సంప్ర‌దాయం స‌రే.. ఫిరాయింపు మాటేంటి..?

నంద్యాల ఎన్నిక‌ల్లో ఒకే సంప్ర‌దాయం గురించి వైకాపా, టీడీపీలు మాట్లాడుతున్నాయి! మ‌ర‌ణించిన ఎమ్మెల్యే స్థానాన్ని ఏక‌గ్రీవం చేయ‌డం రాజ‌కీయ సంప్ర‌దాయ‌మ‌నీ, దానికి చంద్ర‌బాబు తూట్లు పొడుస్తూ టీడీపీ త‌ర‌ఫున పోటీ పెట్టార‌ని వైకాపా ప్ర‌చారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదే అంశంపై ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కూడా స్పందించ‌డం విశేషం. క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నంద్యాల మున్సిప‌ల్ కౌన్సిల‌ర్లు, జ‌డ్‌.పి.టి.సి.లు, ఎం.పి.టి.సి.ల‌తోపాటు పార్టీ నేత‌ల‌తో చంద్ర‌బాబు తాజాగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… గ‌తంలో వివిధ ఉప ఎన్నిక‌ల సంద‌ర్భాల్లో టీడీపీ పాటించిన రాజ‌కీయ సంప్ర‌దాయం గురించి చంద్ర‌బాబు వివ‌రించారు!

వైయ‌స్ రాజ‌శేఖ‌ర రెడ్డి అకాల మ‌ర‌ణంతో పులివెందుల స్థానానికి ఉప ఎన్నిక అనివార్య‌మైతే, తెలుగుదేశం పార్టీ పోటీ పెట్ట‌లేద‌నీ, విజ‌య‌మ్మ‌ను ఏక‌గ్రీవంగా ఎన్నిక చేసేందుకు అవ‌కాశం ఇస్తూ రాజ‌కీయ సంప్ర‌దాయానికి విలువ ఇచ్చింద‌ని చంద్ర‌బాబు చెప్పారు. 2014లో రోడ్డు ప్ర‌మాదంలో శోభా నాగిరెడ్డి రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించార‌నీ, అప్ప‌టికి ఐదేళ్లు స‌మ‌యం ఉన్నా కూడా తెలుగుదేశం త‌ర‌ఫున ఎవ్వ‌ర్నీ పోటీకి దించ‌కుండా ప్ర‌తిప‌క్ష పార్టీకే అవ‌కాశం ఇచ్చామ‌ని కూడా చంద్ర‌బాబు గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు.. నంద్యాల విష‌యంలో కూడా అదే సంప్ర‌దాయాన్ని కొన‌సాగిద్దామ‌ని తాము భావిస్తుంటే వైకాపా అడ్డుప‌డుతోంద‌న్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌లో అదే సంప్ర‌దాయాన్ని పాటిద్దామ‌ని తాము కోరినా కూడా వైకాపా పోటీకి దిగుతోంద‌న్నారు. ఏడాదిన్న‌ర కాలం ఉండే ప‌ద‌వి కోసం త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన బిడ్డ‌ల‌పై కూడా వైకాపా పోటీ పెడుతోంద‌ని అన్నారు. రాజ‌కీయ సంప్ర‌దాయాల‌కు తూట్లు పొడుతున్న వైకాపాకి బుద్ధి చెప్పాలంటే.. టీడీపీ అభ్య‌ర్థిని భారీ ఎత్తున మెజారిటీ వ‌చ్చేలా గెలిపించాల‌ని పార్టీ వ‌ర్గాల‌కు చంద్ర‌బాబు పిలుపు ఇచ్చారు.

భూమా నాగిరెడ్డి మ‌ర‌ణించారు కాబ‌ట్టి, ఆ స్థానంలో ఏక‌గ్రీవం చేయాల‌నుకోవ‌డం మంచిదే. దానికి వైకాపా స‌హ‌క‌రించ‌డం లేద‌నీ, సంప్ర‌దాయానికీ విలువ‌ల‌కూ తిలోద‌కాలు ఇచ్చేసిందంటూ చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డుతున్నారు! అయితే, మ‌ర‌ణించే నాటికి భూమా నాగిరెడ్డి వైకాపా ఎమ్మెల్యే క‌దా! టీడీపీలో చేరినా ఆయ‌న రాజీనామా చెయ్య‌లేదు. చంద్ర‌బాబు కూడా ఆయ‌న‌తో రాజీనామా చేయించ‌లేదు! అలాంటప్పుడు మరణించిన భూమా టీడీపీ ఎమ్మెల్యే ఎలా అవుతారు..? ఒక‌వేళ వైకాపాకి రాజీనామా చేయించి ఉన్నా… ఇప్పుడు ఏక‌గ్రీవ ఎన్నిక సంప్ర‌దాయానికి విపక్షం తూట్లు పొడుస్తోంద‌ని టీడీపీ చెప్పినా కొంత అర్థం ఉండేది. రాజ‌శేఖ‌రెడ్డి విష‌యంలోగానీ, శోభా నాగిరెడ్డి విష‌యంలోగానీ టీడీపీ పోటీ పెట్ట‌క‌పోవ‌డాన్ని మెచ్చుకోవ‌చ్చు. అది మంచి సంప్ర‌దాయ‌మే.. కాద‌నం. కానీ, ఆ సంద‌ర్భాలతో స‌మానంగా నంద్యాల ఉప ఎన్నిక‌ను చూడ‌మంటే ఎలా..? దివంగ‌త భూమా నాగిరెడ్డి ఫిరాయింపు నేత‌. వైకాపా బీఫామ్ మీద ఎన్నికైన నాయ‌కుడు. అందుకే, నంద్యాల ఎన్నిక‌ల్లో ఫిరాయింపు అనే టాపిక్ జోలికి వెళ్లంకుండా… సంప్ర‌దాయం అనే ముసుగు క‌ప్పే ప్ర‌య‌త్నం చంద్ర‌బాబు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.