చిత్రసీమలో ఐకమత్యం లేదని అప్పుడప్పుడూ కొంతమంది సినీ పెద్దలు వాపోతుంటారు. ఇది చాలా సందర్భాలలో నిజమే అనిపించింది. ‘అఖండ 2’ ఇష్యూలోనూ ఇదే నిరూపితమయ్యింది. డిసెంబరు 5న రావాల్సిన సినిమా ఇది. కానీ కోర్టు గొడవలు, పాత బకాయిల వల్ల వాయిదా పడింది. ఇంకొద్ది గంటల్లో ప్రీమియర్ షోలు మొదలవుతాయనగా… కోర్టు స్పీడ్ బ్రకర్ వేసింది. దాంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. కొంతమంది ట్విట్టర్ వేదికగా.. నిర్మాతలపై తమ ఆగ్రహాన్నివ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో మిగిలిన నిర్మాతలు.. 14 రీల్స్ సంస్థకు కాస్త అండ దండగా నిలవాల్సింది. కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడారు. ఈ విషయంపై తమన్ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అఖండ 2’ సక్సెస్ మీట్ లో సంగీత దర్శకుడు తమన్ ఇండస్ట్రీలో ఐకమత్యం గురించి కొన్ని కీలకమైన, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అనుకొంటే ముందే సినిమాని ఆపోచ్చని, కానీ చివరి నిమిషంలో వచ్చి సినిమాని ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు తమన్. అందరూ నేనూ, నాది.. అనే ఆలోచిస్తున్నారని, మనం అనుకొంటేనే బలం అని, కానీ అలా అనుకోలేకపోతున్నారని కొంతమందిపై పరోక్షంగా చురకలు అంటించారు. మైకు, ఛానలు దొరికితే.. ఎక్కేస్తున్నారని, లేనిపోని సలహాలు ఇస్తున్నారని, అదే 14 రీల్స్ ఆఫీసుకొచ్చి మాట్లాడితే బాగుండేదని కౌంటర్ వేశారు. తెలుగు చిత్రసీమ గురించి మిగిలిన వాళ్లంతా గొప్పగా చెప్పుకొంటున్నారని, కానీ ఇక్కడ మాత్రం నెగిటివిటీ ఎక్కువ కనిపిస్తోందన్నారు. సినిమాని ఆపుకోవాలని ఏ నిర్మాతా అనుకోడని ఆ క్షణం ఎంత కుమిలిపోయి ఉంటారో, వాళ్లెంత బాధ పడి ఉంటారో ఆలోచించాలని, ఒకరికి దెబ్బ తగిలితే బ్యాండేజీ వేయాలని, అంతేకానీ బ్యాండు కొట్టకూడదని సలహా ఇచ్చారు.
తమన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమన్ ఎవరి గురించి మాట్లాడి ఉంటాడు? అఖండ 2 గురించి చెడుగా మాట్లాడిన వ్యక్తులు ఎవరు? అనే విషయంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తమన్ చెప్పినట్టు… ‘అఖండ 2’ వాయిదా పడినప్పుడు 14 రీల్స్ ప్లస్ నిర్మాతలపై విపరీతమైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. సరైన ప్రణాళిక లేకుండా ఇంత పెద్ద సినిమా ఎలా తీశారంటూ ఎద్దేవా చేశారు. చివరికి ఆ ఆటంకాలన్నీ తొలగించుకొని, విఘ్నాలు దాటుకొని సినిమా విడుదలైంది. తొలి వారంలో మంచి వసూళ్లు అందుకొంది. ఈ జోరు రెండో వారం కూడా కొనసాగితే అఖండ నిర్మాతల కష్టాలు తొలగినట్టే.
