హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మలుపు చోటుచేసుకుంది. దశాబ్ద కాలంగా ఎల్ అండ్ టీ చేతుల్లో ఉన్న మెట్రో ఫేజ్-1ను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తన స్వాధీనంలోకి తీసుకుంది. హైదరాబాద్ మెట్రో పూర్తిస్థాయిలో ప్రభుత్వ సంస్థగా మారింది. వెంటనే ఫేజ్-2 విస్తరణకు కేంద్రం నుండి తక్షణ ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా దృష్టి సారించారు. కేంద్రాన్ని కలిసి రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో కూడిన డీపీఆర్ ను సమర్పించి, ప్రాజెక్టును త్వరగా పట్టాలెక్కించాలని కోరారు.
చిన్న నగరాల్లో వేగం.. హైదరాబాద్‌లో జాప్యం
దేశవ్యాప్తంగా లక్నో, ఇండోర్, నాగ్‌పూర్ వంటి హైదరాబాద్‌తో పోలిస్తే చిన్న పట్టణాల్లో మెట్రో పనులు మూడో దశకు చేరుకుంటున్నాయి. కానీ, అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సిటీ గా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో మాత్రం ఫేజ్-2 ఇంకా అనుమతుల దశలోనే ఉంది. గత ప్రభుత్వ కాలంలో ఉన్న పాత అలైన్మెంట్లను రద్దు చేసి, రేవంత్ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ మెట్రోతో పాటు పాతబస్తీ, హైటెక్ సిటీ కారిడార్లను కలుపుతూ 122.9 కిలోమీటర్ల మేర 7 కొత్త కారిడార్లను ప్రతిపాదించింది. ఈ జాప్యం వల్ల ట్రాఫిక్ సమస్యలు పెరగడమే కాకుండా, ప్రాజెక్టు వ్యయం కూడా ఏడాదికేడాది అమాంతం పెరుగుతోంది.
మెట్రో ఇప్పుడు ప్రభుత్వ పరం
ఎల్ అండ్ టీ నుంచి ఫేజ్-1ను సుమారు రూ. 15,000 కోట్ల భారీ ప్యాకేజీతో ప్రభుత్వం కొనుగోలు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం.. భవిష్యత్తు విస్తరణను ఎటువంటి ప్రైవేటు ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా చేపట్టడమే. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం లో ఉన్న చిక్కుల వల్ల ఫేజ్-2 ముందుకు సాగడం లేదని భావించిన ప్రభుత్వం, ఇకపై కేంద్రంతో నేరుగా జాయింట్ వెంచర్ భాగస్వామిగా మెట్రోను నిర్మించాలని కోరుతోంది. ఇప్పుడు మెట్రో పూర్తిగా రాష్ట్రం చేతుల్లోకి వచ్చింది కాబట్టి, కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే పనులు యుద్ధప్రతిపాదికన మొదలయ్యే అవకాశం ఉంది.
బీజేపీకి కూడా ఇది రాజకీయ అస్త్రమే!
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలపడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా రాజకీయంగా ఎంతో మేలు చేస్తుంది. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీకి, హైదరాబాద్ మౌలిక సదుపాయాల కల్పనలో తన వంతు వాటాను త్వరగా ప్రకటించడం ద్వారా నగర ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది. ఫేజ్-2లో పాతబస్తీ మెట్రో ఒక కీలకాంశం. దీన్ని త్వరగా పూర్తి చేయడం ద్వారా మైనారిటీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందనే క్రెడిట్ కేంద్రానికి దక్కుతుంది.


