ఇటీవల ఓ భారీ సినిమా విడుదలై… ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాపై ఆశలు పెట్టుకొన్న నిర్మాత నష్టపోయాడు. సినిమాని భారీ రేట్లకు కొన్న బయ్యర్లు నష్టపోయారు. ఈ సినిమాకు పని చేసినవాళ్లకూ ఈ భారం తప్పలేదు. సినిమాకు సంబంధించి 24 విభాగాలు ఉంటాయి. వాళ్లలో సగం మందికి ఈ సినిమా పేమెంట్లు దక్కలేదన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. నిజానికి విడుదలకు ముందు ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. అది ఉంటేనే విడుదలకు క్లియెన్స్ ఉంటుంది.కానీ నిర్మాణ సంస్థపై ఉన్న నమ్మకంతో ప్రొడక్షన్ టీమ్, వీఎఫ్ఎక్స్ కంపెనీలు, స్టూడియోలు, కాస్ట్యూమర్లు, డబ్బింగ్ ఆర్టిస్టులు.. ఇలా చాలామంది ఇబ్బంది పెట్టలేదు. ‘రిలీజ్ అయ్యాక.. ఓటీటీ పేమెంట్ వస్తుంది.అప్పుడు డ్యూస్క్లియర్ చేస్తా’ అని నిర్మాత కూడా నచ్చజెప్పడంతో వాళ్లంతా సైలెంట్ అయిపోయారు. తీరా చూస్తే… సినిమా ఎప్పుడైతే ఫ్లాప్ అయ్యిందో, అప్పుడు నిర్మాత కూడా సైడ్ అయిపోయాడు. ఓటీటీ డబ్బులు క్లియర్ చేసినా.. తమ బాలెన్సులు ఇవ్వడం లేదని ఈ సినిమాకు పని చేసినవాళ్లంతా వాపోతున్నారు. నిర్మాతకు ఫోన్ చేస్తే.. ఆయన నెంబర్లన్నీ వరుసగా బ్లాక్ చేసుకొంటూ వెళ్లిపోతున్నాడు. కొత్త నెంబర్లకు ఎలాగూ రెస్పాండ్ అవ్వడం లేదు. దాంతో ఛాంబర్ లో పంచాయితీ పెట్టాలని వర్కర్లంతా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
కాకపోతే సదరు నిర్మాతకు కాస్తో కూస్తో మైలేజీ వుంది. సినిమాల్లో వచ్చినా, పోయినా.. మళ్లీ సినిమాలే తీస్తాడన్న పేరుంది. ఇప్పుడు కాకపోయినా, తదుపరి సినిమాకు పని చేస్తే, డబ్బులు వస్తాయిలే అని కొంతమంది వర్కర్లు మెత్తబడుతున్నారు. ఛాంబర్ లో పంచాయితీ పెట్టినా, వెంటనే తేలే వ్యవహారం కూడా కాదు. ఈలోగా ఆ నిర్మాతతో రిలేషన్స్ దెబ్బతింటాయి. వచ్చే అవకాశాలకూ గండి పడుతుంది. అందుకే ఫిర్యాదు విషయంలో వాళ్లంతా వెనుకా ముందూ ఊగుతున్నారు. ”ఇండస్ట్రీలో ఇలాంటి రాని బాకీలు, మొండి బకాయిలు చాలానే ఉంటాయి. 24 విభాగాలు కూడా వాటికి సిద్ధపడే ఉంటారు. పంచాయితీలతో ఇలాంటి సమస్యలు సర్దుబాటు అవ్వవు” అని ఇండస్ట్రీ పెద్దలు సలహాలు ఇస్తున్నారు.
