తమిళనాడు రాజకీయాల్లో గత ఐదు రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. విడుతలై చిరుతైగల్ కట్చి తన మద్దతు లేఖను అధికారికంగా తమిళగ వెట్రి కళగం కు అందజేసింది. శనివారం మధ్యాహ్నం వరకు నాన్చుతూ వచ్చిన వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్, చివరి నిమిషంలో తన డిమాండ్లపై విజయ్ నుండి స్పష్టమైన హామీ పొందినట్లు సమాచారం. తన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు ద్వారా విజయ్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంలో కీలక పాత్ర పోషించిన తిరుమావళవన్, ఈ అవకాశాన్ని తన పార్టీ సామాజిక అజెండాను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకున్నారు.
వీసీకే ప్రధానంగా మూడు అంశాలపై పట్టుబట్టింది. మొదటిది, ప్రభుత్వంలో అధికార భాగస్వామ్యం . ఇందులో భాగంగా వీసీకేకు ఒక కేబినెట్ మంత్రి పదవి తో పాటు, ఉప ముఖ్యమంత్రి పదవిపై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. రెండోది, రాష్ట్రంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పని చేసే కమిషన్లను కొనసాగించడం , ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలు. మూడోది, దళిత సాధికారతకు సంబంధించిన ప్రత్యేక నిధుల కేటాయింపు. ఈ అంశాలపై విజయ్ సానుకూలంగా స్పందించడంతోనే మద్దతు లేఖను ఆదవ్ అర్జునకు తిరుమావళవన్ స్వయంగా అందజేశారు.
ఈ చర్చల్లో టీవీకే తరపున ఆదవ్ అర్జున కీలక పాత్ర పోషించారు. గతంలో వీసీకేతో ఉన్న పాత పరిచయాలను వాడుకుని, తిరుమావళవన్‌ను ఒప్పించడంలో ఆయన సఫలమయ్యారు. డీఎంకే కూటమి నుంచి బయటకు రావడం వల్ల కలిగే రాజకీయ లాభనష్టాలను వివరిస్తూనే, కొత్త ప్రభుత్వంలో వీసీకేకు దక్కే గౌరవప్రదమైన స్థానం గురించి ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం జరిగిన పార్టీ హైలెవల్ కమిటీ సమావేశంలో కూడా వీసీకే నేతలు మొదట భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా, విజయ్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటంతో ప్రతిష్టంభన తొలగిపోయింది.
ప్రస్తుతం 119 ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ పక్షం సురక్షితమైన స్థితికి చేరుకుంది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి ఈ లేఖలను సమర్పించిన వెంటనే, ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌కు ఆహ్వానం అందనుంది. ఆదివారం సాయంత్రం లోపు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండేలా ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం.
