మ‌హాన‌టిలో చీక‌టి కోణాలెన్ని

బ‌యోపిక్ అంటే.. గొప్ప‌లు, విజ‌యాలు, కీర్తి ప్ర‌తిష్ట‌లు చూపించ‌డాలూ మాత్ర‌మే కాదు. చీక‌టి కోణాల‌ను, లోపాల‌ను కూడా బ‌హిర్గ‌తం చేయాలి. ఓ వ్య‌క్తిని 360 కోణాల్లోనూ ఆవిష్క‌రించాలి. అలాంటి ప్ర‌య‌త్నాలు.. బాలీవుడ్‌లో బాగా జ‌రుగుతాయి. అందుకే హిందీలో తెర‌కెక్కించిన బ‌యోపిక్‌లు అంత‌టి ముద్ర వేయ‌గ‌లిగాయి. తెలుగులో బ‌యోపిక్‌ల ప‌రంప‌ర మొద‌లైంది. సావిత్రి క‌థ మ‌హాన‌టిగా రూపుదిద్దుకోబోతోంది. సావిత్రి గొప్ప న‌టి. ఇప్ప‌టికీ తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో ఆమె స్థానం ప‌దిలం, సుస్థిరం. అయితే ఆమె క‌థ‌లో చీక‌టి కోణాలూ ఉన్నాయి. బ‌హుశా చాలా మంది సావిత్రి అభిమానులు కూడా జీర్ణించుకోలేన‌న్ని పచ్చి నిజాలు ఆమె క‌థ‌లో కోకొల్ల‌లుగా క‌నిపిస్తాయి. మ‌హాన‌టి సినిమాలో వాట‌న్నింటినీ ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

సావిత్రి క‌థ ఎక్క‌డి నుంచి మొద‌లెట్టి.. ఎక్క‌డి వ‌ర‌కూ చూపించ‌బోతున్నార‌న్న‌ది మ‌హాన‌టిలో కీల‌క‌మైన అంశం. సావిత్రి నాన్న మ‌ర‌ణంతో ఈ క‌థ మొద‌లు కాబోతోంది. కొంత‌కాలం సావిత్రి పెద‌నాన్న సంర‌క్ష‌ణ‌లో ఉంది. అవి కూడా మ‌హాన‌టిలో చూపించ‌బోతున్నార‌ని తెలిసింది. అక్క‌డి నుంచి.. సావిత్రి మ‌ర‌ణం వ‌ర‌కూ… ప్ర‌తీ ఘ‌ట్టాన్నీ, ఆమె న‌టించిన కొన్ని హిట్ చిత్రాల నేప‌థ్యంలో చూపించ‌బోతున్నారు. సావిత్రి ఆల్క‌హాల్‌కి బానిస అయ్యింది. ఆమె చివ‌రి జీవితం చాలా దుర్భ‌రం. ఆ స‌న్నివేశాలు, సంఘ‌ట‌న‌లు కూడా ఈ క‌థ‌లో ప్ర‌ముఖంగా క‌నిపించ‌బోతున్నాయి. అయితే ఈ క‌థ మొత్తం స‌మంత పాయింట్ ఆఫ్ వ్యూలోనే సాగ‌బోతోంది. మ‌ర‌ణ‌పు అంచున ఉన్న ఓ మ‌హాన‌టిని ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి స‌మంత వెళ్తుంది. అక్క‌డి నుంచి క‌థ మొద‌ల‌వుతుంది. ఓసారి సావిత్రి ఇంటిపై ఇన్ కమ్ టాక్స్ దాడులు జ‌రిగాయి. సావిత్రి ఇంట్లో విలువైన వ‌స్తువుల్ని సీజ్ చేశారు. ఆ స‌మ‌యంలో సావిత్రి ఇంట్లోనే ఉంది. అక్క‌డ చోటు చేసుకున్న స‌న్నివేశాల్ని కూడా క‌థ‌లో చూపించార్ట‌. మొత్తానికి ఓ బ‌యోపిక్‌ని ఎలా తీయాలో.. అలానే తీశార‌ని, మంచి చెడు రెండింటినీ చూపించార‌ని అర్థ‌మ‌వుతోంది. మరి ఆ మేళ‌వింపు ఏ ర‌కంగా సాగిందో తెలియాలంటే ఇంకొన్ని గంట‌లు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com