సంక్రాంతి సినిమాలతో జనవరి సరదాగా గడిచిపోయింది. ఫిబ్రవరిలో పెద్దగా మెరుపుల్లేవు. ప్రతీవారం సినిమాలు వచ్చినా.. పెద్దగా ఊపు రాలేదు. సంక్రాంతి తరవాత కొన్ని వారాలు బాక్సాఫీసు డల్ గా ఉంటుందన్న విషయాన్ని ఫిబ్రవరి మరోసారి నిజం చేసింది. ఇప్పుడు మార్చి వచ్చేసింది. వేసవి సినిమాల హడావుడి ఈనెలతోనే మొదలవుతుంది. బరిలో కొన్ని పెద్ద సినిమాలు, కొన్ని చిన్న సినిమాలు, ఇంకొన్ని డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఎలా చూసినా ఈనెల కాస్త కళ కనిపించే అవకాశం ఉంది.
ఈనెలలో చెప్పుకోదగిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. ‘ఓజీ’తో సూపర్ హిట్ కొట్టి… పవన్ ఫ్యాన్స్ చాలా హుషారులో ఉన్నారు. పైగా పవన్ భక్తుడు హరీష్ ఈ సినిమాకు దర్శకుడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ని ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. ఈ సినిమాతో కూడా అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ వస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈనెల 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఒక రోజు ముందే అంటే 25న ప్రీమియర్లు ఉంటాయి.
మార్చిలో వస్తున్న మరో క్రేజీ సినిమా ‘టాక్సిక్’. యశ్ హీరోగా నటించిన సినిమా ఇది. టీజర్ ఓవర్ ది బోర్డ్ గా అనిపించింది. హింస ఎక్కువగా కనిపించింది. అయితే ఈతరహా సినిమాలకు ఇప్పుడు గిరాకీ బాగుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఆయన భారీ రేటుకి ఈ సినిమాని కొనడం కూడా చర్చనీయాంశం అయ్యింది. కేజీఎఫ్ తరవాత యశ్ చేస్తున్న సినిమా కాబట్టి, అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్ తీసుకొనే అవకాశం ఉంది.
‘ధురంధర్ 2’కూడా ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకోనుంది. ‘ధురంధర్’ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ధురంధర్ 2 హవా ఈసారి ఇంకాస్త గట్టిగా ఉండబోతోంది. ఈసారి ధురంధర్ ని తెలుగులోనూ చూడొచ్చు. ధురంధర్ – టాక్సిక్ రెండూ ఒకే రోజున విడుదల అవ్వడం వల్ల.. ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది.
ఈనెలలోనే ‘మృత్యుంజయ్’, ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’, ‘బ్యాండ్ మేళం’, ‘సరస్వతి’, ‘మెన్షన్ హౌస్ మల్లేశం’, ‘సతీ లీలావతి’ లాంటి చిన్న, మీడియం సైజు సినిమాలు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. ప్రతీవారం రెండు మూడు సినిమాలైనా బాక్సాఫీసు ముందుకు రావడం ఖాయం. కాకపోతే.. విన్నింగ్ పర్సంటేజ్ ఎంత అనేదే కీలకం. ఫిబ్రవరిలో బోసిబోయిన బాక్సాఫీస్‌కు మార్చి నెలలో అయినా కాస్త ఉపశమనం దొరుకుతుందేమో చూడాలి.
