రివ్యూ: వీర భోగ వ‌సంత రాయులు

తెలుగు360 రేటింగ్‌:1/5

ప్రయోగాత్మ‌క చిత్రాలు తీయ‌డం సాహ‌సం.

ప్ర‌యోగం బెడ‌సికొట్టిన‌ సినిమాలు చూడ‌డం అంత‌కంటే పెద్ద సాహ‌సం!

వాటితో ఇబ్బంది ఉన్నా, లేకున్నా – ప్ర‌యోగం అనుకుని కొన్ని సినిమాలు తీస్తుంటారు చూడండీ… అలాంటి సినిమా ఆడుతున్న థియేట‌ర్లో అడుగుపెట్ట‌టం అన్నింటికంటే పెద్ద సాహ‌సం. ఓ ర‌కంగా టికెట్టు పెట్టుకుని త‌ల‌నొప్పి తెచ్చుకోవ‌డం లాంటిదన్న‌మాట‌.

ప్రేక్ష‌కుల తెలివితేట‌ల్ని త‌క్కువ అంచ‌నా వేసిన‌వాళ్లు, లేదంటే త‌మ‌ని అప్ర‌క‌టిత మేధావి వ‌ర్గం అనుకునేవాళ్లు గొప్ప సినిమా తీసిన‌ట్టు చ‌రిత్ర‌లోనే లేదు. మామూలుగా చెప్పాల్సిన క‌థ‌ని అష్ట‌వంకర్లూ తిప్పి, రివ‌ర్స్ స్క్రీన్‌ప్లేతో ముందుకీ వెన‌క్కీ జ‌రిపి, ట్విస్ట్ పేర్ల‌తో ఇంకొన్ని షాక్ ట్రీట్మెంట్లు ఇచ్చి తీస్తే.. అది ప్ర‌యోగం అవ్వ‌దు. ఈ విష‌యాన్ని న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు తెలుసుకోలేక‌పోతున్నారు అన‌డానికి మొన్న‌టి `మ‌ను` ఓ ఉదాహ‌ర‌ణ‌గా నిలిస్తే… ఈరోజు `వీరభోగ‌వ‌సంత రాయులు` ఓ పాఠంగా మారింది.

క‌థ‌

హైద‌రాబాద్‌లో వ‌ర‌సపెట్టి కిడ్నాపులు జ‌రుగుతుంటాయి. ఓ కుర్రాడైతే… `మా ఇల్లు తప్పిపోయింది. మా అమ్మా నాన్న కూడా తప్పిపోయారు` అంటూ పోలీసుల‌కు కంప్లైంట్ ఇస్తాడు. ముందు పోలీసులు న‌మ్మ‌రు గానీ, ఆరా తీస్తే నిజంగానే ఇల్లుతో పాటు అమ్మా నాన్న.. క‌నిపించ‌రు. క‌ట్ చేస్తే… శ్రీ‌లంక నుంచి ఇండియా వ‌స్తున్న ఓ విమానం ఆచూకీ లేకుండా పోతుంది. అందులో క్రీడాకారులు, సెల‌బ్రెటీలూ ఉంటారు. దాంతో ప్ర‌భుత్వం ఉలిక్కి ప‌డుతుంది. ఈకేసుని విచారించ‌డానికి దీప‌క్ రెడ్డి (నారా రోహిత్‌)ని ప్ర‌త్యేక అధికారిగా నియ‌మిస్తుంది ప్ర‌భుత్వం. విమానం స‌ముద్రంలో కూలిపోయింద‌ని, ప్ర‌యాణికుల‌న్నీ చ‌నిపోయార‌ని నిర్థారించుకున్న త‌రుణంలో దీప‌క్ రెడ్డికి ఓ ఫోన్ వ‌స్తుంది. `ప్ర‌యాణికులంతా నా ద‌గ్గ‌రే క్షేమంగా ఉన్నారు. వాళ్ల‌ని విడుద‌ల చేయాలంటే.. దేశంలో క‌రుడుగ‌ట్టిన నేర‌స్థులు మూడు వంద‌ల‌మందిని ఎన్‌కౌంట‌ర్ చేయాలి` అని డిమాండ్ విధిస్తాడు. అస‌లు విమానాన్ని హైజాక్ చేసింది ఎవ‌రు? మూడు వంద‌ల‌మందిని చంపాల‌ని ఎందుకు అడిగాడు? హైద‌రాబాద్‌లోని కిడ్నాపుల‌కు, ఇల్లు త‌ప్పిపోవ‌డానికీ, ఈ హైజాక్‌కీ సంబంధం ఏమిటి? ఈ మిస్ట‌రీ ఎలా వీడింది? అనేదే క‌థ‌.

విశ్లేష‌ణ‌

తొలి స‌న్నివేశాలు చూస్తే.. ప్రేక్ష‌కుడ్ని కూర్చోబెట్ట‌డానికి ద‌ర్శ‌కుడేదో తంటాలు ప‌డుతున్నాడ‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది. కిడ్నాపులు, హైజాక్‌, ఇల్లు త‌ప్పిపోయింద‌న్న కంప్లైంట్ ఇవ‌న్నీ కాస్త ఉత్సుక‌త క‌లిగిస్తాయి. అయితే… అంత‌లోనే నీరుగారిపోయే స‌న్నివేశాలు ఒక‌దాని త‌ర‌వాత ఒక‌టి వ‌చ్చిప‌డిపోతుంటాయి. ఇంత సీరియ‌స్ ఇష్యూ న‌డుస్తుంటే… దాన్ని ప‌ట్టుకుని శ్రీ‌నివాస‌రెడ్డి అండ్ కో కామెడీ చేస్తుంటుంది. అక్క‌డే… ద‌ర్శ‌కుడిలోని సీరియెస్‌నెస్‌, నిన్సియారిటీ అర్థ‌మైపోతుంటాయి. ఓ క‌థ‌ని ఒకే జోన‌ర్‌లో చెప్ప‌డానికి మ‌న‌వాళ్లెందుకు అంత‌గా భ‌య‌ప‌డ‌తారో అర్థంకాదు. కామెడీ లేక‌పోతే జ‌నాలు చూడ‌రేమో.. అనుకుంటూ దాన్ని పిండ‌డానికి నానా అవ‌స్థ‌లూ ప‌డుతుంటారు.

శ్రీ‌నివాస‌రెడ్డితో చేయించాల‌నుకున్న కామెడీ ఆ బాప‌తే. జ‌రిగిందేమో ఓ హైజాక్‌. మూడొంద‌ల‌మంది సెల‌బ్రెటీలు, అందులోనూ క్రికెట‌ర్లు ఆ ఫ్లైట్‌లో ఉన్నారు. అలాంట‌ప్పుడు విచార‌ణ ఎంత వేగ‌వంతంగా జ‌రుగుతుంది? ఎన్ని ప‌క‌డ్బందీ వ్యూహాలుంటాయి? అయితే ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు చేష్ట‌లుండిపోతారు. అది చాల‌ద‌న్న‌ట్టు.. `ప్లీజ్ వాళ్ల‌నేం చేయ‌కు` అంటూ హైజాక‌ర్ని బ‌తిమాలుకుంటారు. దానికి తోడు లాజిక్కులు లేని విష‌యాలు బోలెడున్నాయి. ఓ ద‌శ‌లో విమాన ప్ర‌యాణికుల‌కు, వీర భోగ వ‌సంత రాయుల‌కూ సంబంధం లేద‌ని తెలుస్తుంది. అలాంట‌ప్పుడు కూడా వీర భోగ వ‌సంత రాయులు డిమాండ్‌ని తీర్చ‌డానికి అధికారులంతా రంగంలోకి దిగుతారు. అదేంటో అర్థం కాదు.

ఇక క్లైమాక్స్ అయితే.. ర‌చ్చ ర‌చ్చ‌. అప్ప‌టి వ‌ర‌కూ `వీడేదో ట్రై చేశాడులే` అన్న అభిమాన‌మైనా ఉంటుంది. కానీ క్లైమాక్స్‌లో త‌న అతి తెలివితేట‌లు చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. ఆయా సన్నివేశాలు చూస్తుంటే.. అప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన క‌థంతా మ‌రోసారి రింగు రింగులుగా తిరికి, క‌ళ్లు బైర్లు కమ్మ‌డం ఖాయంలా క‌నిపిస్తుంది. బ‌హుశా `చివ‌ర్లో నేనో అద్భుతం చూపిస్తాను. అది చూసి… ఫ్లాటైపోతారు` అని ద‌ర్శ‌కుడు ఫీలై ఉండొచ్చు. కానీ… ఆ ట్విస్టు (దీన్ని ట్విస్టు అని కూడా అన‌కూడ‌దేమో) అస‌లుకే ఎస‌రు పెట్టింది.

ఈ సినిమా చూస్తున్న‌ప్పుడు ఒకే ఒక్క విష‌యం అర్థ‌మ‌వుతుంది. ద‌ర్శ‌కుడు స్టీరింగ్‌ని త‌న చేతుల్లోకి తీసుకున్నాడు. సినిమాని త‌న ఇష్ట‌మొచ్చిన రీతిలో తిప్పాడు. త‌న‌కు కావ‌ల్సిన రోడ్డు ఎక్కించాడు. కావ‌ల్సిన చోట మ‌లుపు తిప్పాడు. కానీ గ‌మ్యం మాత్రం చేర‌లేక‌పోయాడు.

న‌టీన‌టులు

ఈ సినిమాలో సుధీర్‌, రోహిత్‌, శ్రీ‌విష్ణులేకాదు… ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, మ‌హేష్‌లు ఉన్నా ఏం చేయ‌లేరు. ఎందుకంటే ఆయా పాత్ర‌లు అలా ఉన్నాయి. శ్రీ‌విష్ణు వికారంగా క‌నిపించాడు. త‌న‌ని తెర‌పై చూసింత త‌క్కువ‌. ఫోన్లో విన్న‌ది ఎక్కువ‌. నారా రోహిత్ `చేతులు` క‌ట్టేశారు. అటూ ఇటూ తిర‌గ‌డం, ఫోన్లో మాట్లాడ‌డం త‌ప్ప చేసిందేం లేదు. శ్రీయ నోట్లో సిగ‌రెట్ పెట్టి, కొత్త‌గా ఏదో ట్రై చేశామ‌నుకున్నారు. అదీ వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. సుధీర్ బాబు డ‌బ్బింగ్‌కీ, అత‌ని యాక్టింగ్‌కీ ఓ దండం వేసుకోవాలంతే.

సాంకేతిక వ‌ర్గం

బ‌డ్జెట్ ప‌రిమితులు అడుగ‌డుగునా క‌నిపిస్తాయి. ఈ సినిమాని వీలైనంత త‌క్కువ ఖ‌ర్చుతో పూర్తి చేయాల‌ని నిర్మాత‌లు భావించి ఉంటారు. అదీ క‌రెక్టే. ఎందుకంటే ఇలాంటి క‌థ‌పై ఇంత‌కంటే ఎక్కువ రిస్కు చేయ‌డం కూడా ఇబ్బందే. పాట‌లకు స్పేస్ ఇవ్వ‌క‌పోవ‌డం ద‌ర్శ‌కుడు చేసిన ఒకే ఒక్క మంచి ప‌ని. కొత్త‌గా ఏదో చెప్పాల‌న్న ప్ర‌య‌త్నం వ‌ర‌కూ బాగుంది. కానీ.. చెప్పిన విధానం, అందుకోసం ఎంచుకున్న ప‌ద్ధ‌తీ రెండూ బాలేవు.

తీర్పు

వెడ్నెస్ డేలాంటి క‌థ‌ని… ఇంకో కోణంలో, ఇంకాస్త డిటైల్డ్‌గా చెప్పాల‌నుకున్నాడు ద‌ర్శ‌కుడు. అంత వ‌ర‌కూ ఓకే. కానీ… ఎమోష‌న్స్ లేని ఏ ప్ర‌య‌త్న‌మైనా విక‌టిస్తుంద‌న్న విష‌యం గ్ర‌హించ‌లేక‌పోయాడు. పైగా అవ‌స‌రం లేని చోట కూడా త‌న తెలివితేట‌ల్ని జోడించాల‌నుకుని భంగ‌ప‌డ్డాడు. ఈ వీర భోగ వసంత‌రాయుల్ని… బోరు వ‌సంత రాయులుగా తీర్చిదిద్దాడు.

ఫైన‌ల్ ట‌చ్‌: విక‌టించిన ప్ర‌యోగం

తెలుగు360 రేటింగ్‌:1/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close