహ‌ర‌ణ‌గా రాష్ట్రం చూస్తుంది. అందుకే, అధికార పార్టీ ఈ ఎన్నిక‌ను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. ఉప ఎన్నిక నేప‌థ్యంలో నంద్యాల నియోజ‌క వ‌ర్గంలో దాదాపు రూ. 1,400 కోట్ల‌ను అభివృద్ధి ప‌నుల కోసం కేటాయించేసింది! ఒక‌వేళ‌ తెలుగుదేశం పార్టీని గెలిపించ‌క‌పోతే.. ఇప్పుడు మొద‌లైన ఈ ప‌నులు మ‌ధ్య‌లోనే ఆగిపోతాయేమో అనే ఒక ర‌క‌మైన సంక‌ట ప‌రిస్థితిని సృష్టించిన‌ట్టే! ఇక‌, ప్ర‌చారం విష‌యానికొస్తే… రాష్ట్రంలోని కీల‌క నేత‌లంద‌రినీ అక్క‌డే మోహ‌రించారు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కూడా స్వ‌యంగా ఓ మూడ్రోజులు ఉండి ప‌రిస్థితి స‌మీక్షించారు. స‌రే, ఇవ‌న్నీ ఏ మేర‌కు టీడీపీకి అనుకూలంగా మార‌తాయ‌న్న చ‌ర్చ ప‌క్క‌న పెడితే, ఇంత‌కీ.. స్థానికంగా నంద్యాల‌లోని టీడీపీ బ‌లా బ‌లాల‌ను ప్ర‌భావితం చేసే కొన్ని కీల‌కాంశాలున్నాయి. ప్రచార ప‌ర్వం ముగిసిన త‌రువాత ఓటు మేనేజ్మెంట్ విష‌యంలో అవే కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని అన‌డంలో సందేహం లేదు!

నంద్యాల‌లో టీడీపీ అభ్య‌ర్థి బ్రహ్మానంద రెడ్డికి.. మంత్రి కె.ఇ. కృష్ణ‌మూర్తి కుటుంబం ఏ మేర‌కు స‌హ‌కారం అందిస్తుంద‌నేది ఇప్పుడు కీల‌క‌మైన అంశంగా చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే, కేయీ – భూమా కుటుంబాల మ‌ధ్య మొద‌ట్నుంచీ మంచి సంబంధాలు లేవు. ఇక‌, కేయీ కూడా ఆ మ‌ధ్య ముఖ్య‌మంత్రి తీరుపై కొంత అసంతృప్తిగా ఉన్న‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వంలో ఆయ‌న ప్రాధాన్య‌త త‌గ్గిపోయింద‌ని భావించ‌డం, దానికి అనుగుణంగానే ఆయ‌న అధికారాల‌ను త‌గ్గించ‌డం వంటివి జ‌రిగాయి. సో.. ఇవ‌న్నీ మ‌న‌సులో పెట్టుకోకుండా, కేవ‌లం పార్టీ గెలుపును మాత్ర‌మే దృష్టిలో ఉంచుకుని కేయీ వ‌ర్గం భూమా కుటుంబానికి ఏమాత్రం సాయం అందిస్తుంద‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం.

ఇక‌, రెండో స్థానిక అంశం… మాజీ మంత్రి ఎన్‌.ఎమ్‌.డి. ఫ‌రూక్‌! నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ ఆయ‌న‌కు పార్టీలో ఏమంత ప్రాధాన్య‌త ద‌క్క‌లేద‌నే అభిప్రాయ‌మే వినిపించేది. ఆయ‌నా అదే అసంతృప్తితో ఉన్న‌ట్టు కూడా గుస‌గుస‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. నంద్యాల ఉప ఎన్నిక తెర మీదికి రావ‌డం, ఆ నియోజ‌క వ‌ర్గంలో మైనారిటీ ఓట్లు కీల‌కం కావ‌డం.. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కి హుటాహుటిన ఎమ్మెల్సీ ఇచ్చార‌నే చెప్పుకోవ‌చ్చు. గ‌తంలో ఎదుర్కొన్నామ‌న్న నిర్ల‌క్ష్య భావ‌న నుంచి ఆయ‌న బ‌య‌ట‌కి వ‌చ్చి, పార్టీ గెలుపున‌కు ఏ స్థాయిలో కంక‌ణబ‌ద్ధులై ఉన్నార‌నేది మ‌రో ప్ర‌శ్న‌? ప‌్ర‌చారం ప‌ర్వం ముగిసిన త‌రువాత‌, ఇత‌ర ప్ర‌ముఖ నేత‌ల హ‌డావుడి అంతా చ‌ల్ల‌బ‌డ్డాక‌, టీడీపీ విజ‌యావ‌కాశాల‌ను ప్ర‌భావితం చేయ‌బోతున్న కీల‌క అంశాల్లో ఇవీ ఉంటాయి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ప్ర‌చారం ముగిశాక‌… ఇలాంటి స‌మీక‌ర‌ణాల నిర్వ‌హ‌ణ‌లో మంత్రి అఖిల ప్రియ ఏత్రం చాక‌చ‌క్యం ప్ర‌దర్శిస్తారు అనేది, వేచి చూడాలి మ‌రి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com