రివ్యూ : వారసుడు

Vaarasudu Movie Telugu Review

తెలుగు360 రేటింగ్ : 2.25/5

‘వారసుడు’ నిర్మాత దిల్ రాజుకు పెద్ద రిస్క్ తో కూడిన ప్రాజెక్ట్ అయికూర్చుంది. తమిళస్టార్ విజయ్ తో సినిమా చేసి రెండు భాషల్లో గ్రాండ్ గా పండక్కి విడుదల చేసి తెలుగు ఓపెనింగ్స్ తో బయటపడా లనేది దిల్ రాజు ప్లాన్. అయితే ఈ ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు. తెలుగు పెద్ద హీరోలకి దారి ఇవ్వాల్సిన తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే వారిసు విడుదలైన మూడు రోజుల తర్వాత వారసుడుని తీసుకురావాల్సి వచ్చింది. వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య ఆల్రెడీ థియేటర్లో వున్నాయి. పైగా వారసుడికి రావాల్సిన బజ్ రాలేదు. సరిగ్గా ప్రమోషన్స్ జరగలేదు. ట్రైలర్ కూడా ప్రభావం చూపలేదు. అయితే ‘ వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య పక్కా మాస్ సినిమాలు. మాది కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. సంక్రాంతి అంటే ఫ్యామిలీ సినిమా’ఇదీ దిల్ రాజు నమ్మకం. మరి దిల్ రాజు నమ్మకం నిజమైయిందా ? వారసుడిలో ఫ్యామిలీ ఆకట్టుకునే అంశాలు ఏమిటి ? సంక్రాంతి బరిలో వారసుడు ఎంత బలంగా నిలబడతాడు ?

పర్వతనేని రాజేంద్ర ( శరత్ కుమార్) బిజినెస్ టైకూన్. రాజేంద్ర భార్య సుధ (జయసుధ). వీరికి ముగ్గురు కొడుకులు. జై (శ్రీకాంత్‌), అజయ్‌ (శ్యామ్‌), విజయ్‌ (విజయ్‌). అయితే రాజేంద్రది బొమ్మరిల్లు ఫాదర్ టైపు క్యారెక్టర్. పిల్లల మనసులో ఏముందో తెలుసుకోడు. తనకి నచ్చిందే పిల్లలకి కూడా నచ్చుతుందని భావిస్తుంటాడు. తనకి ప్రతిది ఒక పోటీనే. చివరికి తనకు కాబోయే వారసుడుని ఎన్నుకోవడంలో కూడా ముగ్గురు కొడుకులకు బిజినెస్ రేసు పెడతాడు. అప్పటికే తండ్రి ధోరణితో విసిగెత్తిపోయిన విజయ్.. ”మీ వ్యాపారం వద్దు.. మీరు వద్దు.. నాకు నచ్చింది చేస్తా”అని ఇంటి నుంచివెళ్ళిపోయి ఒక స్టార్ట్ అప్ పెట్టుకుంటాడు . రాజేంద్ర కూడా పట్టుదల వున్న మనిషి. ఇంటి నుంచి వెళ్ళిపోయిన కొడుకు.. అసలు వున్నాడనే సంగతి మర్చిపోతాడు. ఇక మిగిలిన ఇద్దరు కొడుకులు జై, అజయ్‌ తండ్రి కూర్చి కోసమే చూస్తుంటారు తప్పా.. ఫ్యామిలీ అంటే ఎమోషన్ వుండదు. ఇలా ఏడేళ్ళు గడిచిపోతాయి. రాజేంద్ర కి క్యాన్సర్ అని తేలుతుంది. మరో ఎనిమిది నెలలే అని చెప్పేస్తారు డాక్టర్. ఈ సంగతి ఇంట్లో ఎవరికీ చెప్పడు. మరోవైపు రాజేంద్ర సామ్రాజ్యాన్ని లాక్కోవడానికి జయప్రకాశ్‌ (ప్రకాశ్‌రాజ్‌) కుట్రలు పన్నుతుంటాడు. ఈలోగ రాజేంద్ర షష్టిపూర్తి వస్తుంది. మొదట ఈ కారక్రమానికి అంగీకరించిన రాజేంద్ర.. తనకి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత జీవితంలో జరిగే చివరి శుభకార్యని అంగీకారం తెలుపుతాడు. తల్లితండ్రుల షష్టిపూర్తికి మళ్ళీ ఇంటికి వస్తాడు విజయ్. ఇంతలోనే జయప్రకాశ్‌ రూపంలో రాజేంద్ర సామ్ర్యజ్యానికే ముప్పు వస్తుంది. మరి ఈ ముప్పు నుంచి రాజేంద్ర కుటుంబం ఎలా బయటపడింది ? రాజేంద్ర తన వారసుడిగా ఎవరిని ప్రకటించాడు? అసలు రాజేంద్ర కుటుంబంలో వున్న సమస్య ఏమిటి ? రాజేంద్రకి క్యాన్సర్ వున్న సంగతి కుటుంబానికి తెలిసిందా ? ఆ కుటుంబం చివరికి ఎలా ఒక్కటైయింది ? అన్నది మిగతా కథ.

ఒక తండ్రి. ముగ్గురు కొడుకులు. అందులో చిన్నకొడుకు అంటే తండ్రికి గిట్టదు. విచిత్రంగా అతడికే హీరో క్యాలిటీలన్నీ వుంటాయి. చివరికి ఆ చిన్న కొడుకే తండ్రి కష్టాలన్నీ తీర్చి, సంతోషాన్ని ఇస్తాడు. కథకు శుభం కార్డు వేస్తాడు. తెలుగు సినిమా మొదలైనప్పడు పుట్టిన కథ ఇది. దాదాపు కొన్ని వందల సార్లు ఈ కథని అటు ఇటు చేసి ప్రేక్షకుల మీదకు వదిలారు సినీ రూపకర్తలు. ఇప్పుడు దర్శకుడు వంశీపైడి పల్లి, నిర్మాత దిల్ రాజు.. తమిళ నుంచి ఒక స్టార్ హీరోని పట్టుకొచ్చిమరీ పండగ పూట ఈ పాత కథనే మళ్ళీ మరొకసారి జనాల మీదకు వదిలారు. ఈ పాత కథని తయారూ చేయడానికి దాదాపు దర్శకుడితో సహా ఐదుమంది రచయితలు పని చేసినట్లు టైటిల్స్ లో వేశారు. తీరా అందరూ కలసి చేసిన రచన ఏమిటంటే.. ఇప్పటివరకూ వచ్చిన కుటుంబ కథా చిత్రాల డీవీడీలు చూసి అందులో హైలెట్ గా నిలిచిన సీన్లు అన్నీ ఒక్కచోట చేర్చడం.

వారసుడు పాత్రలు, కథ తీర్చిదిద్దిన విధానం ఎలా వుందో ఒకసారి చూద్దాం.. రాజేంద్రకి వ్యాపారం చేయడం ఒక్కటే తెలుసు. ఇద్దరు కొడుకులతో కలసి వ్యాపారం చేస్తుంటాడు కానీ బొమ్మరిల్లు ఫాదర్ లా ఆ కొడుకుల మనసులో ఏముందో తెలుసుకోడు. తల్లి పాత్ర అతి మంచిది. లంకంత కొంపలో తను మాత్రమే వుంటుంది. ఆ ఇంట్లో అందరూ ఎగువతరగతి కంటే లక్షల రెట్ల ఎక్కువ ఎగువ తరగతి మెంటాలిటీతో వుంటారు. కానీ తల్లి పాత్ర మాత్రం.. డైనింగ్ టేబుల్ దగ్గర ఒక సర్వర్ లా నిలబడి.. గంటకో రెండు గంటలకో ఎవరో ఒకరు వస్తే.. ప్రేమగా వడ్డిస్తుంటుంది. ఈ రెండు పాత్రలు కొంచెం నయ్యం . ఇప్పుడు మరో ఇద్దరు కొడుకుల పాత్ర ట్రీట్ మెంట్ చూస్తే బ్లాక్ అండ్ వైట్ టీవీలో సినిమాలు చూస్తున్న రోజులు గుర్తుకు వస్తాయి. ఒక కొడుకు.. ఇంట్లో గుణవతి లావణ్యవతైన భార్య వుండగానే .. మరో మహిళాతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఇంకో కొడుకు .. ఎందుకు అప్పు చేస్తాడో తెలీదు కానీ ఒక విలన్ కి ఐదు వందల కోట్లు బకాయి పడిఉంటాడు. అప్పు ఎలా తీర్చాలో కిందమీదా పడుతుంటాడు. ఇలాంటి అవలక్షణాలు వున్న కొడుకులని నమ్మి.. హీరో లాంటి లక్షణాలు వున్న కొడుకుని దూరం పెట్టె తండ్రి. ఇది బీసీ కాలం నాటి టెంప్లెట్ కంటే పూరతనమైన ట్రాకు. సరిగ్గా తల్లితండ్రుల షష్టిపూర్తి వేడుక జరుగుతున్నపుడే అందరూ కలిసి ఒక టీవీ సీరియల్ లాంటి గొడవ. ఈ దశలో చిన్న కొడుకుకి హీరో లాంటి ఎలివేషన్ ఇస్తారు. దీంతో తండ్రి పాత్రలో ఒకేసారి మార్పు వచ్చేస్తుంది. అప్పటివరకూ బిజినెస్ లో పరిగెత్తిన తండ్రి పాత్ర సడన్ గా నాకు ప్రశాంతమైన చావు కావాలని అంటాడు. చిన్న కొడుకుని వారసుడిగా ప్రకటిస్తాడు. ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది .

తండ్రి ప్రశాంతమైన చావు కావాలి అన్నాడే కానీ..తనకి ప్రశాంతత ఎలా వస్తుందో చెప్పడు. ఆ విషయంలో హీరో అయిన చిన్న కొడుక్కి క్లారిటీ వుండదు. అందుకే ఇంటర్వెల్ తర్వాత తనకి నచ్చింది చేస్తుంటాడు. కథ పాత గా వున్న.. టీవీ సీరియల్ లాంటి కంటెంట్ అనిపించినా.. ఎదో ఫ్యామిలీ సినిమా చూపిస్తున్నారు కదా.. చూసి వెళ్ళిపోదామని కూర్చుకున్న ప్రేక్షకుడికి సడన్ గా .. ఇందులో హీరో తమిళ తలవై విజయ్ అని గుర్తు చేస్తూ .. అతి భీవత్సమైన ఎలివేషన్స్ ఇస్తారు. హీరో ముందు వున్న లక్ష్యం ఇంటి నుంచివెళ్ళిపోయిన ఇద్దరి అన్నలని మళ్ళీ తీసురావడం. ఆ ఇద్దరు అన్నలు మాటలకి వినే రకం కాదు.. అందుకే రెండు భారీ యాక్షన్ సీన్లు కండక్ట్ చేస్తారు. పెద్దన్న కూతురుని ఎవరో ముఠా కిడ్నాప్ చేస్తింది. కిడ్నాప్ ముఠాని తుక్కుకింద కొట్టి కూతురుని తీసుకొచ్చి.. చూశావా బిడ్డ దూరమైతే ఎంత బాధ వుంటుంది. అమ్మనాన్న వున్నారు అక్కడ వెయిటింగ్ వచ్చే అంటాడు. వెంటనే పెద్దన్న వచ్చేస్తాడు. ఇప్పుడు మిడిల్ బ్రదర్ ఇంటికి రావాలి. వీడు కూడా మాటలకి వినే రకం కాదు. విలన్ చేతిలో చావుదెబ్బలు తింటాడు. అలా ఎందుకు చావు దెబ్బలు తింటున్నాడా అంటే.. అప్పుడు వస్తోంది భూమి బద్దలైపోయే డైలాగు. ‘’ రేయ్ నా బాడీ నుంచికారే ప్రతి రక్తపు చిక్క నా కుటుంబానికి నేను చెప్పుకునే క్షమాపణ’’ ఇదీ ఆ డైలాగు. అప్పటికే హీరో బోలెడు కామెడీ చేసుంటాడు. దెబ్బలు తిన్న తమ్ముడు చెప్పే ఈ డైలాగు కూడా పాలలో నీళ్ళు కలిసినట్లు చక్కగా కామెడీలో కలిసిపోయి శుభం కార్డు పడిపోతుంది.

మరి దిల్ రాజు లాంటి నిర్మాత తీసిన సినిమాలో గొప్పగా చెప్పుకోదగ్గ అంశాలు లేవా అంటే వున్నాయి. దిల్ రాజు ఇప్పటి వరకూ తీసిన సినిమాల్లో వారసుడు రిచ్ మూవీ. ప్రొడక్షన్ డిజైన్ చాలా లావిష్ గ వుంది. బాలీవుడ్ లో రాజశ్రీ వారు తీసిన సినిమాల ప్రతి ఫ్రేము గ్రాండ్ అండ్ రిచ్ లుక్ లో మెరిసిపోయింది. పాటలని భారీగా తీశారు. వంశీ పైడిపల్లి చెప్పిన పాత కథే అయినా ప్రతి సీన్ ని చాలా నీట్ గా ప్రజంట్ చేశాడు. విజువల్స్ అన్నీ వైబ్రెంట్ గా వున్నాయి. యాక్షన్ సీన్లు కూడా చాలా బాగా డిజైన్ చేశారు.

వారసుడుకి అన్నీ తానైనడిపించాడు విజయ్. ప్రతి సీన్ లో కనిపించాడు. తన గ్రేస్ స్టయిల్ డ్యాన్స్ మాసు యాక్షన్ అన్నీ చూపించాడు. సెకండ్ హాఫ్ లో విజయ్ కి ఇచ్చిన ఎలివేషన్స్ ఫ్యాన్స్ కి నచ్చుతుంది. ఈ కథ చెబుతున్నపుడు హీరోయిన్ రష్మిక పాత్ర గురించి రాయలేదు. ఎందుకంటే ఈ కథలో ఆమె అవసరం లేదు. కేవలం పాట వచ్చినప్పుడే ఒక డైలాగు చెప్పి పాటలోకి వెళ్లి డ్యాన్స్ చేసి మళ్ళీ మాయమైపోయే పాత్రది. శరత్ కుమార్ , జయసుధ హుందాగా కనిపించారు. జయసుధ ప్రజన్స్ ఫ్యామిలీకి ఒక కళ తీసుకొచ్చింది. శ్రీకాంత్, కిక్ శ్యాం పాత్రలలో కొత్తదనం లేదు. అలాగే ప్రకాష్ రాజ్ పాత్రలో కూడా. బిజినెస్ టెండర్లు ఎలా వేయాలి? ఎలా గెలవాలి అని గింజుకునే పాత్ర అది. సంగీతతో పాటు మరికొందరు నటీనటులు పరిధి మేర చేశారు

తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి ఒక ప్రధాన ఆకర్షణ. చాలా మంచి నేపధ్య సంగీతం చేశాడు. నేపధ్య సంగీతంలో వుండే ఎమోషన్ కంటెంట్ వుంటే బావుండేది. రంజితమే పాట సౌండింగ్ మాములుగా వుండదు. కార్తిక్ కెమరాపనితనం బ్రిలియంట్ గా వుంది. చాలా రిచ్ గా చూపించారు. హీరో ఫ్యామిలీ వుండే ఇల్లు ఎక్కడ తీసుకున్నారో కానీ అదొక ఇంద్రభవనంలా వుంటుంది. యోగి బాబు విజయ్ మధ్య కొన్ని కామెడీ డైలాగులు పేలాయి. అల వైకుంఠపురములో టైపు డిజైన్ చేసిన ఆఫీస్ సీన్ ఓకే అనిపిస్తుంది. నిర్మాణం పరంగా ఉన్నతంగా వుంది. అయితే సినిమా నిడివి కాస్త ఎక్కువే.

వంశీ పైడిపల్లి ఎంచుకున్న కథలో కొత్తదనం లేదు. పైగా తను అనుకున్న పాయింట్ తెరపై కనిపించలేదు. ఫ్యామిలీలో సమస్యలు వుంటాయి. ‘’కుటుంబం అన్నాక లోపాలు వుంటాయి. కానీ మనకంటూ వుండేది ఒకే ఒక కుటుంబం’’ ఇది తెరపై ఆవిష్కరించాలనేది దర్శకుడి ప్రయత్నం. కానీ సినిమా అంతా వెదికిన ఈ పాయింట్ కన్వే అయినట్లు ఎక్కడా కనిపించదు. అందుకే చివర్లో హీరో చేత ఇదే డైలాగ్ ని చెప్పించి.. హమ్మయ్య.. మొత్తానికి కథ చూపించపోయినా కనీసం వాయిస్ లో చెప్పేశామని సంతోషపడిపోయిన వైనం ఈ వారసుడిది.

ఫినిషింగ్ టచ్ : పండగ పూట పాత కథే

తెలుగు360 రేటింగ్ : 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close