కేసీఆర్ ఎదుర్కొనే స్థాయిలో కూట‌మి సాధ్య‌మేనా..?

వ‌చ్చే ఎన్నిక‌లను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో తామే అధికారంలోకి వ‌చ్చి తీరాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఆ పార్టీ ఉంది. తెరాస‌కు స‌రైన రాజ‌కీయ ప్ర‌త్యామ్నాయం తామే అన్న ధీమా కూడా వారిలో కొంత ఉంది. అందుకే, ఈ మ‌ధ్య మ‌హా కూట‌మి అనే ఆలోచ‌న‌ను ఆ పార్టీ నేత‌లు తెర‌మీదికి తీసుకొచ్చారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా, ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏక‌మైతే కేసీఆర్ స‌ర్కారును ఎదుర్కోవ‌డం న‌ల్లేరు మీద న‌డ‌క అనేది కొంత‌మంది కాంగ్రెస్ నేత‌ల అభిప్రాయం. అయితే, విన‌డానికి ఈ ఆలోచ‌న బాగానే ఉంది. కానీ, ఇది ఆచ‌ర‌ణ‌లో ఎంత‌వ‌ర‌కూ సాధ్యం అనేదే ప్ర‌శ్న‌..? కాంగ్రెస్ నాయ‌క‌త్వంలో మ‌హా కూట‌మి క‌ట్టేందుకు ఇత‌ర పార్టీలు సిద్ధంగా ఉన్నాయా..? టీడీజీ, భాజ‌పా, సీపీఎం, సీపీఐ.. ఇవ‌న్నీ ఒక గొడుకు కింద‌కి వ‌చ్చే ఆస్కారం ఉందా..? వీరందరినీ ఏకతాటిపై నడిపించగల నాయకత్వం పటిమ కాంగ్రెస్ దగ్గరుందా అనేదే ఇప్పుడు చర్చనీయాంశం.

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పొత్తు… ఈ అంశం కొద్దినెల‌ల కింద‌ట తెర‌మీదికి వ‌చ్చింది. ఓర‌కంగా రేవంత్ రెడ్డిని తెలుగుదేశం నుంచి దూరం చేసిన అంశం ఇదే. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే త‌ప్పేముంది అంటూ రేవంత్ అప్ప‌ట్లో కొన్ని ప్ర‌య‌త్నాలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రతిపాదనను ఆయన చంద్రబాబు వరకూ తీసుకెళ్లారు. అయితే, అది సాధ్యం కాద‌న్న న‌మ్మ‌కంతోనే ఆయ‌న కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆంధ్రాలో భాజ‌పాతో పొత్తు, తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు టీడీపీ పెట్టుకునే అవ‌కాశాలు లేవు. కేంద్రంలో వైరి వర్గాలుగా తలపడుతున్న రెండు జాతీయ పార్టీలతో.. ఒక ప్రాంతీయ పార్టీ ఇలా రెండు పడవల ప్రయాణం ఆచరణ సాధ్యం కాదు. ఈ ర‌కంగా చూసుకుంటే మ‌హా కూట‌మిలోకి టీడీపీ చేరిక అనుమాన‌మే. సిద్ధాంత‌ప‌రంగా చూసుకుంటే.. భాజ‌పా కూడా తెరాస‌కు కాస్త దూరంగా ఉండే అవ‌కాశం ఉంది. పైగా, వారు సొంతంగా ఎదిగే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఇక‌, ఎమ్‌.ఐ.ఎమ్‌. విష‌యానికొస్తే.. భాజ‌పా స్నేహం కోసం తెరాస అర్రులు చాచుతుంటే… ఎమ్‌.ఐ.ఎమ్‌. ఎలా చేరుతుంది..? భాజపా ఉన్న కూటమిలోకి వారు ఎలా వస్తారు..? సీపీఎం కూడా మ‌హాకూట‌మిలో చేర‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే, ఇప్ప‌టికే వారు బ‌హుజ‌న ద‌ళిత ఫ్రెంట్ ప్ర‌క‌టించేసుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల నుంచి పోటీకి సిద్ధ‌మైపోతున్నారు.

ప్ర‌ధాన పార్టీల‌న్నింటికీ ఇలా ఎవ‌రి పరిధులు వారికి ఉన్నాయి. వాటిని దాటుకుంటూ కాంగ్రెస్ తో క‌లిసి వెళ్లే అవ‌కాశాలు ప్ర‌స్తుతానికి చాలా త‌క్కువ క‌నిపిస్తున్నాయి. అయితే, ఇంత‌కీ కాంగ్రెస్ తో క‌లిసేవారంటూ ఎవ‌రూ లేరా అంటే… కొంద‌రు ఉన్నారనే చెప్పొచ్చు. గ‌త ఎన్నిక‌ల్లో మాదిరిగానే సీపీఐ క‌లిసి వ‌స్తుంది. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగి, పార్టీగా మారితే తెలంగాణ రాజ‌కీయ జేయేసీ కూడా కాంగ్రెస్ తో జ‌త‌క‌ట్టే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. సో.. కేసీఆర్ కి వ్య‌తిరేకంగా మ‌హా కూట‌మి అనే ఆలోచ‌న‌తో కొంత‌మంది కాంగ్రెస్ నేత‌లు ఏదో భారీ వ్యూహ‌ర‌చ‌న చేస్తున్న‌ట్టు అనుకుంటున్నా… వాస్త‌వంలో ప‌రిస్థితులు ఇలా ఉన్నాయి! అన్నిటికీ మించి.. మహాకూటమి ఆలోచనను ఇతర పార్టీల వరకూ తీసుకెళ్లేది ఎవరు అనేది కూడా కాంగ్రెస్ లో ప్రశ్నే..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.