ఇప్పుడు ఉప ఎన్నిక‌లా.. తెరాసది సాహ‌స‌మా..?

చినికి చినికి గాలీవానా అన్న‌ట్టుగా… గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై నిర‌సన‌తో మొద‌లైన తెరాస వెర్సెస్ కాంగ్రెస్ రాజ‌కీయ వేడి, ఇప్పుడు ఉప ఎన్నిక‌ల వ‌ర‌కూ వెళ్ల‌బోతోందా..? అంటే, అవున‌నే అనిపిస్తోంది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం సంద‌ర్భంగా కాంగ్రెస్ స‌భ్యులు ఆందోళ‌న‌, మండ‌లి ఛైర్మ‌న్ స్వామి గౌడ్ కి గాయం… అనంత‌రం అనూహ్య రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిలో ఇద్దరి శాస‌న స‌భ్య‌త్వాలను సభ ర‌ద్దు చేసిన సంగ‌తీ తెలిసిందే. ఇదే సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం అనుకుంటే… తెరాస ఇక్క‌డితో ఆగ‌కుండా మ‌రో అడుగు ముందుకు వేసి, ఆ ఇద్ద‌రి శాస‌న స‌భ్యులు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లకు వెళ్లేందుకు కూడా సిద్ధ‌మైపోయింది.

న‌ల్గొండ శాస‌న స‌భ్యుడు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే సంప‌త్‌ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ స‌భ తీర్మానం చేసింది. దీన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపించాల‌ని రాష్ట్ర స‌ర్కారు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. దీంతో దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని దృష్టిలో పెట్టుకుని వ‌చ్చే ఆరు నెల‌ల్లోపు ఈ రెండు స్థానాల‌కు ఉప ఎన్నిక నిర్వ‌హించే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. కాబ‌ట్టి, వాటితోనే ఈ రెండు స్థానాల ఉప ఎన్నిక‌ల షెడ్యూల్ ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంటుంద‌ని అధికార పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అధికార పార్టీ తెరాస ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు సిద్ధ‌ప‌డ‌టం సాహసమే. ఎందుకంటే, న‌ల్గొండ‌, అలంపూర్ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ కి మంచి ప‌ట్టుంది. పైగా కోమ‌టిరెడ్డి, సంప‌త్ లు ఆ పార్టీలో బ‌ల‌మైన నేత‌లు. దీంతో తాము కూడా ఎన్నిక‌ల‌కు సై అంటే సై అంటున్నారు. ప్ర‌జ‌ల్లోనే త‌మ స‌త్తా తేల్చుకుంటామ‌నీ, తెరాస‌ను అక్క‌డే ధీటుగా ఎదుర్కొంటామ‌నీ, ఈ ఉప ఎన్నిక‌ల నుంచే తెరాస ప‌త‌నం మొద‌లు అంటూ కాలు దువ్వుతున్నారు. సాధార‌ణ ఎన్నిక‌ల కంటే ముందుగానే కాంగ్రెస్ ను ఈ ఉప ఎన్నిక‌ల్లో దెబ్బ తీయడం ద్వారా నైతికంగా ఆ పార్టీని బ‌ల‌హీన ప‌ర‌చొచ్చు అనే ఉద్దేశంతో తెరాస ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణ‌లో ఒక్క‌సారిగా రాజ‌కీయ వేడి రాజుకున్న‌ట్టు అవుతుంది. అయితే, ఇంకోప‌క్క ఇలా స‌భ్య‌త్వాలు ర‌ద్దు చేయ‌డంపై న్యాయ‌ప‌ర‌మైన అంశాలు ఏవైనా ఉన్నాయా అనే కోణం నుంచి కూడా కాంగ్రెస్ స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌వేళ అలాంటి అవ‌కాశం ఉంటే న్యాయ పోరాటానికి వెళ్లాల‌ని కూడా నేత‌లు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.