ఈ ప‌రిస్థితి చంద్ర‌బాబుకు క‌త్తిమీద సాము లాంటిదే..!

ఓప‌క్క ఎంపీల రాజీనామాలంటూ ప్ర‌తిప‌క్ష పార్టీ హ‌డావుడి చేస్తోంది. ప్ర‌త్యేక హోదాపై పోరాటం తీవ్ర‌త‌రం చేస్తామంటూ ప్ర‌క‌టించింది. ఏప్రిల్ 5 వ‌ర‌కూ డెడ్ లైన్ పెట్టుకున్నారు. వైకాపా చేస్తున్న పోరాటం రాజ‌కీయ ల‌బ్ధి కోసం అనేది అర్థ‌మౌతూనే ఉంది. ప్ర‌త్యేక హోదాను చంద్ర‌బాబు తీసుకు రాలేక‌పోయార‌నీ, కేంద్రంతో రాజీప‌డి ప్యాకేజీకి ఒప్పుకున్నార‌నే అంశాన్ని ప్రజ‌ల్లోకి ప్ర‌చారంగా తీసుకెళ్లే ప‌నిలో జ‌గ‌న్ ఉన్నారు. వైకాపా ఎంపీల రాజీనామాలు కేంద్రాన్ని ప్ర‌భావితం చేయ‌డం అనేది ఊహించ‌లేం. ఎందుకంటే, వైకాపా వారికి మిత్ర‌ప‌క్షం కాదు క‌దా! ఇక‌, రాష్ట్ర స్థాయిలో రాజ‌కీయంగా ఈ రాజీనామాల అంశాన్ని స‌మ‌ర్థంగా తిప్పికొట్టాల్సిన అవ‌స‌రం టీడీపీకి ఉంది. ప్ర‌స్తుత ప‌రిస్ధితుల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ముందు రెండు ల‌క్ష్యాలున్నాయ‌ని చెప్పుకోవ‌చ్చు. మొద‌టిది.. రాష్ట్రంలో విప‌క్షం చేస్తున్న ప్ర‌చారాన్ని తిప్పి కొట్ట‌డం, రాజీనామా ఎత్తుగ‌డ‌కి ధీటుగా జ‌వాబు ఇవ్వ‌డం. రెండోది… కేంద్రం ఇస్తామ‌ని చెబుతున్న నిధులూ కేటాయింపుల్ని ఈ స‌మ‌యంలోనే రాబ‌ట్టుకునే స్థాయిలో ఒత్తిడి పెంచ‌డం.

ముఖ్య‌మంత్రి నివాసంలో జ‌రిగిన టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీలో చంద్ర‌బాబు మాట‌లు గ‌మ‌నిస్తే… ఈ రెండు అంశాల చుట్టూనే వ్యూహ‌ర‌చ‌న ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. వైకాపా ఏప్రిల్ 5 డెడ్ లైన్ పెట్టుకుంది. కానీ, మార్చి 5లోగానే… అంటే, పార్ల‌మెంటు స‌మావేశాలు మొద‌ల‌య్యేలోగానే కేంద్రంపై ఒత్తిడి పెంచి, ఇస్తామ‌న్న‌వి రాబ‌ట్టుకునే స్థాయిలో ఒత్తిడి పెంచాల‌నేది టీడీపీ ప్ర‌థ‌మ ప్రాధాన్యంగా క‌నిపిస్తోంది. అందుకే, అంచెలంచెలుగా నిర్ణ‌యాలు ఉంటాయ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. అవసరమైతే తామూ రాజీనామాల వరకూ వెళ్తామనే సంకేతాలు ఇచ్చారు. ఇలా ఒత్తిడి పెంచుకుంటూ వెళ్లినా కేంద్రం తీరులో మార్పు రాక‌పోతే.. మార్చి 5లోగానే భాజ‌పాతో తెగ‌తెంపులు ఉంటాయ‌నే సంకేతాలు ఇచ్చారు. అంటే, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కేంద్రం ఇచ్చిన మాట నిల‌బెట్టుకోక‌పోయినా రాజ‌కీయంగా ఆంధ్రాలో ఎలాంటి వ్య‌తిరేక‌త రాకుండా ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్టే క‌దా..!

ఇక‌, క్షేత్ర‌స్థాయిలో వైకాపా ప్ర‌చారాన్ని బ‌లంగా తిప్పి కొట్టాల‌ని నేత‌ల‌కు సూచించారు. బ‌డ్జెట్ ప్ర‌వేశపెట్టిన రోజునే చాలా బాగుంద‌ని వైకాపా మెచ్చుకున్న అంశం, ఎంపీలు రాజీనామాలు అంటున్నారుగానీ… విజ‌య‌సాయిరెడ్డితో రాజీనామా చేయించ‌రు అనే అంశం, ఉప ఎన్నిక‌లు రాకుండా ఉండేందుకే ఏప్రిల్ 6 వ‌ర‌కూ రాజీనామాలు చేయ‌కుండా ఆగుతున్నార‌నే అంశం… వీటిని ప్ర‌ధానంగా రాష్ట్ర ప్ర‌జ‌లకు వివ‌రించేందుకు టీడీపీ సిద్ధ‌మౌతోంది. వీటితోపాటు, మ‌రీ ముఖ్యంగా… ప్ర‌త్యేక హోదాను టీడీపీ స‌ర్కారు వ‌దులుకోలేద‌నీ, దానిలో ఉన్న ప్ర‌యోజ‌నాల‌న్నీ ప్యాకేజీ ద్వారా ఇస్తామ‌ని కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌క‌టించాక‌నే ఒప్పుకున్నామ‌నే అంశాన్ని కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని భావిస్తున్నారు.

ఏదేమైనా, ప్రస్తుత ప‌రిస్థితి ఏపీ స‌ర్కారుకు క‌త్తిమీద సాములాంటిదే. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాన్ని రాజ‌కీయంగా ఎదుర్కోవాలి, కేంద్రంపై ఒత్తిడి పెంచి రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు సాధించుకోవాలి. ఇంకోప‌క్క‌, లెక్క‌లు తేల్చేస్తామంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా జె.ఎఫ్.సి.ని ఏర్పాటు చేసి… ప్ర‌భుత్వ వ్య‌తిరేక వాయిస్ కి వేదిక క‌ల్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన‌వి రప్పించుకోవ‌డం… లేని ప‌క్షంలో వీరంద‌రికీ మించిన స్థాయిలో భాజ‌పాతో పోరాటానికి దిగ‌డం… టీడీపీ ముందున్న మార్గాలు ఇవే ఉన్న‌ట్టుగా క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.