గులాబి గుప్పెట్లో గ్రామాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ రైతును రాజును చేయాలన్నది తన కల అని ప్రకటించారు.బాగానే వుంది. కాని రైతు రైతుగా బతికే పరిస్తితులే ఇప్పుడు లేవు. ఇప్పటికి దేశంలోనే రైతుల పరిస్థితి ప్రమాదకరంగా వున్న రాష్ట్రాలలో తెలంగాణ మొదటి స్థానాల్లోనే వుంది. ఎకరాకు పంటకు నాలుగు వేల చొప్పున సహాయం చేస్తామన్నది కెసిఆర్‌ కొద్ది మాసాల కిందట చేసిన ప్రకటన. అయితే దీనివల్ల ఎక్కువ భూమి వున్న వాళ్లకే ఎక్కువ దక్కుతుందనేది ఒక వాస్తవం. పైగా ఆప్పుడే ఒక మెలిక పెట్టారు. సహాయానికి అర్హులైన వారిని గుర్తించేందుకు గ్రామాలలో రైతు సంఘాలు పెడతామన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతు సంఘాలు జెఎసిలు కూడా చాలా వున్నాయి. మరి కొత్తగా కెసిఆర్‌ చెప్పేవేమిటంటే ప్రభుత్వం నియమించే నామినేటెడ్‌ సంఘాలు. ఈ సహాయం మాత్రమే గాక రైతులకు వ్యవసాయానికి ప్రభుత్వం వైపు నుంచి ఏమి చేయాలన్నా ఈ సంఘాలే నిర్ణయిస్తాయట. 11 మంది సభ్యులు వుండే ఈ సమాఖ్యలు భూ రికార్డుల ఖరారు పంటల తీరు మార్కెట్‌ ధరలు అన్నిటినీ నడిపిస్తాయట. మరి ఇంత కీలకమైన ఈ కమిటీలను ప్రభుత్వం నామినేట్‌ చేయడమంటే టిఆర్‌ఎస్‌కు అనుకూలమైన వారినే నియమించడం అని వేరే చెప్పనవసరం లేదు కదా..ఎపిలో జన్మభూమి కమిటీలు చేస్తున్న పనే తెలంగాణ గ్రామాలలో ఈ రైతు సమాఖ్యలు చేస్తాయి. గెలిచిన ప్రతిపక్ష ఎంఎల్‌ఎల కంటే ఓడిపోయిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థులే ఎక్కువ పలుకుబడి చలాయిస్తున్నారన్న మాట ఇప్పటికే బలంగా వినిపిస్తుంది. ఇక ఈ సమాఖ్యలు కూడా వస్తే ప్రతిపక్షాలు వాటికి సంబంధించిన సంఘాలు పూర్తిగా దెబ్బతింటాయని ప్రభుత్వ వ్యూహం కావచ్చు. పైగా సహాయం కోసం ఈ సమాఖ్యల చుట్టూ తిరిగే రైతులు అనుకోకుండానే గులాబి పార్టీవైపు వస్తారని ఆశ. ప్రభుత్వ వ్యయంతోనే ఆ పని జరిగిపోతుంది. ఇప్పటికే రైతుల భూముల సేకరణ, గిట్టుబాటు ధరలు, రుణాలు వడ్డీలతో సహా అనేక సమస్యలలో నలిగిపోతున్న రైతులకు ప్రభుత్వం ఇచ్చే ఈ సహాయం పరిమితమే అయినా వదులుకోగల స్థితిలో వుండరు.అయితే హక్కుగా ఇచ్చే దాన్ని ఈ సమాఖ్యల ద్వారా ఇప్పించి ఉత్తరోత్తరా వారిని గుప్పిట్లో పెట్టేసుకోవడం తథ్యం. దీనిపై చర్చలలో ఏమి మాట్లాడినా టిఆర్‌ఎస్‌ నాయకులు లోలోపల అంగీకరిస్తున్నారు. ఎవరు అధికారంలో వున్నా రాజకీయ ప్రయోజనాలు చూసుకోవడం సహజమే కదా అని మాత్రం సమర్థించుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.