తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిమితులను దాటి రాష్ట్రంలోని టైర్-2 నగరాల వైపు వేగంగా విస్తరిస్తోంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లో గత రెండేళ్లలో భూముల ధరలు ఏకంగా రెట్టింపు అయ్యాయని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన భారీ వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీలు ఇప్పుడు ఈ జిల్లాల్లోనూ కనిపిస్తున్నాయి.
తెలంగాణకు రెండో రాజధానిగా భావించే వరంగల్ ఈ రేసులో అందరికంటే ముందుంది. ఇక్కడ బాలసముద్రం, హంటర్ రోడ్ వంటి ప్రాంతాల్లో గజం ధర సుమారు రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు పలుకుతోంది. సుమారు 350కి పైగా కొత్త నివాస ప్రాజెక్టులు ఇక్కడ నిర్మాణంలో ఉండగా, హైదరాబాద్‌లో పనిచేసే ఐటీ నిపుణులు, ఎన్ఆర్ఐలు తమ సొంత ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు ఊపందుకోవడం కూడా ఇక్కడి మార్కెట్‌కు కలిసొచ్చింది.
మరోవైపు కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి నగరాలు స్మార్ట్ సిటీ హోదా , మెరుగైన రహదారి సౌకర్యాలతో రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్లుగా మారుతున్నాయి. కరీంనగర్ వంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ధరలు చదరపు అడుగుకు రూ. 4,000 నుంచి రూ. 4,500 వరకు చేరుకున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్ , జిల్లాల్లో నిర్మిస్తున్న ఐటీ టవర్లు ఆయా నగరాల ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి. స్థానిక వ్యాపారులతో పాటు మధ్యతరగతి ప్రజలు కూడా సురక్షితమైన పెట్టుబడిగా భావించి ఈ ప్రాంతాల్లో ప్లాట్లు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.
హైదరాబాద్‌లో స్థిరాస్తి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లడంతో, ఇన్వెస్టర్ల చూపు ఇప్పుడు ఈ టైర్-2 నగరాలపై పడింది. వికేంద్రీకరణ అభివృద్ధి నమూనాను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో, వసతుల పరంగా ఈ నగరాలు మెట్రో నగరాలకు దీటుగా తయారవుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే, రాబోయే ఐదేళ్లలో తెలంగాణలోని ఈ ప్రధాన నగరాలు ఆర్థిక వ్యవస్థకు చుక్కానిలా మారుతాయని, తద్వారా రియల్ ఎస్టేట్ రంగం మరింత సుస్థిరంగా మారుతుంది.
