వైసీపీ తీరుపై టీడీపీలో చ‌ర్చ‌కు స‌మ‌య‌మిదా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల విష‌య‌మై కేంద్రం తీరుపై ఢిల్లీలో టీడీపీ నిర‌స‌న వ్య‌క్తం చేస్తోంది. పార్ల‌మెంటు బ‌య‌టా లోప‌లా త‌మ స్వ‌రం వినిపించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఢిల్లీలో ప‌రిణామాల‌పై ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌మీక్షిస్తున్నారు. కేంద్రంతో అనుస‌రించాల్సిన వైఖ‌రిపై ఎప్ప‌టిక‌ప్పుడు ఎంపీల‌తో మాట్లాడుతున్నారు. మిత్ర‌ప‌క్షంపై ఒత్తిడి పెంచుతున్నామ‌ని చెబుతున్నారు. అయితే, కేంద్రం నుంచి కొంత సాధించుకుంటే త‌ప్ప‌… టీడీపీ నిబ‌ద్ధ‌తే ప్ర‌శ్నార్థ‌కంగా మారే ప‌రిస్థితి ఉంది. ఆ తీవ్ర‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు తెలుసు కాబ‌ట్టే… ఢిల్లీలో ప‌రిణామాల‌ను అమ‌రావ‌తి నుంచి నిరంత‌రం స‌మీక్షిస్తున్నారు. అయితే, ఇదే స‌మ‌యంలో వైకాపా గురించీ, ప్ర‌తిప‌క్ష పాత్ర గురించి కూడా టీడీపీ నేత‌లు విశ్లేషిస్తుండ‌టం గ‌మ‌నార్హం! నిజానికి, అధికార పార్టీగా ఆంధ్రా ప్ర‌యోజ‌నాల‌ను కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన అవ‌స‌రం టీడీపీకి ఉంటుంది. ఇత‌ర పార్టీల నిబ‌ద్ధ‌త ఏంట‌నేది ప్ర‌జ‌ల‌కు వ‌దిలేయాల్సిన అంశం క‌దా!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్షత‌న జ‌రిగిన టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో ఢిల్లీ ప‌రిణామాల‌ను చ‌ర్చించారు. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీతో మంత్రి సుజ‌నా చౌద‌రి భేటీ వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ఒత్తిడి పెంచ‌డం వ‌ల్ల‌నే కేంద్రంలో క‌ద‌లిక వ‌చ్చింద‌ని నేత‌లు చెప్పారు. అయితే, ఇదే స‌మ‌యంలో వైకాపా డిఫెన్స్ లో ప‌డింద‌ని టీడీపీ నేత‌లు చెప్ప‌డం విశేషం. త‌మ పార్టీ ఎంపీలు పార్ల‌మెంటులో నిర‌స‌న వ్య‌క్తం చేస్తుంటే.. వైకాపా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఒక మూల‌న కూర్చున్నార‌ని టీడీపీ ఎంపీలు చంద్ర‌బాబుకు చెప్పారు. ఈ సంద‌ర్భంలో సీఎం స్పందిస్తూ… వైకాపా గుంట‌న‌క్క వేషాలు వేస్తోంద‌ని విమ‌ర్శించారు. స్వ‌లాభం కోసం నాట‌కాలాడుతున్న ప్ర‌తిప‌క్ష నేత‌ల తీరును ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని చంద్ర‌బాబు కాస్త ఆవేశంగానే స్పందించారు. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌ధానిని క‌లిసేందుకు వైకాపా నేత‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌డం పీఎంవోకి మంచిది కాద‌ని హిత‌వు ప‌లికారు. ఇదే అంశ‌మై ఢిల్లీలో ఏపీ ఎంపీ సీఎం ర‌మేష్ కూడా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ చిత్త‌శుద్ధిని ప్ర‌శ్నించే నైతిక హ‌క్కు వైకాపాకి లేద‌ని అక్క‌డ ఆయ‌న అన్నారు. జ‌గ‌న్ త‌న కేసుల గురించే త‌ప్ప‌, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల గురించి ఆలోచించ‌రు అని ఆరోపించారు.

ఈ స‌మ‌యంలో, స‌మ‌న్వ‌య క‌మిటీ భేటీలో ప్ర‌తిప‌క్షం తీరుపై ఇంత విశ్లేష‌ణ అవ‌స‌ర‌మా చెప్పండీ! ప్ర‌ధాని అపాయింట్మెంట్ కోసం విజ‌యసాయిరెడ్డి ప్రయ‌త్నిస్తుంటే… అది పీఎంవోకి మంచిది కాద‌నీ, కేసుల విచార‌ణ ప్ర‌క్రియ‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని చంద్ర‌బాబు విశ్లేషించాల్సిన ప‌నేముంది చెప్పండి..? ఢిల్లీలో కేంద్రంపై పెంచుతున్న ఒత్తిడి నేప‌థ్యంలో వైకాపా డిఫెన్స్ లో ప‌డిందో లేదో అనే చ‌ర్చ టీడీపీ ఎంపీల‌కు అవ‌స‌ర‌మా..? రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఢిల్లీలో పోరాటం చేస్తున్న‌ప్పుడు… వీలైతే అన్ని పార్టీల‌నూ క‌లుపుకునే ప్ర‌య‌త్నం చేయాలి. ప‌క్క రాష్ట్రం త‌మిళ‌నాడు గ‌తంలో ఇదే చేసింది. టీడీపీ పెద్ద‌న్న పాత్ర‌ను తీసుకుని.. వైకాపా ఎంపీల‌ను కూడా త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల్సిందిగా కోరితే తప్పేముంది..? పార్ల‌మెంటులో టీడీపీ ఎంపీలు ఒక ప‌క్క‌, వైకాపా ఎంపీలు మ‌రోప‌క్క‌.. ఇలా వేర్వేరుగా ఒకే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పోరాడుతున్నాం అంటే, భాజ‌పా స‌ర్కారు త‌క్ష‌ణం స్పందించాల‌న్న తీవ్ర‌త ఎక్క‌డి నుంచి వ‌స్తుంది..? అందుకే, ఏపీ అంశాల‌పై ఇప్ప‌టికీ ‘చూస్తున్నాం, చేస్తున్నాం, ప‌రిశీలిస్తున్నాం, స్పందిస్తాం’ అనే ప్ర‌క‌ట‌నే మోడీ స‌ర్కారు చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.