అర్జున్ రెడ్డి Vs టీవీ 9

ఏ టాపిక్ నైనా హాట్‌గా మార్చేయ‌డంలో టీవీ 9 ముందుంటుంది. ప‌వ‌న్ ఫ్యాన్స్ – మ‌హేష్ క‌త్తి మ‌ధ్య వివాదం చినికి చినికి గాలివాన‌గా మారిందంటే… దానికి టీవీ 9 ఎఫెక్టే కార‌ణం. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ వార్త‌ల కోసం ఎగ‌బ‌డే ఆ ఛాన‌ల్‌కి లేటెస్టుగా అర్జున్ రెడ్డి సినిమా క‌నిపించింది. వీహెచ్ ఆ సినిమాకి సంబంధించిన పోస్ట‌ర్ల‌ను చించేసిన ద‌గ్గ‌ర్నుంచీ ఈ సినిమాపై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టింది టీవీ 9. రోజుకి క‌నీసం రెండు గంట‌లైనా ఈ సినిమా కోసం కేటాయిస్తోంది. చిత్ర‌బృందాన్ని ఇంట‌ర్వ్యూల‌కు పిలుస్తోంది. చ‌ర్చా వేదిక‌లు పెడుతోంది. అన్ని చోట్లా ఈ సినిమాలోని బూతుని ఎత్తి చూపిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కూ.. టీవీ 9కీ మ‌ధ్య జ‌రిగిన ఇంట‌ర్వ్యూ మాత్రం ఈ ప్రోసెస్‌లో హైలెట్ అయిపోయింది. టీవీ 9 అడుగుతున్న తిక్క ప్ర‌శ్న‌ల‌కు అదే రీతిలో తిక్క తిక్క‌గా స‌మాధానాలు ఇచ్చాడు విజ‌య్‌. అవ‌న్నీ విజ‌య్ ఫ్యాన్స్ ట్రోల్ చేసుకొంటూ ఖుషీ అయిపోతున్నారు.

అర్జున్ రెడ్డి సినిమాని వీలైనంత వ‌ర‌కూ బూతు సినిమాగా ప్ర‌మోట్ చేయాల‌న్న టీవీ 9 ప్ర‌య‌త్నాలేం ఫ‌లించ‌లేదు. అస‌లు టీవీ 9 ఎంచుకొన్న ప్ర‌శ్న‌లు.. అడిగే విధానం ఎవ్వ‌రికైనా ఇరిటేటింగ్‌గానే అనిపిస్తాయి. ‘మేం విమ‌ర్శిస్తున్న సినిమాకి ఇన్ని వ‌సూళ్లా’ అనే ఉడుకుమోతుత‌నం త‌ప్ప నిజ‌మైన జ‌ర్న‌లిజం విలువ‌లు ఆయా కార్య‌క్ర‌మాల్లో క‌నిపించ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. ఈ విష‌యంలో మిగిలిన మీడియా కాస్త విమ‌ర్శ‌నాత్మ‌కంగానే ఆలోచిస్తోంది. అర్జున్ రెడ్డిని ఎక్క‌డ తిట్టాలో, ఎక్క‌డ పొగ‌డాలో విచ‌క్ష‌ణ ఎరిగి మ‌సులుకొంటోంది. చిత్ర‌బృందం కూడా ఎవ‌రు ఇంట‌ర్వ్యూల‌కు పిలిచినా టంచ‌నుగా వెళ్లిపోతోంది. ఓపిగ్గా స‌మాధానాలు చెబుతోంది. వాళ్ల‌కు తెలుసు… ఎవ‌రెన్ని తిట్టినా అది త‌మ సినిమాకి మైలేజీగానే ప‌నికొస్తుంద‌ని. ఆ విధంగా అర్జున్ రెడ్డి వ‌సూళ్ల‌కు ప‌రోక్షంగా టీవీ 9 కూడా స‌హాయం చేస్తోంద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.