హోదా మీద జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు స‌రైన‌వి కాదు!

ప్ర‌త్యేక హోదా సాధ‌న విష‌య‌మై ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌తో తాను విభేదిస్తున్నా అన్నారు మాజీ పార్ల‌మెంటు స‌భ్యుడు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్. రాజ‌మండ్రిలో ఆయ‌న మాట్లాడుతూ… కేంద్ర ప్ర‌భుత్వానికి త‌న మ‌ద్ద‌తు అవ‌స‌రం లేదు కాబ‌ట్టి, ఢిల్లీకి వెళ్లిన ప్ర‌తీసారీ ప్ర‌త్యేక హోదా గురించి అడుగుతూనే ఉంటాన‌ని జ‌గ‌న్ అన‌డం స‌రికాద‌న్నారు. ప్ర‌తీసారీ ప్ర‌ధానిని అడిగి తెచ్చుకోవాల్సిన ప‌నిలేద‌నీ, ప్ర‌త్యేక హోదా అనేది విభ‌జ‌న చ‌ట్టంలోనే ఉంద‌నీ, దాన్ని ఇచ్చి తీరాల్సిందేన‌న్నారు. కేంద్రంలో న‌రేంద్ర మోడీ స‌ర్కారు రావ‌డం వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు ఇష్టం లేద‌న్నారు. స‌మీప భ‌విష్య‌త్తులో వైకాపాలో చేరే ఆలోచ‌న కూడా త‌న‌కు లేద‌ని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో అవినీతి లేకుండా చేస్తాన‌ని జ‌గ‌న్ అన‌డం మంచిదే అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి డ‌బ్బులు పంచితే ఓడిపోతామ‌నే స్థాయిలో సొంత పార్టీ నాయ‌కులు అనుకునే విధంగా చేయాల‌ని సూచించారు. జ‌గ‌న్ కు ఇంత భారీ మెజారిటీ వ‌చ్చింది కేవ‌లం చంద్ర‌బాబు మీద వ్య‌తిరేక‌త‌తో కాద‌నీ, ఆయ‌న ఏదో చేస్తార‌ని ప్ర‌జ‌లు న‌మ్మార‌న్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఏ చిన్న త‌ప్పు జ‌రిగినా ప్ర‌జ‌లు దాన్ని పెద్ద‌గానే చూస్తార‌ని గుర్తుంచుకోవాల‌న్నారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో లంచం అనే మాట లేకుండా చెయ్యాల‌నీ, ప‌క్క రాష్ట్రం కేర‌ళ అనుస‌రిస్తున్న విధానాల‌ను అధ్య‌య‌నం చేయాలన్నారు.

నిజానికి, ప్ర‌త్యేక హోదా సాధ‌న విష‌య‌మై ఒక్క‌రోజులో జ‌గ‌న్ మాట మార్చేశారు అనే చ‌ర్చ మొద‌లైంది. గ‌తంలో… ఎన్డీయేలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీకి బ‌య‌ట‌కి వ‌చ్చేయ‌మ‌నీ, కేంద్రంపై పోరాటం చేయాల‌ని విమ‌ర్శ‌లు చేశారు జ‌గ‌న్. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ ఏమంటున్నారు… ప్ర‌ధానిని సార్ సార్ అంటూ బ‌తిమాలుతా అన్న‌ట్టు మాట్లాడుతున్నారు. ఈ ప‌రిస్థితి ఎందుకంటే మోడీకి ఫుల్ మెజారిటీ వ‌చ్చేసింది క‌దా, మ‌న అవ‌స‌రం ఏముంద‌ని అంటున్నారు. మ‌రి, గ‌తంలో ఇదే మోడీ ప్ర‌భుత్వంపై… ప్ర‌త్యేక హోదా కోసం వైకాపా అవిశ్వాస తీర్మానం పెట్టింది క‌దా. అప్పుడు కూడా మోడీకి పార్ల‌మెంటులో ఫుల్ మెజారిటీ ఉందే! వైకాపా అవిశ్వాస తీర్మానం పెట్టినంత మాత్ర‌న ప్ర‌భుత్వం ప‌డిపోయే ప‌రిస్థితి లేదే..! హోదా కోసం పోరాడాల‌ని టీడీపీకి చెప్పి, పోరాడి సాధిస్తామ‌ని ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌కు చెప్పి… ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం ముందు సాగిల‌ప‌డ‌తామ‌ని ఒక ముఖ్య‌మంత్రి అంటుంటే ఎలా..? ఢిల్లీ ముందు మోక‌రిల్లుతా అనే సంకేతాలిస్తే… తెలుగువారి ఆత్మ‌గౌర‌వం ఏది..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com