సీఎల్పీని విలీనం చేసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు..?

తెలంగాణ సీఎల్పీని తెరాస‌లో విలీనం చేసే ప్ర‌క్రియ మొద‌లైంది! ఇప్ప‌టికే, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌దిమంది ఎమ్మెల్యేలు తెరాస తీర్థం పుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. వారంతా ఇవాళ్ల ఒక్కొక్క‌రుగా తెరాస ఎల్పీకి వస్తున్నారు. దీంతో విలీనానికి సంబంధించిన సాంకేతిక ప్ర‌క్రియ ప్రారంభ‌మైన‌ట్టు స‌మాచారం. ఈ వ్య‌వ‌హార‌మంతా తెరాస వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌దిమంది కాంగ్రెస్ ను వీడారు, మ‌రో ముగ్గురు కూడా ఇవాళ్లో రేపో తెరాస‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. దీంతో మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాస‌లోకి వ‌చ్చేసిన‌ట్టు అవుతుంది. కాబ‌ట్టి, ఈ మెజారిటీ స‌భ్యులు సీఎల్పీ విలీనాన్ని కోరుతూ స్పీక‌ర్ కు లేఖ రాయాల్సి ఉంటుంది. ఆ లేఖపై సంత‌కాలు చేయ‌డం కోస‌మే ఇవాళ్ల వ‌ల‌స నేత‌లు తెరాస ఎల్పీకి వ‌స్తున్నట్టు స‌మాచారం.

గ‌త అసెంబ్లీలో కూడా ఇలానే జ‌రిగింది. అప్ప‌ట్లో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తెరాస ఎల్పీలో విలీన‌మౌతామంటూ స్పీక‌ర్ కి లేఖ ఇచ్చిన ప‌రిస్థితి ఉంది. వెంట‌నే స్పీక‌ర్ స్పందించ‌డం, విలీనానికి ఆమోదం ల‌భించ‌డ‌మూ జ‌రిగిపోయింది. శాస‌న మండ‌లిలో కూడా ఇలాంటి విలీన ప్ర‌క్రియ జ‌రిగింది. కాంగ్రెస్ కి చెందిన ఎమ్మెల్యేలు తెరాస‌లోకి చేరుతూ… మండ‌లిలోని ఎల్పీని తెరాస‌లో విలీనం చేశారు. ఇక, ఇప్పుడు మిగిలింది అసెంబ్లీలో ఎల్పీని విలీనం చేయ‌డం మాత్ర‌మే! అందుకే, పార్టీ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ స‌భ్యులు ఒక్కొక్క‌రిగా వ‌చ్చి సంతకాలు చేసే ప్ర‌క్రియను తెరాస ప్రారంభించింది.

రాబోయే మ‌రో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేతోపాటు సంత‌కాలు తీసుకున్నాక‌, సోమ‌వారం లేదా మంగ‌ళ‌వారం నాడు సీఎల్పీ విలీన లేఖ‌ను అసెంబ్లీ స్పీక‌ర్ కి అందించాల‌న్న ఆలోచ‌న‌లో తెరాస ఉన్న‌ట్టు స‌మాచారం. సో… ఇది పూర్త‌యితే తెరాస రాజ‌కీయ ల‌క్ష్యం దాదాపు పూర్త‌యిన‌ట్టే. అసెంబ్లీలో తెరాస‌కు ఇక తిరుగులేని ప‌రిస్థితి. అసెంబ్లీలో ఏక‌ఛ‌త్రాధిప‌త్య‌మే..! అయితే, ఈ విలీన ప్ర‌క్రియ‌పై టీపీసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. గ‌తంలో ఇదే అంశంపై ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… విలీనం అంత సులువు కాద‌నీ, సాంకేతికంగా చాలా అంశాలు ఉంటాయ‌ని ఓసారి అభిప్రాయ‌ప‌డ్డ ప‌రిస్థితి ఉంది. మ‌రి, తాజాగా మొద‌లైన ఈ విలీన ప్ర‌క్రియ‌పై ఆయ‌న ఎలా స్పందిస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com