తెలంగాణలో మహాకూటమి ఖాయమే..! నేడు చంద్రబాబుతో ఉత్తమ్ భేటీ..!?

తెలంగాణలో పొత్తుల వైపు అడుగులు వేగంగా ప‌డుతున్నాయి. కాంగ్రేస్ పార్టీ చొరవ‌తీసుకుని అందర్నీ ఒకే వేదికపై తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వాన్ని ర‌ద్దు చేసిన కేసీఆర్ వెంట‌నే హుస్నాబాద్ నుంచి ఎన్నిక‌ల ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. ఆల‌స్యం చేస్తే నష్టపోతామని భావిస్తున్న కాంగ్రెస్ పొత్తుల పై క్లారిటీ తీసుకుని.. స్పష్టమైన ప్రణాళిక‌ల‌తో ముందుకెవెళ్లాల‌ని డిసైడ్ అయింది. కేసీఆర్‌ని ఓడించాలంటే.. క‌లిసొచ్చే పార్టీల‌న్నింటితో జ‌ట్టుక‌ట్టి ఎన్నిక‌ల‌బ‌రిలో దిగాల‌ని నిర్ణయించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, సీపీఐ, టీజేఎస్, ఇంటి పార్టీ, యువ‌జ‌న తెలంగాణ వంటి పార్టీలను క‌లుపుకునిపోవాల‌ని స‌మావేశంలో నేత‌లు ఏకాభిప్రాయానికి వ‌చ్చారు.

పొత్తుల కోసం తామే చొర‌వ‌తీసుకోవాల‌ని నిర్ణయించి సంప్రదింపుల కోసం కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, ష‌బ్బీర్ అలీ, భ‌ట్టీ విక్రమార్కలతో క‌మిటీని నియ‌మించారు. ఆ క‌మిటీ వెంట‌నే ప‌నిని కూడా ప్రారంభించింది. త‌మ‌తో క‌లిసిరావాలంటూ టీడీపీ స‌హా ఇత‌ర రాజ‌కీయపార్టీల‌కు బ‌హిరంగా ఆహ్వానం పంపారు. ఓపెన్ ఆఫ‌ర్ తో ఒక అడుగు ముందుకేసీన కాంగ్రెస్ నేత‌లు ..ఇక రెండో ద‌శ‌లో నేరుగా వెళ్లి ఆయా పార్టీ నాయ‌కుల ముందు పొత్తుల ప్రతిపాద‌న‌లు ఉంచాల‌ని నిర్ణయించారు. హైదరాబాద్ వస్తున్న చంద్రబాబుతో సమావేశం కావాలని ఉత్తమ్ నిర్ణయించుకున్నారు.

కాంగ్రెస్ పార్టీకి న‌ష్టం జరగకుండా మిత్రప‌క్షాల‌కు ఇర‌వై ఐదు స్థానాలు కేటాయించాల‌ని ఓ సూత్రాపాయ అంచ‌నాకు కాంగ్రెస్ నేతలు వచ్చారు. టీడీపీకి 15, సీపీఐ కి రెండు, టీజేఎస్ కు ఆరు, ఇంటిపార్టీకి రెండు, యువ‌జ‌న పార్టీకి ఒక సీటు ఇవ్వాల‌ని లెక్కలు సైతం వేసిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదే ప్రతిపాద‌న‌ను కాంగ్రెస్ సంప్రదింపుల క‌మిటీ ఆయ‌ా పార్టీల ముందు ఉంచేందుకు రెడీ అవుతోంది. దీని పై పార్టీల నుంచి వ‌చ్చే ప్రతిస్పంద‌న‌ను హైక‌మాండ్ దృష్టికి తీసుకెవెళ్లి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com