తెలుగు360 ఎడిటర్స్‌ కామెంట్: ప్రజల బాధ్యత పూర్తి.. ఇక పాలకులే సమర్థత చూపాలి..!

” లాక్‌డౌన్ ఎత్తివేయకపోతే కరోనా మరణాల కన్నా ఆకలి చావులే ఎక్కువగా ఉంటాయి..!”.. ఇన్పోసిన్ ఫౌండర్ నారాయణమూర్తి అన్న ఈ మాటలు అక్షర సత్యాలు. ఇప్పటి వరకూ కరోనా చావుల లెక్కలే వేశారు. కానీ ఆకలి చావులను ఇంత వరకూ లెక్క వేయలేదు. కాలి నడకన వేల కిలోమీటర్లు నడిచేందుకు వెళ్తూ దారిలో చనిపోయిన వారి లెక్కలు వేయలేదు. చిన్నా.. చితకా .. ముసలీముతకా అనే తేడా ఎన్ని వేల కిలోమీటర్లు అని కూడా చూడకుండా.. నడుచుకుంటూ వెళ్లిన కూలీల్లో భారతదేశం 70 ఏళ్ల కాలంలో సాధించిన మేడిపండు అభివృద్ధి సాక్షాత్కరించింది. ఏదో మాయ రోగం వచ్చి చస్తామనే భయం కన్నా.. అది రాకపోయినా ఆకలితో చర్చిపోతామనే భారతీయులు ఇంకా లక్షలు కాదు.. కోట్లలోనే ఉన్నారని తేలింది.

ఎన్ని కష్టాలు ఎదురైనా లాక్‌డౌన్ సక్సెస్ చేసిన జనం..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌.. మన దేశంపై తీవ్ర స్థాయిలో దాడి చేయబోతోందని అంచనాకు వచ్చిన మరుక్షణం ప్రభుత్వం.. లాక్ డౌన్ అనేసింది. సినిమాల్లో పోలీస్ వెనకగా వచ్చి “ఫ్రీజ్” అని అరిస్తే.. ఎలా కదలకుండా ఉండిపోవాలో… అలా ప్రజలందరూ ఉండిపోవాల్సి వచ్చింది. ఒక్క రోజు హఠాత్తుగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆగిపోతే పడే ఇబ్బందేమిటో.. దాదాపుగా ప్రజంలదరూ అనుభవించి ఉంటారు. ఎక్కడ ఉండాలో తెలియదు. ఏమి తినాలో తెలియదు. ఇంటి దగ్గర కుటుంబం ఎలా ఉందో తెలియదు. అలాంటి పరిస్థితి కోట్ల మంది భారతీయులు నలభై రోజులుగా అనుభవిస్తున్నారు. ఉన్న జబ్బులకు వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. బంధువులు చనిపోతే చివరి చూపులూ దక్కలేదు. పెళ్లిళ్లు ఆగిపోయాయి. నిత్యావసరాలు ఎంత ధరకు అంతకు కొనాల్సిన పరిస్థితి. తర్వాత ఉద్యోగాలు ఉంటాయో .. పనులు దొరుకుతాయో లేదోనన్న టెన్షన్. ఇలా సామాన్యుడికి సవాలక్ష సమస్యలు ఎదురయ్యాయి. అయినప్పటికీ.. ఒక్కరంటే.. ఒక్క భారతీయుడు… లాక్ డౌన్‌పై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ప్రభుత్వం తమ కోసమే కదా నిర్ణయం తీసుకుందని సముదాయించుకుని.. పంటి బిగువున అన్నీ బిగపట్టి భరించారు. ప్రభుత్వ ప్రయత్నాలను సక్సెస్ చేశారు. తమ వంతు బాధ్యతను వంద శాతం.. నిర్వహించారు.

దేశాన్ని గాడిలో పెట్టి సమర్థత చూపాల్సిన బాధ్యత పాలకులపై..!

ప్రజలు అద్భుతంగా సహకరించారని.. ప్రభుత్వం కూడా ప్రకటించింది. ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించకపోతే.. ఇప్పటికే దేశంలో పది లక్షలకుపై కరోనా పాజిటి‌వ్ కేసులు నమోదయ్యేవని.. ప్రభుత్వ వర్గాలే అంచనా వేశాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 30వేల దగ్గర మాత్రమే ఉంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. భారత్‌లో వైరస్ విస్తరణ అసలు లేనట్లే భావించాలి. అందుకే.. ప్రపంచ దేశాన్ని భారత్‌ను కీర్తిస్తున్నాయి. స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత పతాకాన్ని ఓ పర్వతంపై చిత్తరువులా చేసి.. ప్రదర్శించి.. శభాష్ అన్నది. అమెరికా మీడియా మొత్తం.. ట్రంప్‌ నిర్ణయాలతో పోల్చి.. మోడీని హీరోను చేశారు. భారత ప్రజలు చూపిన పట్టుదల వల్ల మోడీ ఇమేజ్‌ అంతర్జాతీయంగా పెరిగింది. ప్రజల చిత్తశుద్ధిని. వారి లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఇప్పుడు.. ప్రభుత్వం తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకూ ప్రజలు తమ బాధ్యతను నెరవేరిస్తే.. ఇక నుంచి తమ సమర్థతను ప్రభుత్వం చూపాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి.

పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే.. ఆకలి చావుల భారతం ఆవిష్కారమయ్యే ప్రమాదం..!

కేంద్రం సమర్థత చూపాల్సిన మొదటి అంశం… ప్రజలు త్యాగం చేసిన అంశాల్లో కొన్నింటినైనా సాధారణ స్థితికి తీసుకురావడం. అందులో మొదటిది .. ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడం. లాక్‌డౌన్‌తో కరోనాను కట్టడి చేయగలిగామని కేంద్రం సంతృప్తి పడుతోంది. కానీ అసలు సవాళ్లు అప్పుడే ప్రారంభమయ్యాయి. నిన్నామొన్నటిదాకా ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకుందాం.. ముందు ప్రాణాలు ముఖ్యం అన్న భావనతో.. మరో క్షణం ఆలోచించుకండా… లాక్‌డౌన్ ప్రకటించేసిన కేంద్రం.. ఇప్పుడు… ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టింది. ఎలాగోలా.. ఆర్థిక వ్యవహారాలు ప్రారంభించకపోతే .. లాక్ డౌన్ ప్రకటించేసి.. కాపాడుకున్న ప్రజల ప్రాణాలు ఆకలి చావుల ఖాతాలో పడినా ఆశ్చర్యపోనవసరం లేని పరిస్థితి వచ్చేసిది. ప్రభుత్వాల దగ్గర్నుంచి విభిన్న వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తులే దీనికి నిదర్శనం. కోట్ల మంది వలస కూలీల వేదనే సాక్ష్యం. అందుకే కేంద్ర ప్రభుత్వం తక్షణం ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఆ ఏదో ఒకటి చేయడంలోనే ప్రభుత్వ సమర్థత ఇమిడి ఉంది.

ఆర్థిక వ్యవస్థను మళ్లీ నిటారుగా నిలబెట్టడమే ఇప్పుడు అసలైన దేశభక్తి..!

సాఫీగా నడుస్తున్న ఆర్థిక వ్యవస్థను ఒక్క సారిగా నిలిపివేస్తే.. మళ్లీ ట్రాక్ ఎక్కించడం అంత తేలిక కాదు. ఈ విషయాన్ని ఆర్థిక నిపుణులు ముందుగానే చెబుతున్నారు. ఒక వేళ లాక్ డౌన్ ఎత్తివేసినా.. ఎక్కడ ఆగిపోయిందో.. ఆర్థిక వ్యవస్థను అక్కడి నుంచి ప్రారంభించడం సాధ్యం కాదు. సీఏ పరీక్షల్లాగా.. మళ్లీ అన్నింటిలో పాసవుతూ రావాలి. భారత ఆర్థిక వ్యవస్థ మొన్నటిదాకా సజావుగా సాగింది. అందుకే.. రెండు నెలల పాటు ఇబ్బందికర పరిస్థితులు రాలేదు. గతంలో సాధించిన జీడీపీకి తగ్గట్లుగా రూ. లక్షన్నర కోట్ల వరకూ నగదును మార్కెట్లోకి పంపించగలిగారు. కానీ ఇక పంపించడం సాధ్యం కాదు. ఎందుకంటే.. లాక్ డౌన్ కారణంగా ఉత్పాదక కార్యకలాపాలు మొత్తం నిలిచిపోయాయి. ఈ సమస్య నుంచి లాక్ డౌన్ ఎత్తివేతతోనే బయట పడలేరని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కరోనాపై పోరాటం ఎంత సీరియస్‌గా సాగిందో అంతకు మించిన పట్టుదలతో… ఆర్థిక వ్యవస్థను మళ్లీ నిర్మించాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు.. ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూస్తే.. కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే పోదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా పరుగులు పెట్టించాలన్నది ఇప్పుడు.. కేంద్రం ముందు ఉన్న పెద్ద సవాల్.

మోడీ సమర్థతపై దేశ ప్రజలందరికీ నమ్మకమే..!

నరేంద్రమోడీ ఇప్పటి వరకూ మ్యాజిక్ చేసినట్లుగానే… ఆఫ్టర్ కరోనా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తారని .. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాదు… అన్ని పారిశ్రామిక రంగాలు ఎదురు చూస్తున్నాయి. మోదీ సర్కార్ కూడా.. ఈ విషయంలో కసరత్తు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరో ప్యాకేజీ ప్రకటించి ఆర్థిక వ్యవస్థలో చురుకుదనం తేవాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మే మూడో తేదీ తర్వాత గ్రీన్ జోన్లలో యధావిధిగా ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. దేశంలో 70 శాతం ప్రాంతాల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కేంద్రం.. అన్ని వర్గాల ప్రజలను.. అన్ని రంగాల వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలను కాపాడాల్సి ఉంది. అలా కాపాడటమే అసలైన సమర్థత. ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిన తర్వాత.. జాతి ఐక్యత పేరుతో చప్పట్లు కొట్టడం.. క్యాండిల్స్ వెలిగించడం లాంటి వ్యవహారాలు పెట్టినా ప్రయోజనం ఉండదు. అందుకే.. ప్రజల బాధ్యత ముగిసింది.. ఇక పాలకులే సమర్థత చూపాల్సి ఉంది. మోడీ సమర్థతపై దేశ ప్రజలందరికీ నమ్మకం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close