‘దేశం బేజార్’ అయిపోయేంత‌ నిర్ణ‌య‌మా అది..?

దేశం బేజార్‌.. నేటి సాక్షి ప‌త్రిక‌లో ప‌తాక శీర్షిక ఇది! ఈ వార్త అనే గ్రీన్ మ్యాట్ వెన‌క‌.. వారు చూసుకున్న దృశ్యాలు ఎలా ఉన్నాయంటే.. వైయ‌స్సార్ సీపీ ఎంపీల రాజీనామా అంశం తెలియ‌గానే తెలుగుదేశం పార్టీలో భారీ కుదుపట‌. స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి స‌హా మంత్రులంద‌రూ త‌ల‌లు బద్ద‌లుకొట్టేసుకున్నార‌ట‌! మ‌నం ప్ర‌జ‌ల‌కు ఏం చెబుతామంటూ మ‌ల్ల‌గుల్లాలు ప‌డిపోయార‌ట‌. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ప్రభావాన్ని ఎలా తిప్పికొట్టాలో అధికార పార్టీ నేత‌ల‌కు అర్థం కాలేద‌ట‌. రోజంతా త‌ల‌లు బాదుకున్నా జ‌గ‌న్ ను ఎలా ఎదుర్కోవాలో వ్యూహం ఖ‌రారు చేయ‌లేక‌పోయార‌ట‌. అంతిమంగా, జ‌గ‌న్ పై విమ‌ర్శ‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యార‌ట‌! వైకాపాని ఎదుర్కోవాలంటే దుర్బాష‌లాడ‌టం ఒక్క‌టే మిగులున్న మార్గ‌మ‌ని మంత్రుల‌కు చంద్ర‌బాబు ఉద్బోధించార‌ట‌! అవునా.. వైకాపా ఎంపీల రాజీనామా అంశం టీడీపీని అంత‌గా షాక్ కి గురిచేసింద‌న్న‌మాట‌! ఈ క‌థ‌నం చ‌దివితే త‌ప్ప సదరు నిర్ణ‌యం అంత తీవ్ర‌మైన‌దా అనేది అర్థం కాలేదు సుమండీ..! విలువ‌లతో కూడిన జ‌ర్నలిజం మాత్ర‌మే చేస్తామ‌ని ట్యాగ్ లైన్ పెట్టుకున్న స‌ద‌రు ప‌త్రిక వారు వండి, మ‌సాలా వేసి, వార్చి, బాగా వేయించి సిద్ధం చేసిన వార్తా క‌థ‌నం సారాంశం ఇదే.

ఇది చ‌దివాక ఎవ‌రికైనా క‌లిగే అతి సాధారణమైన అనుమానం… వైకాపా ఎంపీలు రాజీనామా చేసింది ప్ర‌త్యేక హోదా కోస‌మా..? లేదా, తెలుగుదేశం పార్టీలో క‌ల‌క‌లం కోస‌మా..? రాజీనామాలు చేయబోతున్నది రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోస‌మా..? రాజ‌కీయ సంచ‌ల‌నం మాత్ర‌మే వారి ల‌క్ష్య‌మా..? ఈ ఊహాజనిత క‌థ‌నం ద్వారా వారి బుద్ధి ఏంట‌నేది చెప్ప‌క‌నే చెప్పేసుకున్నార‌న్న విష‌యం వారికి అర్థం కావ‌డం లేదా..? బేసిక్ లాజిక్ ఏంటీ… వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తే, కేంద్రంలో క‌ద‌లిక వ‌స్తుందీ, ప్ర‌త్యేక హోదా ఇచ్చేస్తుంద‌నేగా జ‌గ‌న్ పోరాటం..! అలాంట‌ప్పుడు, టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ భేటీలో భూకంపాలు వ‌చ్చినా, సునామీలు వ‌చ్చినా ఏమౌతుందీ..? ఇలాంటి ప్ర‌కంప‌న‌లు కేంద్రంలో రావాల‌నేది క‌దా జ‌గ‌న్ ల‌క్ష్యం..! వైకాపా రాజీనామాల అంశాన్ని భాజ‌పా ఎంత సీరియ‌స్ గా తీసుకుంటుంద‌నేదే ఇప్పుడు అస‌లు విష‌యం. అంతేగానీ, టీడీపీలో ఏర‌క‌మైన స్పంద‌న వ‌చ్చినా ప్ర‌త్యేక హోదా రానే రాదు క‌దా!

స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో వైకాపా ఎంపీల రాజీనామా అంశంపై ముఖ్య‌మంత్రి చ‌ర్చించిన మాట వాస్త‌వ‌మే. పార్ల‌మెంటులో నోరెత్త‌కుండా, ఇప్పుడు రాజీనామాలు చేస్తామంటే ఎవ‌రు నమ్ముతారు అంటూ సీఎం విమ‌ర్శించారు. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఏడాది లోపుగా ఉండేట్టుగా రాజీనామాలు ముహూర్తం పెట్టుకున్నార‌నీ, అలా అయితే ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి రాద‌నీ టీడీపీ నేత‌లు విశ్లేషించారు. 2014 ఏప్రిల్ 7న గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లైంది. అంటే, ఈ ఏడాది ఏప్రిల్ 7కి ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా మరో ఏడాది స‌మ‌యం ఉంటుంది. అందుకే, ఏప్రిల్ 6న వైకాపా ఎంపీలు రాజీనామా చేసినా, ఆరు నెల‌ల్లోపు ఉప ఎన్నిక‌లు రావు. ఎందుకంటే, ఎన్నిక‌ల చ‌ట్టంలోని 151వ నిబంధ‌న ప్ర‌కారం… ఏడాదిలోపు సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఉంటే, ఉప ఎన్నిక‌ల్ని వాయిదా వేయాలి. ఆ పాయింట్ ను త‌మ‌కు అనుకూలంగా వైకాపా మార్చుకుందనే అంశం స‌మ‌న్వ‌య క‌మిటీ భేటీలో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఈ అంశం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు స‌ద‌రు క‌థ‌నంలో ఎక్క‌డా కనిపించ‌దు! మొద‌ట్నుంచీ చివ‌రి వ‌ర‌కూ జ‌గ‌న్ నిర్ణ‌యానికి టీడీపీ పడిపోయిన టెన్ష‌నే అందులో క‌నిపిస్తుంది. వైకాపా ల‌క్ష్యం మొద‌ట్నుంచీ టీడీపీ మాత్ర‌మే. జ‌గ‌న్ ల‌క్ష్యం ముఖ్య‌మంత్రి సీటు మాత్ర‌మే. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల ఊసే ఎక్క‌డా క‌నిపించ‌దు. ఇంత సుదీర్ఘ క‌థ‌నంలో వైకాపా ఎంపీల రాజీనామాపై కేంద్రం స్పంద‌న ఎలా ఉందో, ఢిల్లీలో ఏమ‌నుకుంటున్నారో, ఇతర పార్టీల్లో చర్చ జరుగుతోందా అనే ఊసే లేదు. ఇక, ఇలాంటి క‌థ‌నాల్లో విలువ‌ల్ని వెత‌క‌డ‌మంటే… నేతి బీర‌లో నెయ్యి కోసం గిన్నె సిద్ధం చేసుకున్న‌ట్టు..! ఈ తరహా క‌థ‌నాలు వ‌ల్ల వైకాపాకి జ‌రిగే మేలు కంటే.. న‌ష్ట‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ప్ర‌త్యేక హోదాపై స్పందించాల్సింది కేంద్ర‌మైతే.. చంద్ర‌బాబు స్పంద‌న‌పైనే జ‌గ‌న్ ఫోకస్ అనేదే ఈ క‌థ‌నం ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్న సంకేతాలు..! పార్టీకి అనుబంధంగా ఉన్న పత్రికగా వారు చేస్తున్నది ఏంటో కనీసం వారికైనా స్పష్టత ఉందా అనేది కొందరి ప్రశ్న..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.