మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం రేవంత్ రెడ్డి సెట్ చేసిన అజెండా చుట్టూనే తిరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, దానినే అస్త్రంగా చేసుకుని అధికార పక్షానికి బుద్ధి చెబుతామని బీఆర్ఎస్ మొదట్లో ప్రకటనలు చేసిందిది. కానీ, క్షేత్రస్థాయిలోకి వెళ్లేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నికల వాతావరణాన్ని తన నియంత్రణలోకి తీసుకున్నారు. ఆయన ఎంచుకున్న అజెండాలో ఎక్కడా పట్టణ సమస్యలు గానీ, అభివృద్ధి గానీ ప్రధానంగా లేవు. పూర్తిగా రాజకీయ విమర్శలే అస్త్రాలుగా మారి ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు.
రాజకీయ ఎజెండానే ఖరారు చేసిన రేవంత్
రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను కేవలం మున్సిపాలిటీల గెలుపు కోణంలో చూడకుండా, తన రాజకీయ ప్రత్యర్థులైన కేసీఆర్, మోదీల విశ్వసనీయతను దెబ్బతీసే రిఫరెండంగా మార్చేశారు. కేసీఆర్ జాతిపిత కాదు , ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితులు ఎవరు , బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఉన్నది పెవికాల్ బంధం అంటూ ఆయన సంధిస్తున్న ప్రశ్నలు ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ బీజేపీని నిలదీయడం ద్వారా.. ఆ రెండు పార్టీల మధ్య రహస్య అవగాహన ఉందనే అభిప్రాయాన్ని బలంగా కల్పించడంలో రేవంత్ సఫలమయ్యారు.
అవకాశం వచ్చినా మున్సిపల్ ఎజెండాను మార్చలేకపోయిన విపక్షాలు
ముఖ్యమంత్రి ఇంత వేగంగా రాజకీయ ట్రాక్ మారుస్తారని బీఆర్ఎస్, బీజేపీ ఊహించలేకపోయాయి. కేటీఆర్ తన పార్టీ శ్రేణులకు స్థానిక సమస్యలపై పోరాడాలని లేఖలు రాస్తున్నప్పటికీ, రేవంత్ విసిరిన ట్రాప్‌లో చిక్కుకుని ప్రతిపక్షాలు కూడా అవే అంశాలపై కౌంటర్లు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఫలితంగా, పట్టణాల్లో ఉండాల్సిన రోడ్లు, డ్రైనేజీలు, హైడ్రా వంటి అంశాల కంటే కేసీఆర్ అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలే ఎన్నికల ప్రధాన అజెండాగా మారిపోయాయి. రేవంత్ సెట్ చేసిన ఈ ఎజెండాలో ప్రతిపక్షాలు ఆయనను అందుకోలేక ఆయాసపడుతున్నాయి.
రోజూ రేవంత్ షోనే – ఇలా అయితే కాంగ్రెస్‌కే అడ్వాంటేజ్
ఒకవేళ ఇదే పద్ధతిలో ఎన్నికల ప్రచారం ముగిసి, పోలింగ్ జరిగితే రేవంత్ రెడ్డి రాజకీయ చాణక్యం ముందు రెండు ప్రధాన ప్రతిపక్షాలు తేలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. స్థానిక సమస్యల కంటే రాష్ట్ర స్థాయి రాజకీయాల ప్రభావమే ఓటరుపై ఎక్కువగా పడుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మలచుకోవడంలో విపక్షాలు విఫలమవుతుండగా, రేవంత్ మాత్రం ప్రత్యర్థుల మధ్య ఉన్న పొత్తులను, అవినీతి ఆరోపణలను ఎండగట్టడం ద్వారా తన ఇమేజ్ను మరింత పెంచుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీల్లో ఊహించని మెజారిటీని ఇచ్చే అవకాశం ఉంది. అభివృద్ధి మంత్రం కంటే ప్రత్యర్థుల బలహీనతలను ఎత్తిచూపడం ద్వారా ఎన్నికల్లో గెలవచ్చనే తన పాత ఫార్ములాను రేవంత్ ఇక్కడ కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.
