తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ అలాగే ఓటుకు నోటు కేసులకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాల భద్రతపై ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టతనిచ్చారు. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఈ కేసులకు సంబంధించిన డేటా ఏమైనా కాలిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఘటనలో కేసులకు సంబంధించిన ఎటువంటి వస్తువులు గానీ, సమాచారం గానీ దెబ్బతినలేదని ఆమె వెల్లడించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు సేకరించిన సుమారు 132 రకాల భౌతిక సాక్ష్యాలను విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇందులో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. వీటన్నింటిని నిబంధనల ప్రకారం ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలించినట్లు డైరెక్టర్ తెలిపారు. ఈ పరికరాల నుంచి సేకరించిన డేటా మొత్తం అత్యంత సురక్షితంగా ఉందని, అగ్నిప్రమాదంలో వీటికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఆమె ధ్రువీకరించారు.
ఓటుకు నోటు కేసులో స్వాధీనం చేసుకున్న 16 భౌతిక సాక్ష్యాధారాల గురించి కూడా ఆమె కీలక వివరణ ఇచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఈ కేసుకి సంబంధించిన ఒక్క సాక్ష్యం కూడా ల్యాబ్‌లో లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే వాటికి సంబంధించిన పరిశోధనలు పూర్తయ్యాయని, ప్రస్తుతం ఆ వస్తువులు ఎఫ్ఎస్ఎల్ ఆధీనంలో లేవని వివరించారు. దీనివల్ల ఆ కేసు దర్యాప్తుపై ప్రమాదం ప్రభావం ఏమాత్రం లేదని స్పష్టమైంది.
అగ్నిప్రమాదంలో కేవలం పాత రికార్డులు, కొన్ని పర్నిచర్ మాత్రమే పాడయ్యాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శిఖా గోయల్ పేర్కొన్నారు. కీలకమైన కేసుల డిజిటల్ డేటా అంతా భద్రంగా ఉందని, ఫోరెన్సిక్ విశ్లేషణ నిరంతరాయంగా కొనసాగుతుందని ఆమె భరోసా ఇచ్చారు. ఈ ప్రకటనతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలకు తెరపడినట్లయింది.
