తెలంగాణలో స్థిరాస్తి మార్కెట్ ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే జూన్ నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువల ను భారీగా సవరించాలని నిర్ణయించడమే ఇందుకు ప్రధాన కారణం. క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రాంతాల అభివృద్ధిని బట్టి ఈ విలువల పెంపు 100 శాతం నుంచి 300 శాతం వరకు ఉండవచ్చనే సంకేతాలతో కొనుగోలుదారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పెరిగిన ధరల ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లిస్తే అదనపు భారం పడుతుందనే భయంతో, ఈ నెలాఖరులోపే ప్రక్రియను పూర్తి చేయాలని జనం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పోటెత్తుతున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మోకిల, మహేశ్వరం, శంకర్ పల్లి వంటి హాట్ స్పాట్స్ లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గత రెండేళ్లలో ఈ ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ ధరలు ఆకాశాన్ని తాకగా, ప్రభుత్వ విలువలు మాత్రం పాతవే కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు సిద్ధమవ్వడంతో, ఇక్కడ రిజిస్ట్రేషన్ల సంఖ్య అసాధారణంగా పెరిగింది. మోకిల వంటి విల్లా ప్రాజెక్టులు అధికంగా ఉన్న చోట ఒక్కో డాక్యుమెంట్ విలువ కోట్లలో ఉండటంతో, కొన్ని లక్షల రూపాయల భారాన్ని తగ్గించుకోవడానికి ఇన్వెస్టర్లు పోటీ పడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో కంటే ఇప్పుడు మూడు రెట్లు అధికంగా స్లాట్లు బుక్ అవుతుండటంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెరిగిన రద్దీ దృష్ట్యా సెలవు దినాల్లో కూడా కార్యాలయాలు పనిచేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సర్వర్లపై ఒత్తిడి పెరిగి మధ్యమధ్యలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నప్పటికీ, ప్రజలు మాత్రం గంటల తరబడి వేచి ఉండి మరీ తమ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుంటున్నారు.
ఈ పెంపు నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంపై మిశ్రమ ప్రభావాన్ని చూపుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇంటి కల మరింత భారం కానుంది. డెవలపర్లు కూడా పెరిగిన రిజిస్ట్రేషన్ విలువలకు అనుగుణంగా ప్రాజెక్ట్ వ్యయాలను పెంచే అవకాశం ఉంది. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త విలువల ప్రభావం మా
