తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. టి.టి.వి దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీ, బీజేపీ-ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏలో అధికారికంగా చేరింది. బుధవారం చెన్నైలో బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో దినకరన్ భేటీ అయి తన మద్దతును ప్రకటించారు. గతంలో ఉన్న భేదాభిప్రాయాలను పక్కనపెట్టి, రాష్ట్ర సంక్షేమం, జయలలిత పాలనను మళ్ళీ తీసుకురావడమే లక్ష్యంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు దినకరన్ వెల్లడించారు.
ఈ కూటమిలో ఇప్పటికే ఏఐఏడీఎంకే, బీజేపీతో పాటు పీఎంకే , ఐజేకే వంటి పార్టీలు ఉన్నాయి. తాజాగా విజయ్ కాంత్ స్థాపించిన డీఎండీకే కూడా ఎన్డీయే గూటికి చేరే అవకాశం ఉందనే వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకవేళ ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే కూడా చేరితే, కూటమి మరింత శక్తివంతంగా మారుతుందని భావిస్తున్నారు. జనవరి 23న చెంగల్పట్టు జిల్లా మదురాంతకం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోయే భారీ బహిరంగ సభకు ఎన్డీయే నేతలందరూ హాజరుకానున్నారు.
ఈ సభ ద్వారా కూటమి తన బలాన్ని ప్రదర్శించాలని యోచిస్తోంది. 2026 ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమిని ఎదుర్కోవడానికి ఎన్డీయే తన వ్యూహాలకు పదును పెడుతోంది. దినకరన్ రాకతో ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో కూటమికి ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయ్ను కూడా ఎన్డీఏలో చేర్చుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
