రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పుడూ కొత్త పదాలు, వినూత్నమైన కాన్సెప్టులు పుట్టుకొస్తూనే ఉంటాయి. సాధారణంగా మనకు అపార్ట్మెంట్ అంటే బాగా తెలుసు. కానీ, ఇటీవల మార్కెట్లోకి ఉపార్ట్మెంట్ అనే కొత్త పదం వినిపిస్తోంది. ఇది కేవలం స్పెల్లింగ్ మార్పు మాత్రమే కాదు, నివాస శైలిలో వస్తున్న ఒక సరికొత్త మార్పు.
సాధారణ అపార్ట్మెంట్లకు అపడేటెడ్ వెర్షన్‌గా ఈ ఉపార్ట్మెంట్ లను బిల్డర్లు ప్రమోట్ చేస్తున్నారు. ప్రధానంగా నగరాల్లోని యువ ప్రొఫెషనల్స్, చిన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వీటిని నిర్మిస్తున్నారు. U అంటే Upgraded అని అర్థం వచ్చేలా దీనికి నామకరణం చేశారు. సాధారణ అపార్ట్మెంట్లలో ఉండే రొటీన్ సౌకర్యాల కంటే మిన్నగా, హోటల్ తరహా లగ్జరీని, స్మార్ట్ హోమ్ ఫీచర్లను కలిపి అందించడమే ఈ కాన్సెప్ట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం.
ఈ ఉపార్ట్మెంట్లు ప్రధానంగా ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో ఉంటాయి. అంటే, మీరు కేవలం మీ బట్టల సర్దుకుని వెళ్తే సరిపోయేలా పూర్తిస్థాయిలో ఫర్నిచర్, మోడ్యులర్ కిచెన్, అత్యాధునిక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో ఇవి సిద్ధంగా ఉంటాయి. అంతేకాకుండా, వీటిలో సెంట్రలైజ్డ్ ఏసీ, వాయిస్ కమాండ్‌తో పనిచేసే లైట్లు, ఫ్యాన్లు వంటి స్మార్ట్ హోమ్ టెక్నాలజీని అమరుస్తున్నారు. చాలా చోట్ల కామన్ వర్క్ స్పేస్ , మినీ జిమ్, లాండ్రీ సర్వీసులను కూడా బిల్డర్లు ఈ భవనాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ట్రెండ్ బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి మెట్రో నగరాల్లో వేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా స్టార్టప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు, మోడ్రన్ బిల్డర్లు ఈ ఉపార్ట్మెంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అపార్ట్మెంట్లతో పోలిస్తే ఉపార్ట్మెంట్ల ధర కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, వీటికి అద్దె డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటోంది. ఇంటి నిర్వహణ బాధ్యతను చాలా వరకు బిల్డర్లే చూసుకోవడం దీనిలోని మరో ప్రధాన ఆకర్షణ.
