తెలంగాణ రాజకీయాల్లో సోమారం ఆసక్తికరమైన సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు అగ్రనేతలు బహిరంగసభలు ఏర్పాటు చేశారు. జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా, అదే రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల పంపిణీ సభను నిర్వహిస్తున్నారు.
చాలా కాలం తర్వాత కేసీఆర్ బహిరంగసభ
దాదాపు ఏడాది కాలంగా బహిరంగ సభలకు దూరంగా ఉన్న కేసీఆర్, ఇప్పుడు జగిత్యాల వేదికగా మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఈ సభా వేదికపై బీఆర్ఎస్లో చేరనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు దాటిన తరుణంలో, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పసిగట్టి, కేడర్లో ఉత్సాహం నింపేందుకు కేసీఆర్ ఈ సభను ఒక రీ లాంచ్ ప్యాడ్లా వాడుకుంటున్నారు. ఉత్తర తెలంగాణలో పట్టు కోల్పోకుండా చూసుకోవడం, అలాగే కవిత కొత్త పార్టీ వల్ల కలగబోయే నష్టాన్ని నివారించడం ఈ సభ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
రేవంత్ కౌంటర్ అటాక్
కేసీఆర్ సభ ప్రాధాన్యతను తగ్గించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్లాన్ వేసింది. నిన్నమొన్నటి వరకు నిధులు లేవని చెప్పిన ప్రభుత్వం, సరిగ్గా కేసీఆర్ సభ రోజే రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. కాటారంలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి 45 లక్షల మంది రైతులకు రూ. 2,063 కోట్లు జమ చేయనున్నారు. కేసీఆర్ విమర్శలు చేసే సమయంలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు చేరాలి అనేదే రేవంత్ సర్కార్ వ్యూహం.
వెంటనే కౌంటర్లు
ఈ రెండు సభల వెనుక బలమైన రాజకీయ ప్రేరణలు ఉన్నాయి. కేసీఆర్ తన సభలో కాంగ్రెస్ వైఫల్యాలను, రైతుల ఇబ్బందులను ఎండగట్టాలని చూస్తుంటే, రేవంత్ రెడ్డి అదే వేదికగా కేసీఆర్ పదేళ్ల పాలనలోని లోపాలను, ప్రాజెక్టుల వైఫల్యాలను ప్రజల ముందు ఉంచనున్నారు. ముఖ్యంగా జగిత్యాల సభ ద్వారా బీఆర్ఎస్ మళ్ళీ ఉనికిని చాటుకోవాలని చూస్తుంటే, రేవంత్ ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాలను అడ్డం పెట్టుకుని కేసీఆర్ గొంతును ప్రజలకు చేరకుండా చేయాలని ప్రయత్నిస్తోంది.
ఎవరిది పైచేయి?
ఒకే రోజు పక్కపక్క జిల్లాల్లో ఇద్దరు అగ్రనేతలు సభలు పెట్టడం అనేది ముందస్తు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. కేసీఆర్ సభకు వచ్చే జనాన్ని బట్టి బీఆర్ఎస్ బలం తెలుస్తుండగా, రైతు భరోసా నిధుల పంపిణీతో కాంగ్రెస్ రైతుల మద్దతును మళ్ళీ కూడగట్టుకోగలదా అనేది ఆసక్తికరం. కేసీఆర్ ఈ సభతో మళ్లీ యాక్టివ్ అవుతారా లేక.. ఫౌమ్ హౌస్ కే పరిమితవుతారా ఉన్నదాన్ని బట్టి తదుపరి రాజకీయం ఉంటుందని అనుకోవచ్చు.
