టీఆర్ఎస్‌, వైసీపీలకు లిట్మస్ టెస్ట్‌గా ట్రిపుల్ తలాక్ బిల్లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితికి రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు లిట్మస్ టెస్ట్‌గా మారింది. దీనికి కారణం.. బిల్లు పాలవ్వాలంటే.. ఎన్డీఏకు.. కచ్చితంగా… టీఆర్ఎస్ , వైసీపీ సహకారం అవసరం. నేరుగా మద్దతిస్తే.. సమస్యే లేదు… కనీసం వాకౌట్ అయినా చేసి సహకరించాలి. కానీ… తెలంగాణ రాష్ట్ర సమితి, వైసీపీ ఈ రెండింటిలో ఏదీ చేసిన ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముస్లిం వర్గం.. ఆ వర్గం ఓటర్ల సంగతి పక్కన పెట్టినా… బీజేపీకి సహకరించారనే పేరు మాత్రం.. ఎన్నికలకు ముందు ముద్రలా పడిపోతుంది. రాజ్యసభలో.. ఇప్పుడున్న బలాబలాల ప్రకారం.. ఎన్డీఏ ఈ బిల్లును స్వంతంగా నెగ్గించుకోవడం అసాధ్యం. గతంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సమయంలో రహస్య మిత్రులుగా పేరు పడిన అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్ సహకరించాయి. ఇప్పుడు అవే సహకరించాలి. వాటికి వైసీపీ తోడవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

కేసీఆర్‌కు ఇప్పటి వరకూ ఫెడరల్ ఫ్రంట్ తరపున ఉన్న ఒకే ఒక్క మిత్రుడు… అసదుద్దీన్ ఓవైసీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన లోక్‌సభ చర్చ సందర్భంగా కొన్ని సవరణలు పెట్టారు. కానీ అవన్ని వీగిపోయాయి. లోక్‌సభలో ఈ బిల్లును టీఆర్ఎస్ వ్యతిరేకించింది. కానీ ఓటింగ్‌ను మాత్రం వాకౌట్ చేసింది. టీఆర్ఎస్ ఇలా లోక్‌సభలో ఓటింగ్‌కు గైర్హాజర్ కావడం వల్ల బీజేపీకి వచ్చిన నష్టం ఏమీ లేదు కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. రాజ్యసభలో మాత్రం పరిస్థితి వేరేగా ఉంది. అక్కడ బిల్లును కచ్చితంగా వ్యతిరేకించాలి. వ్యతిరేకిస్తే సరిపోదు.. వ్యతిరేకంగా ఓటు వేయాలి. తెలివి ప్రదర్శించి వాకౌట్ చేస్తే.. అది బిల్లు పాసవ్వడానికి పరోక్షంగా సహకారం అందించినట్లవుతుంది. ఓవైసీ ఎలాగూ.. అంగీకరిస్తారు కానీ.. కేసీఆర్‌కు మాత్రం.. ముస్లిం ఓటు బ్యాంకులో కోత పడుతుంది.

అచ్చంగా వైసీపీది కూడా అదే పరిస్థితి. లోక్‌సభలో బిల్లు వచ్చినప్పుడు.. ప్రత్యేకంగా.. ఓ విధానం తీసుకోవాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే..ఇలాంటి ఇబ్బందులు రాకుండా.. చాలా రోజుల కిందటే.. వైసీపీకి చెందిన ఎంపీలు రాజీనామాలు చేసేశారు. కాబట్టి.. ఇప్పుడు.. రాజ్యసభలోనే వారి సీన్ ఉంది. రాజ్యసభలో ఆ పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. బిల్లుపై ఇప్పటికి తమ అభ్యంతరాలేమిటో.. సానుకూలతలేమిటో స్పష్టంగా చెప్పలేదు. బీజేపీకి వ్యతిరేకం అని గట్టిగా నిరూపించదల్చుకుంటే.. వ్యతిరేకంగా ఓటేస్తారు. కాదు.. అనుకుంటే మాత్రం.. బీజేపీకి మద్దతుగా ఓటేయడమో… వాకౌట్ చేయడమో చేస్తారు. ఈ రెండింటిలో ఏది చేసినా.. వైసీపీ మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com