పోలవరం ప్రాజెక్టుకు సెంటిమెంట్ కలర్..!

పోల‌వ‌రం ప్రాజెక్టు సంద‌ర్శ‌న‌కు ప్ర‌తిపక్ష పార్టీ నేత‌లు ఇటీవ‌లే వెళ్లొచ్చారు. అక్క‌డ ప‌నులు స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డం లేద‌నీ, వైకాపా నేత‌లు వ‌స్తారు కాబ‌ట్టి, పనులు జరుగుతున్నట్టు కనిపించాల‌న్న హ‌డావుడి క‌నిపించిందని విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. అడుగడుగునా పోల‌వ‌రంలో అవినీతి కనిపిస్తోంద‌ని కూడా విమ‌ర్శించారు. ఇక‌, జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా పోల‌వ‌రం ప్రాజెక్టు సంద‌ర్శ‌న‌కు వెళ్లిన సంగతీ తెలిసిందే. అయితే, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆశిస్తున్న‌ట్టుగా 2018 నాటికి పోల‌వ‌రం పూర్త‌య్యే ప‌రిస్థితి లేద‌న్న‌ట్టుగా ఆయ‌న మాట్లాడారు. కానీ, చంద్ర‌బాబును న‌మ్ముతున్నానంటూ మ‌ధ్యేమార్గంలో ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఇంకోప‌క్క‌… పోల‌వ‌రం ప‌నుల టెండ‌ర్ల‌కు సంబంధించిన అంశ‌మై కేంద్రం నుంచీ లేఖ రావ‌డం, అదో పెద్ద చ‌ర్చ జ‌ర‌గ‌డం.. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సోమవారం పోల‌వ‌రం ప్రాజెక్టుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల‌తో మాట్లాడారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు అనేది ఆంధ్రాకు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య అన్నారు. త‌న రాజ‌కీయ జీవితంలో ఒక ప్రాజెక్టు నిర్మాణం మీద ఇంత శ్ర‌ద్ధ‌, ఇంత శ్ర‌మ‌, ఇంత ఫోక‌స్ గ‌తంలో ఎప్పుడూ పెట్ట‌లేద‌న్నారు. వ్య‌క్తిగ‌తంగా పోల‌వ‌రాన్ని చాలా సీనియ‌ర్ గా తీసుకున్నాను అన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టుపై ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ చేస్తున్న విమర్శ‌ల గురించి మాట్లాడుతూ… ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి జ‌గ‌న్ ని తీసుకొచ్చినా ఆయ‌న‌కు అర్థ‌మ‌య్యేది ఏముంద‌ని ఎద్దేవా చేశారు. ఆయ‌న‌కి పిల్ల‌ర్ అంటే తెలుసా, ఎర్త్ వ‌ర్క్ అంటే తెలుసా, డ‌యాఫామ్ వాల్ అంటే తెలుసా అంటూ వ్యాఖ్యానించారు. న‌ల‌భైయేళ్లుగా ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణాల‌ను చూస్తున్న త‌న‌కు కూడా కొన్ని సాంకేతిక అంశాలు ఇప్పటికీ తెలియ‌వని చంద్ర‌బాబు చెప్పారు. ఈ మ‌ధ్య ప్రాజెక్టు చూడ్డానికి వ‌చ్చిన ఒక నాయ‌కుడు.. డ‌యాఫామ్ వాల్ ఎక్క‌డుంద‌ని అడుగుతున్నార‌నీ, అవ‌గాహ‌న లేక‌పోతే హుందాగా ఉండాలిగానీ… ఏమీ తెలియ‌న‌ప్పుడు ఎందుకు మాట్లాడాలి అన్నారు. డ‌యాఫామ్ వాల్ తెలియాలంటే ఆయ‌న్ని భూమి లోపలికి పంపించాల‌న్నారు.

కేంద్ర‌మంత్రి నితిన్ గ‌ట్క‌రీని క‌లిసిన ప్ర‌తిప‌క్ష స‌భ్యులు ప్రాజెక్టుపై ఫిర్యాదు చేశార‌న్నారు. కేంద్రం నుంచి మ‌నం స‌హ‌కారం కోసం ఎదురుచూస్తున్న‌ప్పుడు.. రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఫిర్యాదు చేయ‌డ‌మంటే ప్రాజెక్టును అడ్డుకోవ‌డ‌మే అంటూ మండిప‌డ్డారు. ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుప‌డేవారంద‌రికీ హెచ్చ‌రిస్తున్నాన‌నీ, ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి గురి కావొద్ద‌ని చంద్ర‌బాబు అన్నారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రుల సెంటిమెంట్ అని అర్థం చేసుకోవాలన్నారు. ప‌నిలో ప‌నిగా మీడియాకు ఓ చిన్న క్లాస్ తీసుకున్నారు. పోల‌వ‌రంపై ఎవ‌రైనా విమ‌ర్శిస్తే మీరు వెంటనే ప్ర‌శ్నించాల‌న్నారు. ఇది రాష్ట్ర ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు కోసం, ముందు త‌రాల కోసం జ‌రుగుతున్న నిర్మాణ‌మ‌ని గుర్తుపెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

మొత్తానికి, గ‌త కొద్దిరోజులుగా పోల‌వ‌రం ప్రాజెక్టు అంశ‌మై వినిపిస్తున్న విమ‌ర్శ‌ల‌కూ జ‌రుగుతున్న చ‌ర్చ‌కూ ఓ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ముఖ్య‌మంత్రి మాట్లాడారు. అయితే, ప‌నిలోప‌నిగా పోల‌వ‌రం ప్రాజెక్టును ఏపీ ప్ర‌జ‌ల సెంటిమెంట్ అన‌డం విశేషం. అంటే, ప్రాజెక్టుపై ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేస్తే… ఆంధ్రుల సెంటిమెంట్ పై కామెంట్ చేసిన‌ట్టు భావించాల‌న్న‌మాట‌! అయినా, పోల‌వ‌రం నిర్మాణాన్ని ఒక ఎమోష‌న‌ల్ అంశంగా మార్చాల్సిన అవ‌స‌రం ఏముంది.? ఆ కోణంలో ప్ర‌జ‌లను అధికార పార్టీకి మ‌రింత‌గా క‌నెక్ట్ చెయ్యొచ్చా..? అలా అన్నంత మాత్రాన ప్రతిపక్షాలు విమర్శించడం మానేస్తాయా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.