ప్రొ.నాగేశ్వర్: అవిశ్వాసంపై టీడీపీ, వైసీపీల వింత రాజకీయాలు..!

టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్వీకరించడంతో.. టీడీపీ, వైసీపీ మధ్య కొత్త పంచాయతీ ప్రారంభమయింది. గత సమావేశాల్లో వైసీపీ ముందుగా అవిశ్వాస తీర్మానం ఇస్తామని ప్రకటించింది. మొదట వైసీపీ అవిశ్వాసానికి మద్దతిస్తామన్న చంద్రబాబు.. రాత్రికి రాత్రి వ్యూహం మార్చుకుని… తెల్లవారే సరికి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి తామే అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ సమావేశాల్లో టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీల ఎంపీలు ఆందోళన చేయడంతో… స్పీకర్ అవిశ్వాస తీర్మాన నోటీసులను పరిగణనలోకి తీసుకోలేదు. దాని మీద కేంద్రం, మోడీపై విమర్శలు కూడా వచ్చాయి.

బీజేపీతో ఎవరు కుమ్మక్కయ్యారు..!

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను మొదటి సెషల్ లోనే అంగీకరించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీ చిత్తశుద్ధిపై విమర్శలు చేస్తోంది. గత పార్లమెంట్ సమావేశాల్లో…తమ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదిస్తే… బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుందని… బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాల్సి వస్తుందన్న కారణంగా.. తాము రాజీనామాలు చేసిన తర్వాతనే ఆవిశ్వాసాన్ని ఆమోదించాలని.. వైసీపీ నేతలు..బీజేపీతో ముందుగానే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని టీడీపీ విమర్శలు చేస్తోంది. అందుకే అప్పట్లో తమ అవిశ్వాస నోటీసుల్ని పరిగణనలోకి తీసుకోకుండా.. ఇప్పుడు తీసుకున్నారని చెబుతున్నారు. కానీ రివర్స్ లో వైసీపీ ఆరోపణలు చేస్తోంది.గతంలో తామిచ్చిన అవిశ్వాసాన్ని ఒప్పుకోలేదు. ఇప్పుడు టీడీపీ ఇచ్చిన అవిశ్వాసాన్ని ఒప్పుకున్నారు. అంటే.. బీజేపీతో టీడీపీనే కుమ్మక్కయిందని అర్థం అంటున్నారు.

రాజకీయాలు ప్రయోజనాలు చూసుకుంటున్న బీజేపీ..!

ఈ రెండు పార్టీల వాదన వల్ల అసలు విషయం పక్కకు పోయింది. అవిశ్వాస తీర్మానం, ప్రత్యేకహోదా అంశాలు వదిలేసి… పరస్పర కుమ్మక్కు రాజకీయాలపై ఆరోపణలు చేసుకుంటున్నారు. వాస్తవమేమిటంటే… వైసీపీని చూసో.. టీడీపీని చూసో… అవిశ్వాసంపై .. బీజేపీ నిర్ణయం తీసుకోదు. అవిశ్వాస తీర్మానం ఆంధ్రప్రదేశ్ ఇష్యూ కాదు. భారతీయ జనతా పార్టీ తన రాజకీయ వ్యూహాలను బట్టే.. అవిశ్వాస తీర్మానం గురించి ఆలోచిస్తుంది తప్ప.. వైసీపీకి లాభం చేయాలనో.. టీడీపీకి ప్రయోజనం కల్పించాలనో తీసుకోదు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవు. జాతీయ స్థాయిలో తమకు ప్రయోజనం కలుగుతుందని భావించినప్పుడే అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. తనకు నష్టం అనుకున్నప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని యాక్సెప్ట్ చేయలేదు.

తమకు అనుకూలంగా పరిస్థితులున్నాయనే అవిశ్వాసానికి ఆమోదం..!

గతంలో…అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించకపోవడానికి ప్రధాన కారణం.. కర్ణాటక ఎన్నికలు. కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటికి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. కానీ కావేరీ బోర్డును కర్ణాటక వ్యతిరేకిస్తోంది. కావేరీ బోర్డును ఏర్పాటు చేస్తే… కర్ణాటకలో బీజేపీ రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయి. అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించి చర్చ జరిపితే.. కావేరీ ఇష్యూ ఇబ్బందికరం అవుతుందని బీజేపీ ఆలోచించి ఉండవచ్చు. అలాగే కర్ణాటకలో తెలుగు ఓటర్లు కూడా ఎక్కువే ఉన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వలేమని చెబితే వారు కూడా వ్యతిరేకంగా ఓటు వేస్తారు. ఈ రెండే కాదు.. అవిశ్వాస తీర్మానం చర్చ ప్రారంభమైతే.. విపక్షాలు ఏ అంశంపైనైనా మాట్లాడొచ్చు. ఫలానా అంశమే మాట్లాడాలన్న రూల్ లేదు. ఆటోమేటిక్ గా… నోట్ల రద్దు, జీఎస్టీ, మాల్యా, నిరవ్ మోడీ సహా.. ఎన్నో అంశాలు తెరపైకి వస్తాయి. ఇప్పుడు అవన్నీ చల్లబడ్డాయి. అందుకే అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు.

మిత్రుల అసంతృప్తినీ చల్లబరిచిన బీజేపీ..!

ఇప్పటికీ అవిశ్వాస తీర్మానాన్ని అంగీకరించకపోతే.. భయపడుతున్నామనే.. భావన ప్రజల్లోకి వెళ్తుంది. అప్పట్లో.. శివసేన బీజేపీని పూర్తిగా టార్గెట్ చేసింది . తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉంది. మిత్రపక్షాలు కూడా అసంతృప్తిలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు శివసేన ఎంపీలు కాస్త మెత్తబడినట్లున్నారు. టీడీపీ ఎంపీలకు.. శివసేన అధినేత అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. నితీష్ కుమార్ ప్రత్యేకహోదా అన్నారు. ఇప్పుడు అమిత్ షా వెళ్లి చర్చలు జరిపి వచ్చారు. చాలా క్లియర్ గా తమ మిత్రులను సర్దుకున్న తర్వాత.. తమకు రాజకీయంగా సమస్యలు లేకుండా చూసుకుని.. అవిశ్వాసానికి ముందుకు వచ్చింది.

వ్యూహాత్మకంగా బీజేపీ, వైసీపీ రాజకీయాలు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు..ఎవరు బీజేపీతో ఉన్నారని ప్రజలు భావిస్తే.. వారు రాజకీయంగా నష్టపోతారు. ప్రత్యేకహోదా ఇవ్వని పార్టీగా బీజేపీపై ప్రజలు కోపంతో ఉన్నారు. బీజేపీతో ఉన్నది మీరంటే..మీరని రెండు పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. వాస్తవం ఏమిటంటే.. ఇద్దరూ బీజేపీతోనే ఉన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాటు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. మోడీ అన్ని నిర్ణయాలను సమర్థించారు హోదా బదులు ప్యాకేజీకి కూడా అంగీకరించారు. ఆ తర్వాత బీజేపీ వల్ల ఎన్నికల్లో నష్టం జరుగుతుందని భావించారో అప్పుడు.. తెగదెంపులు చేసుకున్నారు. వైసీపీ కూడా.. బీజేపీతోనే ఉంది. ప్రతి అంశంలోనూ మోడీకి మద్దతిచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అడగకుండానే సపోర్ట్ చేశారు. ఏపీ రాజకీయాలకు సంబంధించిన టీడీపీ, వైసీపీ రెండూ పార్టీలు.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూనే ఉన్నాయి.

రాజీనామాలు వైసీపీ వ్యూహాత్మ తప్పిదం.. !

లోక్ సభకు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి అవకాశాన్ని కోల్పోయారు. వైసీపీ చేసిన వ్యూహాత్మక తప్పిదం ఇది. ఎంపీలు లోపల ఉంటే అవిశ్వాస తీర్మానంపై మాట్లాడేవాళ్లు. ఇప్పుడు బయట ధర్నాలు చేయాల్సి వస్తుంది. వైసీపీ రాజీనామాల వ్యూహం తప్పు. ఇప్పుడు టీడీపీకి పైచేయి ఇచ్చేసింది..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసంపై సభలో చర్చ జరుగుతుంది. అంటే.. ఓ రాజకీయ ఆయుధాన్ని చంద్రబాబుకు జగన్ ఇచ్చినట్లే. రాజీనామాల వల్ల పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుందామనుకున్నారు. కానీ ఫలితం లభించలేదు. పోరాడకుండా కూర్చోవడం వల్ల ఓ మంచి అవకాశాన్ని కోల్పోయారు. ఏపీలో టీడీపీ వైసీపీ ప్రధాన పార్టీలు. రాజకీయ పోరాటం చేసుకోవచ్చు కానీ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం సమైక్యంగా పోరాడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.