నిర్మాతలకూ, ప్రదర్శన కారులకూ మధ్య మళ్లీ గ్యాప్ వచ్చింది. రెంటల్, పర్సంటేజీ విధానాలపై మళ్లీ మంకుపట్టు మొదలైంది. ఎగ్జిబీటర్లేమో రెంటల్ వద్దని, పర్సంటేజీ ఇస్తేనే సినిమాలు నడుపుతామని అల్టిమేట్టం జారీ చేశారు. దానికి గిల్డ్ ధీటుగా బదులు ఇచ్చింది. పర్సంటేజీలపై సినిమాల్ని విడుదల చేయడం మా వల్ల కాదంటూ తేల్చి చెప్పింది. యాక్టీవ్ ప్రొడ్యూసర్లు ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాయి. దాంతో టాలీవుడ్ లో థియేటర్లు మళ్లీ మూతబడతాయేమో అనే అనుమానాలు మొదలయ్యాయి.
సరిగ్గా ఏడాది క్రితం ఇదే విషయంపై ఎగ్జిబీటర్లు ఎదురు తిరిగారు. థియేటర్ల నిర్వహణ కష్టతరం అయిపోతోందని, పర్సంటేజీ ఇవ్వకపోతే సినిమాల్ని ఆడించలేమంటూ స్వచ్ఛందంగా థియేటర్లు మూసి వేశారు. ఆ సమయంలో రిలీజ్‌కి సినిమాలు కూడా ఏం లేవు. కాబట్టి.. పెద్ద నష్టమేం జరగలేదు. కాకపోతే.. ఛాంబర్లో పంచాయితీలు నడిచాయి. చివరికి మళ్లీ యధావిధిగా రెంటల్ ప్రతిపాదనపైనే థియేటర్లు తెరచుకొన్నాయి. ఇప్పుడు మళ్లీ ఈ పంచాయితీ మొదలైంది. తెలంగాణలోని 23 థియేటర్లు పర్సంటేజీ ప్రతిపాదన తీసుకొచ్చి, దానికి ఒప్పుకొంటేనే సినిమాలు ఆడిస్తామని బేరం పెట్టాయి. ఈ విషయమై గిల్డ్ సమావేశమైంది. ఎగ్జిబీటర్ల ప్రతిపాదన పూర్తిగా ఏకపక్షమని, పర్సంటేజీ విధానానికి మేం వ్యతిరేకం అని తేల్చి చెప్పాయి. దీనిపై ఎగ్జిబీటర్లు స్పందించాల్సివుంది.
ఒకవేళ.. ఎగ్జిబీటర్లు కూడా మొండితనానికి పోతే, తెలంగాణలో కొన్ని థియేటర్లు మూతపడడం ఖాయం. వాళ్లంతా ఒక్క మాటపై ఉంటే గనుక.. మొత్తం థియేటర్లకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇప్పటికే లీజ్ పద్ధతిలో ఆడిస్తున్న థియేటర్లు, మల్టీప్లెక్సులు మాత్రమే నిర్మాతలకు అందుబాటులో ఉంటాయి. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు వచ్చినప్పుడు ఫర్వాలేదు. కానీ పెద్ద సినిమాలు వస్తే మాత్రం సరిపడా థియేటర్లు దొరకవు. ఇది నిర్మాతలకు ఇబ్బంది కరమైన వాతావరణమే. ఈ సమస్యని పరిష్కరించుకోవాలంటే మళ్లీ ఛాంబర్లో మీటింగులు జరగాల్సిందే. బయ్యర్లు, నిర్మాతలు, ఎగ్జిబీటర్లు ఒక్క మాటపై ఉండాల్సిందే. ఇలాంటి కీలకమైన విషయాల్లో శాశ్వతమైన నిర్ణయాలు తీసుకోవడడం చాలా అవసరం. లేదంటే మాటిమాటికీ థియేటర్లు మూసేస్తామంటూ ఎగ్జిబీటర్లు భయపెట్టే ప్రమాదం ఉంది. ఈ విషయంలో నిర్మాతలు కూడా త్వరితగతిన ఓ నిర్ణయానికి వస్తే మంచిది.
