చీర‌ల పంపిణీ కేసీఆర్ స‌ర్కారు ప‌రువు తీస్తోందా..?

సెంటిమెంట్ తో రాజ‌కీయాలు చేయ‌డం ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు బాగా తెలుసు. తెలంగాణ ఉద్య‌మం ద‌గ్గ‌ర నుంచీ ఆయ‌న దానిపైనే ఆధార‌ప‌డుతూ వ‌చ్చారు. రాష్ట్రం ఏర్ప‌డ్డాక కూడా ప‌రిపాల‌న‌లో సెంటిమెంట్ కే పెద్ద పీట వేస్తూ వ‌స్తున్నారు. పండుగలూ ప‌బ్బాల పేరుతో భారీ ఎత్తున ప్ర‌భుత్వ నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌డం, హ‌డావుడి చేయ‌డం అల‌వాటుగా చేశారు. సంస్కృతి ప‌రిర‌క్ష‌ణ పేరుతో గొప్ప‌ల‌కు పోతున్నారు. ఇలా చెయ్యొద్ద‌ని ఎవ్వ‌రూ చెప్ప‌రు! కానీ, దానికి కొన్ని ప‌రిమితులు ఉండాలి క‌దా! ప్ర‌జ‌ల న‌మ్మ‌కాల‌తో ముడిప‌డి ఉన్న పండుగ‌ల విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు లేక‌పోతే.. ఇదిగో ఇలానే బెడిసికొట్టే అవ‌కాశం ఉంటుంది. బ‌తుక‌మ్మ పండుగ‌ను తెలంగాణ ప్ర‌జ‌లు అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకుంటార‌నే విష‌యం తెలిసిందే. పేద‌, ధ‌నిక అనే తేడా లేకుండా ఈ పండుగ‌ను అంద‌రూ వైభ‌వంగానే చేసుకుంటారు. అయితే, ఈ పండుగ పూట తెలంగాణ ఆడ‌ప‌డుచుల‌కు చీర‌ల ఇస్తామంటూ కేసీఆర్ స‌ర్కారు త‌యారైంది. అది కూడా తెలంగాణ ప్రాంతంలోని నేత కార్మికులు నేసిన చీర‌లే ఇస్తామ‌ని గొప్ప‌గా ప్ర‌క‌టించారు. దీంతో గద్వాల‌, సిరిసిల్ల నేత చీర‌లు ప్ర‌భుత్వం పంచ‌బోతోందంటూ ఊద‌రగొట్టారు. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు కూడా అలానే ఉన్నాయి! కానీ, ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చేస‌రికి ప‌రిస్థితి మ‌రోలా మారిపోయింది.

ప్ర‌భుత్వం ఇస్తున్న చీర‌లు ప‌ర‌మ నాసిర‌కంగా ఉన్నాయంటూ రాష్ట్రంలో చాలాచోట్ల మ‌హిళ‌లు రోడ్డెక్కారు. కొంత‌మంది అయితే… చీర‌లకి నిప్పు పెట్టారు కూడా! క‌నీసం రూ. 100 విలువ లేని చీర‌లు ఇచ్చి పండుగ చేసుకోమ‌ని చెప్ప‌డం అవ‌మానించ‌డ‌మే అవుతుంద‌ని ప‌లువురు మండిప‌డుతున్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మ‌హిళ‌లు ఈ చీర‌ల పంపిణీపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. జ‌న‌గామ‌, జ‌గిత్యాల‌, నంది మేడారం, పెద్ద‌ప‌ల్లి, భువ‌న‌గిరి, ఖ‌మ్మం, ప‌ర‌కాల‌.. ఇలా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మ‌హిళ‌లు రోడ్ల మీదికి వ‌చ్చి, ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అందించిన చీర‌ల్ని విసిరికొట్టారు. కొన్ని చోట్ల నిప్పులు పెట్టి మ‌రీ త‌గుల‌బెట్టారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చేస్తున్నాయి. రూ. 100 కూడా విలువ చేయ‌ని చీర‌ల కోసం రూ. 300 కూలీ వ‌దులుకుని మోస‌పోయామంటూ మ‌హిళా లోకం విమ‌ర్శ‌ల‌కు దిగుతోంది. అంతేకాదు, ముఖ్య‌మంత్రి కుమార్తె, నిజామాబాద్ ఎంపీ క‌విత ఇలాంటి చీర‌లు క‌ట్టుకుంటారా అంటూ కొంత‌మంది నేరుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠ‌ను ఎంతో పెంచుతుంద‌ని అనుకున్న ఈ కార్య‌క్ర‌మం లెక్క ఎక్క‌డ త‌ప్పిందంటే.. స‌రైన అజ‌మాయిషీ లేక‌పోవ‌డ‌మే! ప్ర‌భుత్వం చీర‌లు ఇచ్చేస్తుంద‌ని హ‌డావుడిగా ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చేశారు. తెలంగాణ నేత‌న్న‌లే వాటిని నేస్తార‌నీ, త‌ద్వారా వారికి ఉపాధి క‌లుగుతుంద‌నీ ప్ర‌భుత్వం చెప్పింది. అంత‌వ‌ర‌కూ ఉద్దేశం బాగానే ఉంది. కానీ, వాస్త‌వంలో కావాల్సిన చీర‌లెన్ని..? వాటిని అనుకున్న స‌మ‌యంలో త‌యారు చేసే సామ‌ర్థ్యం మ‌న చేనేత కార్మికుల ద‌గ్గ‌ర ఉందా అనే లెక్క‌లు వేయ‌డంలో ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌లం చెందింది. పండుగ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస్తూ ఉండ‌టంతో హ‌డావుడిగా టెండ‌ర్లు పిలిచి, సూర‌త్ సూలెగావ్ ప్రాంతాల నుంచి చీర‌ల్ని దిగుమ‌తి చేసుకున్నారు. ‘తెలంగాణ ఆడ‌ప‌డుచుల‌కు బ‌తుక‌మ్మ కానుక’ అంటూ క‌వ‌ర్లు త‌యారు చేయించి చీర‌ల్ని పంపిణీకి పంపేశారు. అయితే, ఈ క్ర‌మంలో ఎలాంటి నాణ్య‌త గ‌ల చీర‌లు వ‌చ్చేయ‌నేది మాత్రం ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌, ఈ విష‌యాన్ని ప్ర‌తిప‌క్షాలు అందుకున్నాయి. ఈ కానుక‌ల వెన‌క పెద్ద కుంభ‌కోణం ఉందంటూ ఆరోప‌ణ‌లు మొద‌లుపెట్టేస్తున్నాయి.

ఏదేమైనా, బ‌తుక‌మ్మ కానుక‌ల విష‌యంలో ప్ర‌భుత్వం అల‌స‌త్వం బ‌య‌ట‌ప‌డింద‌న్న‌ది నిర్వివాదాంశం. మ‌హిళ‌కు ఎంతో ఇష్ట‌మైన చీర‌ల్ని సైతం వారు రోడ్డు మీద ప‌డేస్తున్నారు, కాల్చేస్తున్నారంటే ఆ నాణ్యత ఏపాటితో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రి, ఈ అసంతృప్తిని త‌గ్గించేందుకు కేసీఆర్ స‌ర్కారు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌డుతుందో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com