విపక్షాలకు ఒకలా..! అధికారానికి అంతలా..! తెలంగాణలో అంతేనా..!?

టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు.. పూర్తిగా రాజకీయ పరమైనది. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ… అక్కడ జరుగుతున్నదేమిటి..?. ప్రతీ అంశంలోనూ.. ప్రభుత్వమే.. ప్రభుత్వ శాఖలే ఇన్వాల్వ్ అయి ఏర్పాట్లు చేస్తున్నాయి. అదేదో ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అయినట్లు.. యంత్రాంగం మొత్తం… కొంగరకలాన్‌లోనే మోహరించింది. రోడ్లు వేసింది. ట్రాఫిక్‌ అడ్వయిజరీ విడుదల చేసింది. కొన్ని వేల మంది పోలీసుల్ని మోహరించారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులు మొత్తం.. కొంగరకలాన్‌ కు జనాల తరలింపునకే కేటాయించారు. ఇలా చెప్పుకుంటూ.. పోతే.. ప్రభుత్వం మొత్తం ఇప్పుడు టీఆర్ఎస్ సభ విజయవంతానికి కృషి చేస్తోంది. కొసమెరుపేమిటంటే.. ఈ సభకు.. అధికారికంగా టీఆర్ఎస్ ఇంత వరకూ పర్మిషన్ తీసుకోలేదని ప్రచారం జరుగుతోంది.

సరే ఈ మాత్రం నిబద్ధతతో కనీసం ఒక్క శాతం అయినా తెలంగాణలోని ఇతర పార్టీల కార్యక్రమాల విషయంలో చూపించారా..? చాన్సే లేదు. తెలంగాణలో ఇతర పార్టీలు.. సభలు, సమావేశాలు నిర్వహించడం దాదాపుగా నిషేధం. ఎవరైనా ఎక్కడైనా సభలు పెట్టుకోవాలంటే.. సవాలక్ష అడ్డంకులొస్తాయి. వారు ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నారో.. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి రాదు. వారు కోర్టులకు వెళ్లి..నానా తిప్పలు పడి.. ఎక్కడో ఊరి బయట.. సభ నిర్వహించుకోవడానికి పర్మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. కొన్నాళ్ల కిందట.. ఉద్యమనేత కోదండరాం.. టీజేఎస్ అనే పార్టీ ఆవిర్భావసభ నిర్వహించాలనుకున్నారు. ఇప్పుడు.. టీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభకు వస్తారని చెప్పుకుంటున్న వారిలో నాలుగైదు శాతం కూడా కోదండరాం సభకు రారు. కానీ ప్రభుత్వం నిస్సంకోచంగా పర్మిషన్ నిరాకరించింది. కోర్టులకు వెళ్లి ఎలాగోలా ఊరి బయట సదస్సు నిర్వహించుకునేందుకు పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇదే కాదు.. మొన్నటికి మొన్న రాహుల్ గాందీ.. ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులతో సమావేశం అవుతున్నామన్నారు. కానీ నో పర్మిషన్. చివరికి వాళ్లు కూడా ఊరి బయట పెట్టుకోవాల్సి వచ్చింది.

ధర్నా చౌక్ ఎత్తి వేయడం దగ్గర్నుంచి.. ఇతర రాజకీయ పార్టీల కార్యక్రమాల వరకూ తెలంగాణలో ఏ ఒక్క కార్యక్రమం.. విపక్షాలకు సానుకూలంగా నడవదు. ఇదంతా.. బహిరంగంగా జరిగేదే. కానీ మీడియా ఎప్పుడూ విపక్ష పార్టీలకు కానీ.. వివక్షకు గురవుతున్న వారికి కానీ అండగా నిలబడే ప్రయత్నమే చేయలేదు. అలా చేయాల్సి వస్తే.. తమకు అండగా ఉండేవారి కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితులు వస్తాయని.. మీడియా భయం కావొచ్చు. అందుకే ఇప్పుడు విచ్చలవిడిగా..అధికార దుర్వినియోగం కళ్ల ముందు జరుగుతున్నా.. ఒక్కరంటే.. ఒక్కరు కూడా.. మాట్లాడటం లేదు. కానీ సభా ఏర్పాట్లను మాత్రం ఆహో.. ఓహో అని పొగడటానికి ఏ మాత్రం ఆలోచిచడం లేదు. .. ఇట్ హ్యాపెన్స్‌ ఇన్ తెలంగాణ ఓన్లీ..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com