ఈవారం విడుదలవుతున్న సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉంది. దాంతో పాటు ‘దురంధర్ 2’ పోటీలో ఉన్నా, ఉస్తాద్ తెలుగు సినిమా కాబట్టి, దాని ప్రత్యేకత దానిదే.
ఈ సినిమాపై పవన్ కల్యాణ్ అభిమానులు చాలానే ఆశలు పెట్టుకొన్నారు. ‘ఓజీ’ తరవాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇది. ‘ఓజీ’ ఇచ్చిన జోష్.. ఈ సినిమాలోనూ కనిపిస్తుందని అందరి నమ్మకం. పవన్ భక్తుడు హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. పవన్ ని ఎలా చూపించాలో ఆయనకు బాగా తెలుసు. ‘గబ్బర్ సింగ్’ తో పవన్ అభిమానులకు ఓ కల్ట్ ఫిల్మ్ ఇచ్చాడు హరీష్. దాంతో ‘ఉస్తాద్’ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
అయితే ఈ సినిమా ముగ్గురి కెరీర్లను డిసైడ్ చేయబోతోంది. ఒకటి దర్శకుడిగా హరీష్ శంకర్‌కు చాలా చాలా కీలకమైన సినిమా. ‘గబ్బర్ సింగ్’ తరవాత హరీష్ కు ఆ రేంజ్ హిట్ లేదు. పైగా ఈమధ్య చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. `మిస్టర్ బచ్చన్` అయితే భారీ డిజాస్టర్. అందులోంచి కోలుకోవాలన్న, పెద్ద హీరోల దృష్టి హరీష్ పై పడాలన్నా ఈ సినిమాతో హిట్టు కొట్టడం కంపల్సరీ.
ఇక శ్రీలీల కెరీర్ డోలాయమాన పరిస్థితుల్లో ఉంది. ‘పెళ్లి సందడి’తో ఒక్కసారిగా స్టార్ అయిపోయిన శ్రీలీల గంపెడు కొద్దీ సినిమాలు చేసింది కానీ, అందులో ఆడినవి అంతంత మాత్రమే. పైగా శ్రీలీల ఉంటే సినిమా ఫ్లాప్ అవుతుందన్న అపప్రద మూటగట్టుకొంది. శ్రీలీల లాంటి కథానాయికకు పవన్ కల్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ రావడం నిజంగా లక్ ఫ్యాక్టరే. ఆ లక్ ని నిలబెట్టుకోవాలన్నా ఈ సినిమాతో తాను హిట్ కొట్టాలి.
రాశీఖన్నా కెరీర్ కూడా శ్రీలీల కెరీర్లానే తయారైంది. తనకు కూడా హిట్లు లేవు. పెద్ద హీరోలు రాశీఖన్నా వైపు చూడడమే లేదు. టైర్ 2 హీరోలైనా ఆమెను పట్టించుకోవాలంటే ఓ మంచి హిట్ పడాలి. అది…’ఉస్తాద్’తోనే అవ్వాలి. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లకు కూడా మంచి పాత్రలు పడడం చాలా కష్టం. పడితే మాత్రం ఆ గుర్తింపు వేరే రేంజ్ లో ఉంటుంది. ‘గబ్బర్ సింగ్’ లో శ్రుతిహాసన్ పాత్ర అంతగా గుర్తుండదు. కానీ ఆ మైలేజీతో మరిన్ని సినిమాలు తన బుట్టలో వేసుకొంది శ్రుతి. ఇప్పుడు శ్రీలీల, రాశీఖన్నాలు కూడా అదే నమ్మకంతో ఉన్నారు.


