విడివిడిగా కాదు… క‌లిసే కాంగ్రెస్ నేతల యాత్ర‌..!

కొంత‌మంది తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ప్ర‌జాయాత్ర‌లు చేసేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ లో చేర‌గానే పాద‌యాత్ర చేస్తానంటూ ఆ మ‌ధ్య రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ చేరాక ఆయనకి బోధపడిన తత్వం ఏంటంటే.. యాత్రలు చేయాలంటే హైకమాండ్ అనుమతి కావాలని. అంత‌కుముందే, రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేసి పార్టీకి జ‌వ‌స‌త్వాలు ఇచ్చేస్తా అనేస్థాయిలో కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి అన్నారు. మ‌రో నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కూడా పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు. అయితే, టి. నేత‌లు ఎవ‌రు ఏది చేయాలన్నా హైక‌మాండ్ అనుమ‌తి కావాలి క‌దా..! ఈ ముగ్గురు నేత‌లూ విడివిడిగా త‌మ పాద‌యాత్ర‌ల ప్ర‌తిపాద‌న‌ల్ని రాహుల్ కు పంప‌డం జ‌రిగింది. అంతేకాదు, మ‌రికొంద‌రు కూడా అధిష్టానం అనుమ‌తుల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ, వీటిపై ఎలాంటి నిర్ణ‌య‌మూ అధిష్టానం తీసుకోలేదు. కానీ, తాజాగా టి. కాంగ్రెస్ ఓ నిర్ణ‌యం తీసుకుంది..! రాష్ట్రవ్యాప్తంగా యాత్ర‌కు సిద్ధ‌మౌతోంది.

ఇంత‌కీ అధిష్టానం ఎవ‌రికి అనుమ‌తి ఇచ్చింద‌నేగా సందేహం..? విడివిడిగా అనుమ‌తులు ఇస్తే నాయకుల్లో అసంతృప్తుల‌కు ఆస్కారం ఎక్కువ క‌దా! ఆ సంగ‌తి తెలుసు కాబ‌ట్టే… అంద‌రూ క‌లిసి బ‌స్సు యాత్ర‌కు వెళ్లండ‌ని హైక‌మాండ్ సూచించిన‌ట్టు స‌మాచారం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజ‌క వ‌ర్గాల‌ను చుట్టి వ‌చ్చేలా బ‌స్సు యాత్ర‌కు టి. కాంగ్రెస్ ప్ర‌ణాళిక సిద్ధం చేస్తోంది. ఈ నెలాఖ‌రు నుంచి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని అనుకుంటున్నార‌ట‌. అయితే, ఒక‌సారి యాత్ర మొద‌లుపెడితే… ఎన్నిక‌లు జ‌రిగేవ‌ర‌కూ ఏదో ఒక రూపంలో పార్టీ కార్య‌క‌లాపాలు ఉండే విధంగా వ్యూహం ఉండాల‌నేది పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. మ‌ధ్య‌లో అసెంబ్లీ స‌మావేశాలు వంటివి వ‌స్తే… తాత్కాలికంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కొంత బ్రేక్ ఇవ్వాల‌నే అనుకుంటున్నారు.

అయితే, అసలు సమస్య ఇంకా ఉంది. ఈ బ‌స్సు యాత్ర అయిపోయిన త‌రువాత త‌మ పాద‌యాత్ర‌లు ఉంటాయ‌ని కొంత‌మంది నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం! ఈ డిమాండ్ల‌పై కూడా అధిష్టానం ఓ వ్యూహంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ముందుగా ఈ బ‌స్సు యాత్ర విజ‌య‌వంతం చేయాల‌నీ, ఆ త‌రువాత పాద‌యాత్ర‌ల గురించి ఆలోచిస్తున్నామ‌ని ప్ర‌స్తుతానికి రాహుల్ చెబుతున్నార‌ట‌..! ఇప్ప‌టికే దాదాపు ఓ ప‌దిమంది నేత‌లు పాద‌యాత్ర‌కు అనుమ‌తులు కోరిన‌ట్టు స‌మాచారం. ఈ సంఖ్య మ‌రింత పెరిగినా ఆశ్చ‌ర్యప‌డ‌క్క‌ర్లేదు. ఒక‌వేళ అలాంటి ప‌రిస్థితే వ‌స్తే… కాంగ్రెస్ నాయ‌కులు కొన్ని ప్రాంతాల‌ను కేటాయించి, ఆ ప్రాంతంలో మాత్ర‌మే పాద‌యాత్ర చేసుకునేందుకు అనుమ‌తి ఇస్తార‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక్క‌డ గ‌మ‌నించాల్సింది ఏంటంటే… అంద‌రూ క‌లిసే యాత్ర‌లు చేయాల‌ని అధిష్టానం సూచించినా, ఆ త‌రువాత విడిగా పాద‌యాత్ర‌లు చేస్తామ‌న్న డిమాండ్ ను టి. కాంగ్రెస్ నేత‌లు వ‌ద‌ల‌క‌పోవ‌డం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.