ఇవ్వాళ్ళ ఒక్కరోజు మాత్రమే తెలంగాణా శాసనసభ సమావేశాలు జరుగబోతున్నాయి. ఇటీవల పార్లమెంటు ఆమోదించిన జి.ఎస్.టి.బిల్లుకి మద్దతుగా శాసనసభలో తీర్మానం చేసి పంపేందుకే ప్రత్యేకంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలంటే దేశంలో సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు శాసనసభలో దానికి అనుకూలంగా తీర్మానాలు చేసి పంపవలసి ఉంటుంది. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అభ్యర్ధన మేరకు తెలంగాణా ప్రభుత్వం నేడు ప్రత్యేకంగా ఈ ఒక్కరోజు సమావేశాలు నిర్వహిస్తోంది. సమావేశం మొదలయిన వెంటనే జి.ఎస్.టి.బిల్లు గురించి క్లుప్తంగా చర్చించి, వెంటనే దానిని ఆమోదిస్తూ తీర్మానం చేస్తారు.
ఈ బిల్లుకి జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి కనుక వివిధ రాష్ట్రాల శాసనసభలలో కూడా దానికి ఆమోదం తెలిపేందుకు ప్రతిపక్షాల నుంచి ఎటువంటి ఎదురయ్యే అవకాశం లేదనే భావించవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ ఈ బిల్లుని ఆమోదించడం కోసం ఇంత సహకార ధోరణి కనబడటం చాలా గొప్ప విషయమే. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఇంత గొప్ప సహకార ధోరణి చూసి ఎరుగము. కనుక ఈ క్రెడిట్ పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన మంత్రులకే దక్కుతుందని చెప్పవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించడంలో టీం మోడీ 100 శాతం విజయం సాధించారని చెప్పడానికి ఇదే చక్కటి ఉదాహరణ.
శాసనసభలో ఈ బిల్లుకి అనుకూలంగా తీర్మానం చేసిన తరువాత, ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త జిల్లాల ఏర్పాటుపై సభలో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత మళ్ళీ ప్రభుత్వం ప్రకటించేవరకు సభ నిరంతరంగా వాయిదా పడుతుంది.