సామాన్యుడు చూస్తున్నాడు

జనగణమన మీద ఓ అభియోగం వుంది. కిట్టనివాళ్లు చేసిన అభియోగం కావచ్చు. టాగోర్ మహాశయడి చేత అప్పట్లో ఆ గీతాన్ని బ్రిటిష్ మహారాణిని స్వాగతించడానికి రాయించుకున్నారని. గతంలో ఆ గీతంలో అర్థానికి పెడార్థాలు తీసి, దానిని బ్రిటిష్ రాణి స్వాగతానికి అన్వయించి వివరించేవారు. అధినాయక జయహే అంటే బ్రిటిష్ రాణే అని, ఆమే భారత భాగ్య విధాత అని, తవ శుభ నామే అంటే ఆమె పేరే అని తవ జయగాధ అంటే రాణి గాధే అని ఇలా వివరించేవారు. రాను రాను ఆ వాదన కనుమరుగైంది. అదంతా వేరే సంగతి.

బ్రిటిష్ రాణి మన దేశం వచ్చినపుడు బోలెడు హడావుడి జరిగిందని కథలు కథలుగా చెబుతారు. అది స్వతంత్ర్యానికి పూర్వం. ఆ తరువాత కూడా మన దేశానికి ఏ విదేశీ నాయకుడు వచ్చినా జరిగే హడావుడి మనకు తెలియంది కాదు. అసలు మన ఊళ్లకు మన మంత్రి వస్తేనే బోలెడంత హడావుడి వుంటుంది. రాను రాను మంత్రుల సంఖ్య, టూర్లు పెరిగి, ఈ హడావుడి తగ్గింది. ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తే జరుగుతోంది.
ఇక విదేశీ నాయకులు వస్తే చెప్పనక్కరలేదు. తరచు విదేశీ జనాలు వస్తారనే, ఎయిర్ పోర్టు నుంచి వాళ్లు వెళ్లే రోడ్లను సదా సుందరంగా వుంచుతారు మన పాలకులు. విశాఖలో అయితే ఇలాంటి రోడ్ ఒకదానికి పేరే విఐపి రోడ్ అని పెట్టేసారు.

హైదరాబాద్ మున్సిపాల్టీకి ఓ జబ్బు వుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్, మాదాపూర్ లాంటి ఏరియాల్లో వేసిన రోడ్లే వేస్తుంటారు. చిన్న గుంత వున్నా, మళ్లీ కావాలంటే మొత్తం రోడ్ వేస్తారు. గల్లీ రోడ్లు ఎలా వున్నా పట్టించుకోరు. ఇది ఇప్పటి సంగతి కాదు. చంద్రబాబు అధికారంలో వున్నపుడే మొదలైంది. ప్రధాన రోడ్లన్నీ సూపర్ గా వుంటాయి. గల్లీలు అన్నీ అడుక్కుతింటున్నట్లు వుంటాయి.

కేటీఆర్ చేతికి పగ్గాలు వచ్చాక, ఆయనేమో వంద రోజుల్లో అంతా మార్చేస్తా అని చెప్పాక, జనం, నిజమే కాబోలు అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తే మరింత ఘోరంగా మారింది. కాంట్రాక్టర్లకు, అధికారులకు వర్షాలు అన్నవి వరాలుగా మారాయి. ఆవు బొమ్మ వేయమంటే తెల్లకాగితం ఇచ్చాడట ఒకడు. ఏమిటీ అంటే గడ్డి తింటున్న ఆవు అన్నాడట. గడ్డి ఏదీ అంటే ఆవు తినేసింది. పోనీ ఆవు ఏదీ అంటే, తిన్నాక అక్కడ ఎందుకు వుంటుంది? ఇదీ సమాధానం.

రోడ్లేవీ అంటే వర్షాలకు కొట్టుకుపోయాయి. ఇంత బుగ్గి, రాళ్లు తెచ్చి పోయడం, నిత్యం ఆ బుగ్గి జనాల మొహాన పౌడర్ లా తేలడం. హైదరాబాద్, సికిందరాబాద్ సామాన్యులు నిత్యం అనుభవిస్తున్న నరకం ఇది. ఇలాంటి టైమ్ లో అమెరికా ప్రెసిడెంట్ వారి ముద్దుల పట్టి ఇక్కడికి వచ్చింది. దాంతో మన పాలకులకు పూనకం వచ్చింది. ఆమె వెళ్లే రోడ్లు ముస్తాబు. ఆ పక్కన వున్న గోడలకు కళా ఖండాలు. వంతెనలకు రంగుల మేకప్ లు.

కానీ సామాన్యులు తిరగే గల్లీలు, రోడ్లు అన్నీ ఇంకా, ఇప్పటికీ, ఆ మాటకు వస్తే ఎప్పటికీ ఇలా ఘోరంగానే వుంటాయి. ఇవన్నీ పాలకులకు తెలియంది కాదు. కానీ పట్టని తనం. సామాన్యుడి బలహీనత తెలిసిన తనం. ఎన్నికల వేళ కులం, ప్రాంతం, డబ్బు, ఇవన్నీ వాడితే ఓట్లు అవే వస్తాయి. వాటికోసం వాళ్లుకు రోడ్లు వేయాలా? అనే ఆలోచనావిధానం.

దీంతో ఇప్పుడు రాజధానిలోని సామాన్యుడి గుండె రగిలిపోతోంది. తమ కళ్లెదురుగా జరుగుతున్న అసమానత చూసి మండుతోంది. ఒకటి గమనించాలి. ఎద్దు ఎప్పుడూ ఒకపక్కే పడుకోదు. సామాన్యుడి ఆలోచన ఎప్పుడూ ఒకేలా సాగదు. ఎప్పుడు రివర్స్ అవుతాడో వాడికే తెలియదు. గమనించుకోండి.

చిత్రగుప్తుడు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.