వైభవ్ సూర్యవంన్షీ.. ప్రస్తుతం భారత క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తున్న పేరు ఇది. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఓపెనింగ్ బ్యాటర్ గా రంగ ప్రవేశం చేస్తూ, ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతున్నాడు. నిండా పదహారేళ్లు లేని వైభవ్.. ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ బుమ్రాని కూడా లెక్క చేయకుండా బంతుల్ని ఉతికి ఆరేస్తుంటే.. క్రికెట్ ప్రపంచం నివ్వరపోతోంది. గత ఐపీఎల్ లో తనే సెంట్రాఫ్ అట్రాక్షన్. 7 మ్యాచ్లలో 252 పరుగులు సాధించాడు. స్ట్రయిక్ రేట్ రెండొందలకు పైనే. అందులో ఓ సూపర్ సెంచరీ ఉంది. ఈ ఐపీఎల్ లో కూడా అదే జోరు. ముఖ్యంగా మంగళవారం ముంబైతో జరిగిన మ్యాచ్లో తాను బుమ్రాని ఎదుర్కొన్న తీరు అబ్బు పరుస్తోంది. గత ఐపీఎల్ లో బుమ్రా బౌలింగ్ లో ఔటైన వైభవ్.. `ఈసారి బుమ్రా బౌలింగ్ లో ఎలాగైనా పరుగులు సాధిస్తా` అని సవాల్ విసిరాడు. అనుకొన్నట్టుగానే బుమ్రాని ఓ ఆట ఆడుకొన్నాడు వైభవ్. ఎదుర్కొన్న తొలి బంతినే గ్యాలరీలోకి తరలించి, తన ఫామ్ ని చాటుకొన్నాడు. మొత్తానికి ఈ మ్యాచ్లో 14 బంతుల్ని ఎదుర్కొన్న వైభవ్ 39 పరుగులు చేసి, క్రికెట్ పండితుల దృష్టిలో మరోసారి పడ్డాడు.
వైభవ్ ని ఎక్కువ కాలం జాతీయ జట్టుకు దూరంగా ఉంచకూడదని, ఈ వయసులోనే తనని టీమ్ ఇండియాకి ఎంపిక చేస్తే, తన మనోధైర్యాన్ని మరింత పెంచినవాళ్లు అవుతారని మాజీలు సెలక్టర్లకు సూచనలకు ఇస్తున్నారు. 15 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు ఎంపికైతే ఆ మజా వేరుగా ఉంటుందని, కనీసం 20 ఏళ్ల పాటు జట్టుకు సేవలు అందించవవచ్చని, అప్పుడు సచిన్, కోహ్లీల రికార్డుల్ని తిరగరాసే అవకాశం దొరుకుతుందని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయ పడుతున్నాడు. ఐపీఎల్ నుంచి భారత జట్టులోకి వచ్చి, స్టార్లుగా మారిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వైభవ్ కూడా ఆ జాబితాలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్లలో ఇంత భీకరంగా, దూకుడుగా ఆడేవాళ్లు చాలా తక్కువ. జైస్వాల్ ఉన్నా, తనలో నిలకడ లేదు. తనతో పోలిస్తే.. వైభవ్ కి దూకుడు ఎక్కువ. ఎదుట ఉన్న బౌలర్ ఎవరైనా సరే, లెక్క చేయడు. ఇలాంటి దూకుడే టీ20కి అవసరం. సచిన్, కోహ్లి, ధోనీ, విరాట్ లా… అభిమానుల్ని తన ఆటతో స్టేడియంకి రప్పించగల సత్తా.. వైభవ్ కు ఉందనే అనిపిస్తోంది. ఈ సీజన్లో ఇలానే దూకుడు ప్రదర్శిస్తే… జాతీయ జట్టులో అతడి రాకని ఎవ్వరూ ఆపలేరు.
