కోవిందా! మద్దతు ‘దారులు’ వేరు వేరు

భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం నాడు హైదరాబాదులో జరిపిన పర్యటన ఆసక్తికరంగా నడిచింది. ఆయనను బలపర్చే నాలుగు పార్టీలను నాలుగు విడతలుగా కలుసుకోవలసి వచ్చింది. బహుశా ఇలాటి పరిస్థితి గతంలో చూసి వుండమేమో! మొదట బేగంపేట హరిత ప్లాజాలో బిజెపి,టిడిపి ఎంఎల్‌ఎలను ఎంపిలను కలుసుకున్నారు. నిజానికి తెలంగాణలో ఈ రెండు పార్టీలూ విడివిడిగానే వ్యవహరిస్తున్నాయి.అయినా ఎన్‌డిఎ భాగస్వాములుగా కలిసి కనిపించాయి. తర్వాత ఘట్టం పార్క్‌ హయత్‌ హౌటల్‌లో వైసీపీ ఎంఎల్‌ఎలు ఎంపిలను కలిశారు. ఇక్కడ అధినేత జగన్‌, వెంకయ్య నాయుడు, కోవింద్‌ మాట్లాడతారని అనుకున్నారు గాని ఎందుకో సత్కారంతో సరిపెట్టారు. అయినా టిడిపి ఆప్తమిత్రుడూ ఆత్మబంధువూ వెంకయ్య నాయుడు వైసీపీ జగన్‌తో కలసి వేదిక పంచుకోవడం వింతగానే వుండింది. ఆయన కూడా పెద్ద నవ్వులు చిందించకుండా గంభీరంగానే వున్నారని చెప్పాలి.ఒక రాజకీయ తతంగంగానే ముగిసింది. కాని జగన్‌ మాత్రం పెద్ద విజయం సాధించిన వ్యక్తిలా ఎప్పుడూ లేనంతగా తమ వాళ్లతో కలయతిరుగుతూ కనిపించారు. ఇక తదుపరి ఘట్టం జలవిహార్‌లో టిఆర్‌ఎస్‌తో భేటీ. ఇక్కడ వెంకయ్య ప్రసంగం తర్వాత కెసిఆర్‌ తమ అభివృద్దిని చెప్పి మద్దతు ప్రకటించారు. కోవింద్‌ తన ప్రసంగంలో కెసిఆర్‌కు రెండు కృతజ్ఞతలు చెప్పారు.తన కోసం హిందీలో ప్రసంగించడం , హైదరాబాద్‌ అంతటా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం.నిజంగానే చాలా ఎక్కువ సంఖ్యలో నెక్లెస్‌ రోడ్‌ ఫ్లెక్సీల మయమైంది. ప్రసంగాలలోపెద్ద విశేషం లేదు గాని వెంకయ్య మాత్రం కెసిఆర్‌ చాలా సునిశితమైన దృష్టితోఏర్పాట్లు చేయగల సమర్థుడని కొనియాడారు. పనిలో పనిగా కెసిఆర్‌ మోడీ సర్కారుకు పూర్తి మద్దతు చెప్పేశారు. తమాషా ఏమంటే మద్దతు దారులు వేరు వేరు గాని కలసి మోసింది బిజెపినే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.