టీవీల్లో రచ్చహః రచ్చస్య… రచ్చోభ్యహ!

సన్నివేశం 1:
రెండు రోజుల నుంచి ఈటీవీ న్యూస్ చూస్తున్నాన్రా. ప్రశాంతంగా వార్తలు చదువుతున్నారు. మిగతా ఛానల్స్ చూడాలంటే భయం వేస్తుంద్రా బాబూ… హైదరాబాద్‌లోని ఒక పార్కులో జాగింగ్ చేస్తున్న పెద్దాయన ఫ్రెండ్‌తో అంటున్నాడు. బదులుగా అతడు ‘నిజమేరా… చానళ్ళలో రోత పుట్టిస్తున్నారు’ అన్నాడు!


సన్నివేశం 2:
మన దేశంలో సెలబ్రిటీగా పుట్టకూడదు. ఒకవేళ పుట్టినా చావకూడదు. చచ్చినా టీఆర్పీలకు పనికి వచ్చేలా చావకూడదు… టీవీలో వార్తలపై మండిన ఒక నెటిజన్ ట్వీట్


సన్నివేశం3:
ఒక వాట్సాప్ గూఫులో ‘టీవీల్లో శ్రీదేవి మృతిపై చూపిస్తున్న వార్తలు చిరాకు పుట్టిస్తున్నాయ్’ అని ఒకరు అంటే… మరొకరు ‘మీడియా అంతా అలాగే తగలడింది. సొల్లు చెబుతున్నారు’ అని ఇంకొకరు కామెంట్ చేశారు.

శ్రీదేవి మరణంపై జనాల్లో బోలెడు సందేశాలున్నాయ్. కేసు పూటకో కొత్త మలుపు తిరుగుతోంది. అవేంటో తెలుసుకోవాలని ప్రజల్లో ఆసక్తి వుంది. కానీ, తెలుగు టీవీ ఛానళ్ళలో చూపిస్తున్న వార్తలు ప్రజలకు రోత పుట్టిస్తున్నాయి.

దుబాయ్‌ ప్రాసిక్యూషన్‌ వ్యవస్థ గల్ఫ్‌ దేశాలు అన్నిటిలోకెల్లా శక్తివంతమైనది. సాక్షాత్ దుబాయ్ రాజు వచ్చి అడిగినా అధికారులు ఏం చెప్పారు. రాజు కూడా విచారణలో వున్న కేసు అంశాల్లో జోక్యం చేసుకోలేరు కూడా. అక్కడి చట్టాల ప్రకారం… విచారణ జరుగుతున్నప్పుడు సదరు కేసులో అంశాలను అధికారులు గానీ, దౌత్యవేత్తలు గానీ కనీసం మీడియాకు వెల్లడించడానికి కూడా వీలు లేదు. అటువంటిది విచారణలో అంశాలు మన టీవీ ఛానళ్ళ చేతికి ఎలా చిక్కాయో అర్థం కావడం లేదు. దుబాయ్ మీడియా పేరుతో వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాయి. వీటికి తోడు క్రియేటివిటీ కట్టలు తెచ్చుకుంది. శ్రీదేవి బాత్‌రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? బాత్‌ట‌బ్‌లోఎలా పడింది? అనేవి చూపిస్తున్నారు. అదేదో వీళ్ళు శ్రీదేవికి తోడుగా ఆమె పక్కనే వుండి అన్నీ చూసినట్టు. శ్రీదేవి మద్యం తీసుకున్నారని వార్త బయటకు పొక్కిందో లేదో సింబాలిక్‌గా స్రీన్ మీద ఒక వైన్ గ్లాస్ డిజైన్ చేశారు. సినిమా దర్శకులు కూడా మన టీవీ ఛానళ్ళ క్రియేటివిటీ ముందు దిగదుడుపే అంటే నమ్మండి. పక్క ఛానల్ కంటే ముందు మనమే ప్రజలను ఆకట్టుకోవాలనే తాపత్రయంలో అత్యుత్సాహంలో అదే ప్రజల నుంచి వ్యక్తమవుతున్న విమర్శలను పట్టించుకోవడం లేదు.

పెరుగుట విరుగుట కొరకే అని ఒక సామెత. మన తెలుగు టీవీల్లో విపరీతంగా పెరిగిన క్రియేటివిటీ ఎప్పటికి విరుగుతుందో?!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]