యశ్ ‘టాక్సిక్’ సినిమా వాయిదా పడింది. మార్చి 19న విడుదల చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో జూన్ 4కి వాయిదా వేశారు. ఇప్పుడు ‘టాక్సిక్’ తప్పుకోవడంతో అదే తేదీకి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఒక వారం ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే సినిమా పనుల్లో ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇప్పటివరకు ట్రైలర్ విడుదల కాలేదు. ఇంకా రెండు పాటలు విడుదల కావాలి. ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా చేయాల్సి ఉంది. అంతేకాదు, పవన్ కళ్యాణ్ ఇంకా తన డబ్బింగ్ పూర్తి చేయలేదు. దానికి మరో రెండు రోజులు పడుతుందని తెలుస్తోంది.
నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటికే ఒకసారి ముందుకు వచ్చింది. ‘పెద్ది’ సినిమా వాయిదా పడటంతో ఆ డేట్‌కి తీసుకొచ్చారు. అప్పటికే పనులు చాలా వేగంగా జరగాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ మరో వారం ముందుకు అంటే సాధ్యమవుతుందా లేదా అన్న విషయంలో నిర్మాతలు ఆలోచిస్తున్నారు.
ఒకవేళ మార్చి 19నే రిలీజ్ అనుకుంటే ముందుగానే అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించాలి. ఒకసారి రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత మళ్లీ వాయిదా వేయడం కుదరదు. ఈ స్పీడ్ అందుకోవడానికే దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్‌ను తీసుకొచ్చారు. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వేగంగా పూర్తి చేస్తాడనే పేరుంది. ఆర్ఆర్ పూర్తైతే సినిమా దాదాపు పూర్తి అయినట్టే.
కాకపోతే పనులను యుద్ధప్రాతిపదికన చేయాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మార్చి 19న రిలీజ్ చేయడం మంచిదా? లేక ఒక వారం ఆగి ప్రశాంతంగా మార్చి 26న విడుదల చేయడం బెటరా? అన్న విషయంలో నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
