క‌విత చుట్టూ క‌ట్టుదిట్ట‌మైన తెరాస వ్యూహం..!

ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌వైపు అడుగులు వేస్తున్న క్ర‌మంలో రాష్ట్ర స్థాయి స‌మీక‌ర‌ణ చాలా మారిపోతున్నాయి. కేసీఆర్ ఢిల్లీకి వెళ్తే, రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి కేటీఆర్ అవుతార‌నే అభిప్రాయం ఇప్ప‌టికే బ‌లంగా వినిపిస్తోంది. ఇదే క్ర‌మంలో వార‌స‌త్వ రేసులో ఉన్న మ‌రో మంత్రి హ‌రీష్ రావు చుట్టూ ఒక సందిగ్ధ వాతావ‌ర‌ణం సృష్టించారన్న అభిప్రాయ‌మూ వ్య‌క్త‌మౌతోంది..! ఆయ‌న్ని కూడా లోక్ స‌భ‌కి తీసుకెళ్తే… రాష్ట్రస్థాయిలో కేటీఆర్ కు లైన్ మ‌రింత క్లియ‌ర్ గా ఉంటుంద‌నే వ్యూహంతో తెరాస‌లో కొన్ని మార్పులూ చేర్పులూ జ‌రిగేలా ఉన్న‌ట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో తెరాస‌లో రాజ‌కీయ‌మంతా కేవ‌లం కేటీఆర్ చుట్టూ మాత్ర‌మే తిర‌గాల‌నీ, ఇత‌ర శ‌క్తులేవీ ఉద్భ‌వించ‌కుండా మొక్క‌లోనే తుంచేయాల‌న్న అప్ర‌క‌టిత వ్యూహం తెరాస‌లో అమ‌లు జ‌ర‌గ‌డం మొద‌లైంద‌న్న గుస‌గుస‌ వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ క‌విత విష‌యంలో కొంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించే తీరు క‌నిపిస్తోంది.

నిజానికి, ఆమె వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీకి పోటీ చేద్దామ‌ని అనుకుంటున్నారు. ఎందుకంటే, ఎంపీగా ఉన్నా ఆమెకి మంత్రి ప‌దవి రాలేదు. దీంతో క‌నీసం రాష్ట్రస్థాయిలోనైనా క్రియాశీలంగా ఉండాల‌న్న‌ది ఆమె ఆలోచ‌న అనే అభిప్రాయం చాన్నాళ్లుగా వినిపిస్తున్న‌దే. దానికి అనుగుణంగానే ఆమె జ‌గిత్యాల నియోజ‌క వ‌ర్గాన్ని ఎంచుకున్నారు. అక్క‌డ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టిమ‌రీ అభివృద్ధి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించడాన్ని ఈ మ‌ధ్య చూస్తున్నాం. అయితే, క‌విత‌ను మ‌రోసారి లోక్ స‌భ‌కు పంపించాల‌న్న‌దే తెరాస నిర్ణ‌యంగా తెలుస్తోంది. ఎందుకంటే, రాష్ట్ర స్థాయిలో కేటీఆర్ కు స‌మాంత‌ర‌మైన రాజ‌కీయ శ‌క్తులు ఉండ‌రాదు క‌దా! అదే ఆలోచ‌న‌తో ఆమెని మ‌రోసారి నిజామాబాద్ నుంచి లోక్ స‌భ బ‌రిలో దించాల‌నే పార్టీ భావిస్తోంద‌ట‌. అంతేకాదు, క‌విత‌కు అత్యంత బ‌ల‌మైన వేదిక‌గా ఉన్న తెలంగాణ జాగృతి విష‌యంలో కూడా తెరాస అధినాయ‌క‌త్వం కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది..! తెలంగాణ జాగృతిలో చాలామంది రాజ‌కీయ ఆకాంక్ష‌ల‌తో ప‌నిచేస్తున్నారనీ, భ‌విష్య‌త్తులో వారు టిక్కెట్లు ఆశించే అవ‌కాశం ఉంద‌నే ఆలోచ‌న‌తో క‌మిటీల‌ను ర‌ద్దు చేశారు.

తెరాస‌లో కేటీఆర్ కి తిరుగు ఉండ‌కూడ‌దు, ఆయ‌న‌కు స‌మాంత‌రంగా భ‌విష్య‌త్తులో ఎద‌గ‌బోయే అవ‌కాశాలున్న శ‌క్తుల్ని ఇప్ప‌ట్నుంచే నిర్వీర్యం చేస్తున్నారు. కేసీఆర్ వార‌సులు అంటే అప్ప‌ట్లో హ‌రీష్ రావు పేరు ప్ర‌ముఖంగా వినిపించేది. ద‌శ‌లవారీగా ఆయ‌న ప్రాధాన్య‌త‌ను త‌గ్గించేందుకు కేటీఆర్ కు ప్రాధాన్య‌త పెంచారు..! ఇప్పుడు భ‌విష్య‌త్తులో క‌విత నుంచి కూడా కొంత ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు వ‌స్తాయేమో అనే ముందుచూపుతో, ఇప్ప‌ట్నుంచే ఆమెను ప‌క్క‌న పెట్టేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇది తెరాస‌లో మాత్ర‌మే సాధ్య‌మైన రాజ‌కీయం…! ఎవరు చెప్పారండీ.. రాజకీయాల్లో బంధుప్రతీ ఉంటుందనీ..? అధికారం దగ్గరకు వచ్చేసరికి తన పర భేదాలు పోతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.