భాజ‌పాకీ తొగాడియాకు అక్క‌డే చెడిందా..?

విశ్వ హిందూ ప‌రిష‌త్ అంత‌ర్జాతీయ వ‌ర్కింగ్ క‌మిటీ ప్రెసిడెంట్ ప్ర‌వీణ్ తొగాడియా వ్య‌వ‌హారం ఇప్పుడు సంచ‌ల‌న‌మైంది. వీహెచ్ పీ అన‌గానే అది భాజ‌పాకు మ‌ద్ద‌తు ఇచ్చేదిగా మ‌నం చూస్తుంటాం. భాజ‌పా, వీహెచ్ పీ అజెండాలు వేర్వేరుగా ఉంటాయ‌నిగానీ, వైరుధ్యం ఉంటుంద‌నిగానీ ఊహించ‌లేం కాదా. కానీ, అందుకు పూర్తి భిన్నంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు తొగాడియా. భాజ‌పా స‌ర్కారు త‌న‌ను ఎన్ కౌంట‌ర్ చేయాల‌నే కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు. త‌న‌ను చంపేందుకు కుట్ర జ‌రుగుతోందనీ, దాన్లో భాగంగానే ఎప్ప‌టిదో ఒక పాత కేసును వెలికి తీసిన రాజ‌స్థాన్ పోలీసులు గుజ‌రాత్ వ‌చ్చారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అయితే, రాజ‌స్థాన్ పోలీసులు తొగాడియాను అరెస్ట్ చేశారంటూ వీహెచ్ పీ ప్ర‌క‌టించేసింది. దీనిపై వెంట‌నే రాజ‌స్థాన్ పోలీసులు స్పందించి అలాంటిదేం జ‌ర‌గ‌లేద‌ని ఖండించింది. ఆయ‌న్ని అరెస్ట్ చేయ‌డానికి వెళ్తే..ఆయ‌న అందుబాటులో లేర‌ని వారు ప్ర‌క‌టించారు. దీంతో ప్ర‌వీణ్ తొగాడియా ఏమ‌య్యార‌నేది చ‌ర్చ‌నీయం అయింది. చివ‌రికి మంగ‌ళ‌వారం రాత్రి ఆయ‌న ఆచూకీ దొర‌క‌డంతో ఈ ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది.

అయితే, తొగాడియా చేస్తున్న ఆరోప‌ణ‌లు మాత్రం చ‌ర్చ‌నీయం అవుతున్నాయి.గోహ‌త్య‌కు వ్య‌తిరేకంగా చ‌ట్టం తీసుకుని రావాల‌ని, రామ మందిర నిర్మాణంస‌త్వ‌ర‌మే చేప‌ట్టాల‌ని తాము డిమాండ్ చేస్తున్నాం కాబ‌ట్టే త‌న‌ను ఇలా టార్గెట్ చేస్తున్నారంటూ తొగాడియా అన్నారు. నిజానికి, ఈ రెండూ భాజ‌పాకు అనుకూల‌మైన డిమాండ్లే కదా! అలాంట‌ప్పుడు, ఈ డిమాండ్ల‌ను అణ‌చివేసే ప్ర‌య‌త్నంలో భాగంగానే తొగాడియాపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు భాజ‌పా స‌ర్కారు దిగుతోందంటే కాస్త ఆశ్చ‌ర్యంగానే ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగేసింది! ప్ర‌వీణ్ తొగాడియా చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై వెంట‌నే
స‌మ‌గ్ర విచార‌ణ చేయాలంటూ ఆ పార్టీ నేత‌లు ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు. ఇంత‌కీ.. ఉన్న‌ట్టుండి ప్ర‌వీణ్ తొగాడియా భాజ‌పాకి ఎందుకు టార్గెట్ గా మారిపోయారు..? నిజంగానే, ప్ర‌ధాని మోడీకీ తొగాడియాకు ఎక్క‌డైనా చెడిందా… అంటే, అవునే క‌థ‌నాలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి.

గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో భాజ‌పాకి చావు త‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన అనుభ‌వం ఎదురైన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో భాజ‌పాకి మెజారిటీ ద‌గ్గ‌డం
వెన‌క ప్ర‌వీణ్ తొగాడియా హ‌స్తం ఉంద‌నే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. అంతేకాదు, మోడీ స‌ర్కారుకు ఒక ద‌శ‌లో చెమ‌ట్లు ప‌ట్టించిన పాటీదార్
ఉద్య‌మ నేత హార్థిక్ ప‌టేల్ తో తొగాడియాకు సాన్నిహిత్యం ఉంద‌నీ, దీంతో భాజ‌పా నేత‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌నే అభిప్రాయం కూడా ఇప్పుడు
వినిపిస్తోంది. ఈ కార‌ణాలతోనే వీహెచ్ పీ కీల‌క బాధ్య‌త‌ల నుంచి ప్ర‌వీణ్ తొగాడియాను త‌ప్పించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌నీ, ఇదంతా తెర వెన‌క భాజ‌పా న‌డిపిస్తున్న స్క్రీన్ ప్లే అనే చ‌ర్చ ఇప్పుడు తెర‌మీదికి వ‌స్తోంది. అయితే, ఈ త‌రుణంలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌వీణ్
తొగాడియా ఆసుప‌త్రిలో చేర‌డం.. అక్క‌డికి హార్థిక్ ప‌టేల్ వెళ్ల‌డం కూడా భాజ‌పా పెద్ద‌ల‌కు ఆగ్ర‌హం తెప్పించే ప‌రిణామంగానే చెప్పుకోవ‌చ్చు. మొత్తానికి, భాజ‌పాకీ ప్ర‌వీణ్ తొగాడియాకూ మ‌ధ్య‌లో విభేదాలు తారస్థాయికి చేరాయ‌ని చెప్పుకోవ‌చ్చు. ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా ఎలాంటి మ‌లుపులు తీసుకుంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.