తృణమూల్ కాంగ్రెస్ సంక్షోభం తుది అంకానికి చేరినట్లే కనిపిస్తోంది. అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ, ఇప్పుడు తన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను కూడా కాపాడుకోలేని నిస్సహాయ స్థితికి పడిపోయారు. టీఎంసీకి చెందిన అత్యధిక శాతం ఎంపీలు తిరుగుబాటు చేసి భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తుండటంతో రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఈ పరిణామంతో ఉభయసభల్లోనూ ప్రతిపక్షాల బలం నామమాత్రంగా మారిపోగా, కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమి అజేయమైన శక్తిగా అవతరించింది.
రాజ్యాంగ సవరణలు ఇక ఈజీ
లోక్‌సభలో మొత్తం స్థానాలు 543 కాగా, రాజ్యాంగ సవరణలు చేయడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజార్టీ మార్కు 362 సీట్లు. ఇప్పటికే పూర్తి మెజార్టీతో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి, ఇప్పుడు బెంగాల్ నుంచి వచ్చిన టీఎంసీ ఎంపీల బలం తోడవడంతో ఈ మార్కును అందుకోవడం అత్యంత సులువుగా మారింది. ప్రస్తుతం లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజార్టీకి ఎన్డీఏకు కేవలం సుమారు 15 నుండి 20 మంది సభ్యుల లోటు ఉంటుంది. కానీ బిల్లు పెడితే ఇతర పార్టీలు మద్దతివ్వడానికి రెడీగా ఉంటాయి.
టీఎంసీ రాజ్యసభ ఎంపీలు కలిస్తే లైన్ క్లియర్
పెద్దల సభ అయిన రాజ్యసభలో మొత్తం స్థానాలు 245 కాగా, ఇక్కడ 2/3rd మెజార్టీ మార్కు 164 సీట్లు. ప్రస్తుతం ఎన్డీఏ బలం సుమారు 148 స్థానాల వద్ద ఉంది. ఇప్పుడు టీఎంసీకి చెందిన రాజ్యసభ సభ్యులు కూడా తోడైతే, ఈ మార్కు 160కి చేరుకుంటుంది. అంటే, రాజ్యసభలో కూడా రాజ్యాంగ సవరణలు చేయడానికి ఎన్డీఏ కూటమికి కేవలం 4 నుండి 5 మంది సభ్యుల లోటు మాత్రమే ఉంటుంది. ఏ కూటమిలో లేని వైసీపీ లాంటి పార్టీలు అడగకుండానే మద్దతివ్వడానికి రెడీగా ఉంటాయి. ఇప్పుడు డీఎంకే కూడా తప్పించుకునే ప్రయత్నం చేయదు.
బీజేపీని కాదనలేని ఇతర ప్రాంతీయ పార్టీలు
ఉభయసభల్లోనూ ఈ స్వల్ప లోటును భర్తీ చేయడం బీజేపీకి ఏమాత్రం కష్టమైన పని కాదు. జాతీయ స్థాయిలో మారుతున్న ఈ నయా ట్రెండ్‌ను గమనిస్తున్న వైఎస్సార్సీపీ , బీజేడీ , ఇటు ద్రవిడ మున్నేట్ర కజగం వంటి ఇతర ప్రాంతీయ పార్టీలు.. సందర్భాన్ని బట్టి, తమ రాష్ట్ర ప్రయోజనాల నెపంతో కేంద్ర ప్రభుత్వానికి బిల్లుల వారీగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే తమ ఉనికిని కాపాడుకోవాలనే లౌక్యపు రాజకీయాలను ఈ పార్టీలు అనుసరిస్తున్నాయి.
లైన్ క్లియర్
ప్రస్తుత రాజకీయ వాతావరణంలో బీజేపీని నేరుగా ఢీకొట్టి, శతృత్వం కొని తెచ్చుకుని, తమ సొంత ఎంపీలను లేదా పార్టీని కోల్పోయే ఆత్మహత్య సదృశ్య సాహసానికి ఏ ప్రాంతీయ పార్టీ కూడా సిద్ధంగా లేదు. మమతా బెనర్జీ ఘర్షణ వైఖరిని నమ్ముకుని ఎలాగైతే తన సామ్రాజ్యాన్ని కోల్పోయారో, ఆ తప్పును తాము చేయకూడదని మిగతా ప్రాంతీయ శక్తులు భావిస్తున్నాయి. ఫలితంగా, పార్లమెంట్లో తిరుగులేని రెండు వంతుల మెజార్టీ వైపు దూసుకుపోతున్న బీజేపీని అడ్డుకోవడం ప్రస్తుత శూన్య పరిస్థితుల్లో విపక్ష కూటమికి అసాధ్యమనే చెప్పాలి. అందుకే మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ తాము అనుకున్నట్లుగానే ప్రభుత్వం చేయనుంది.
