తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరంలో నామినేషన్ల ఘట్టం ముగుస్తోంది. అందరి కళ్లు వెతుకుతున్న ఒకే ఒక్క పేరు విజయ్. భారీ అంచనాలతో, లక్షలాది మంది అభిమానుల కోలాహలంతో తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించిన విజయ్, ఇప్పుడు ఎన్నికల క్షేత్రంలో ఎక్కడున్నారు.. ఆయన మునుపటి ఊపు ఏమైంది అన్న ప్రశ్నలు తమిళ మీడియాలో మిన్నంటుతున్నాయి. కానీ నామినేషన్ల ప్రక్రియ కీలక దశకు చేరినా విజయ్ ప్రచార శైలిలో ఆశించిన వేగం కనిపించడం లేదు.
మూడో శక్తిగా ఎదగలేకపోతున్న విజయ్
తమిళనాడులోని ప్రముఖ సర్వే సంస్థలు రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం, విజయ్ పార్టీ ప్రస్తుతానికి ఒక బలమైన థర్డ్ ఫోర్స్ గా ఎదిగే సూచనలు కనిపించడం లేదు. అధికారం కోసం పోటీ పడుతున్న ద్రావిడ దిగ్గజాలు DMK, ADMK కూటముల మధ్య విజయ్ ఓట్లను చీల్చగలరా? అన్నది ఇప్పుడు పెద్ద సందేహంగా మారింది. తాజా సర్వేలు విజయ్ పార్టీ పది లోపు అసెంబ్లీ స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని తేల్చి చెబుతున్నాయి. అంటే, కేవలం అభిమాన గణం ఓట్లుగా మారుతాయన్న నమ్మకం కలగడం లేదని, రాజకీయ వ్యూహకర్తగా ఆయన ఇంకా పుంజుకోవాల్సి ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఉన్నది ఫ్యాన్సే క్యాడర్ కాదు !
విజయ్ పార్టీలో స్పష్టమైన క్యాడర్ నిర్మాణం లేకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది. కేవలం సినిమా ఇమేజ్ మీద ఆధారపడి ఎన్నికలకు వెళ్లడం ద్రావిడ గడ్డపై అంత సులభం కాదని గతంలో కమల్ హాసన్ వంటి వారి విషయంలో రుజువైంది. విజయ్ తన ప్రసంగాల్లో సిద్ధాంతపరమైన స్పష్టతనిచ్చినప్పటికీ, అభ్యర్థుల ఎంపికలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని నడపడంలోనూ తడబడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అందుకే, ఎన్నికలకు ముందున్న ఆ హైప్ ఇప్పుడు గ్రౌండ్ లెవల్లో ఓట్లుగా మారే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.
పొత్తులు లేకపోవడమే వ్యూహాత్మక తప్పిదం!
ప్రత్యర్థి పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార హోరును పెంచుతుంటే, విజయ్ ఇంకా తన పూర్తి స్థాయి దూకుడును ప్రదర్శించకపోవడం ఆయన అభిమానులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఎన్నికలు విజయ్ రాజకీయ భవిష్యత్తుకు అగ్నిపరీక్ష వంటివి. పొత్తులు లేకపోవడం ఓ కొత్త పార్టీ బలంగా తన ముద్ర వేసే ప్రయత్నం చేయడానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చివరి నిమిషంలో ఏవైనా సంచలన మార్పులు చేసి సర్వేల అంచనాలను తారుమారు చేస్తారో లేదో చూడాలి.
